దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- October 18, 2026
దుబాయ్: దుబాయ్ విమానాశ్రయంలో ఓ మహిళ మరిచిపోయిన హ్యాండ్‌బ్యాగ్‌ను పోలీసులు భద్రంగా భద్రపరిచి, ఆమె తిరిగి యూఏఈకి వచ్చిన తర్వాత యథాతథంగా అప్పగించారు. బ్యాగులో నగదు, స్మార్ట్‌ఫోన్‌తో పాటు విలువైన వ్యక్తిగత వస్తువులు ఉండటంతో పోలీసులు చూపిన బాధ్యతాయుతమైన చర్యపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయం నుంచి విదేశాలకు వెళ్లే ముందు మహిళ పొరపాటున తన హ్యాండ్‌బ్యాగ్‌ను అక్కడే వదిలివెళ్లింది. విషయం గుర్తించిన వెంటనే దుబాయ్ విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు బ్యాగు కోసం గాలింపు చేపట్టారు. అవసరమైన తనిఖీలు, ధ్రువీకరణ ప్రక్రియలను పూర్తి చేసి బ్యాగును గుర్తించారు.
బ్యాగును పంపించాలా.. తిరిగి వచ్చేవరకు భద్రపరచాలా?
బ్యాగు లభించిన విషయాన్ని పోలీసులు మహిళకు తెలియజేశారు. అంతేకాకుండా, ఆమె వెళ్లిన దేశానికి బ్యాగును పంపించడం లేదా ఆమె తిరిగి దుబాయ్‌కి వచ్చే వరకు భద్రంగా ఉంచడం అనే రెండు అవకాశాలను కల్పించారు. దీంతో మహిళ రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఆమె తిరిగి యూఏఈకి వచ్చిన తర్వాత బ్యాగును అందులోని వస్తువులన్నింటితో సహా పోలీసులు అప్పగించారు.
పోలీసులపై మహిళ ప్రశంసలు
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ డైరెక్టర్ బ్రిగేడియర్ హమీద్ అల్ హషిమీ ఈ ఘటన వివరాలను వెల్లడించారు. ప్రయాణికుల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు, వారి వస్తువులను కాపాడేందుకు దుబాయ్ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై సదరు మహిళ సోషల్ మీడియాలో స్పందిస్తూ యూఏఈ ప్రభుత్వం, దుబాయ్ పోలీసులు, సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది. అధికారులు ప్రదర్శించిన వృత్తి నైపుణ్యం, నిజాయితీ, వేగవంతమైన స్పందనను ప్రశంసించింది. యూఏఈలో భద్రతా ప్రమాణాలపై తనకు మరింత నమ్మకం పెరిగిందని పేర్కొంది.ప్రయాణికుల వస్తువుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ దుబాయ్ పోలీసులు వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







