ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!

- October 16, 2026 , by Maagulf
ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!

మనామా: బహ్రెయిన్‌లో  ఉద్యోగాల పేరుతో ప్రభుత్వ ఆర్థిక సహాయ నిధులను అక్రమంగా పొందిన కేసుల్లో ఇద్దరు నిందితులకు కోర్టు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి BD10,000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బహ్రెయిన్‌కు చెందిన లేబర్ ఫండ్‌ తమ్కీన్ (Tamkeen) అందించే ఆర్థిక సహాయాన్ని అక్రమంగా పొందేందుకు ఉద్యోగులను నకిలీగా నమోదు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. రెండు వేర్వేరు సంస్థల్లో ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

తమ్కీన్ ఫిర్యాదుతో కేసులు

తమ్కీన్ నిర్వహించిన పర్యవేక్షణ, తనిఖీల్లో అనుమానాస్పద అంశాలు గుర్తించడంతో సంస్థ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, అధికారిక రికార్డుల్లో నకిలీ పత్రాల తయారీ, వాటిని వినియోగించినట్లు వచ్చిన ఆరోపణలను కూడా పరిశీలించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణ ప్రక్రియను పూర్తి చేసి రెండు కేసులను సంబంధిత న్యాయస్థానానికి అప్పగించింది. విచారణ అనంతరం బహ్రెయిన్ ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష, BD10,000 జరిమానా విధించింది.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

తమ్కీన్ సహాయ పథకాల నిబంధనలను సంస్థలు, లబ్ధిదారులు పాటిస్తున్నారా లేదా అనే అంశంపై పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. నకిలీ ఉద్యోగాల నమోదు, వేతనాలకు సంబంధించిన తప్పుడు వివరాల సమర్పణ, పత్రాల ఫోర్జరీ వంటి నేరాలకు సంబంధించిన అనుమానాలు తలెత్తితే ఆ కేసులను చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేస్తామని తమ్కీన్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com