హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- October 19, 2026
మనామా: యెమెన్‌కు చెందిన హౌతీ మిలీషియాను అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు డిమాండ్ చేశాయి. ప్రాంతీయ భద్రత, శాంతి, అభివృద్ధికి ముప్పుగా పరిణమించే ఉగ్రవాద సంస్థల పట్ల అంతర్జాతీయ సమాజం అనుసరించే విధానాన్నే హౌతీల విషయంలోనూ అమలు చేయాలని పిలుపునిచ్చాయి. బహ్రెయిన్ రాజధాని మనామాలో జరిగిన జీసీసీ విదేశాంగ మంత్రుల మండలి 168వ సమావేశం ముగింపు ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది. హౌతీలకు క్షిపణులు, డ్రోన్లు సమకూరేందుకు సహకరిస్తున్న మద్దతును తక్షణమే నిలిపివేయాలని కోరింది.
సౌదీ అరేబియాపై దాడులను ఖండించిన జీసీసీ
బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ అల్ జయానీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సౌదీ అరేబియాపై హౌతీలు కొనసాగిస్తున్న దాడులను జీసీసీ తీవ్రంగా ఖండించింది. రెండు పవిత్ర మసీదులు, వాటి పరిసర ప్రాంతాలు, పౌర విమానాశ్రయాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న దాడుల వల్ల ప్రాణనష్టం, గాయాలు సంభవించడంపై విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన మండలి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. సౌదీ అరేబియా సార్వభౌమత్వం, భద్రత, ప్రయోజనాలను కాపాడేందుకు ఆ దేశం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించింది.
హౌతీలకు ఆయుధ సరఫరా నిలిపివేయాలి
యెమెన్ పరిస్థితి, హౌతీల తిరుగుబాటు, ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులకు సంబంధించి ఐరాస భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాలను కఠినంగా అమలు చేయాలని జీసీసీ కోరింది. హౌతీలపై విధించిన ఆయుధ నిషేధాన్ని పటిష్ఠంగా అమలు చేసేలా ఐరాస, అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని సూచించింది. అక్టోబర్ 15న ఐరాస భద్రతా మండలి ఏకాభిప్రాయంతో ఆమోదించిన అధ్యక్ష ప్రకటనను జీసీసీ స్వాగతించింది. సౌదీ అరేబియాపై, ముఖ్యంగా అరామ్కో సంస్థకు చెందిన సదుపాయాలపై హౌతీలు జరిపిన దాడులను ఆ ప్రకటన ఖండించింది. ఎర్ర సముద్రం, బాబ్ అల్ మందెబ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు, బెదిరింపులను కూడా తప్పుబట్టింది.
ఇరాన్‌తో చర్చల్లో గల్ఫ్ దేశాలకూ భాగస్వామ్యం కల్పించాలి
ఇరాన్‌తో కుదిరే ఏ ఒప్పందమైనా ఆ దేశ అణు కార్యక్రమం, క్షిపణి వ్యవస్థలు, డ్రోన్లు, ప్రాంతీయ అనుబంధ సంస్థలకు అందిస్తున్న మద్దతు వంటి అంశాలను పరిష్కరించాలని జీసీసీ పేర్కొంది. సార్వభౌమత్వాన్ని గౌరవించడం, పొరుగు దేశాలతో సత్సంబంధాలు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.తమ భద్రత, ప్రయోజనాలపై ప్రభావం చూపే ఏ చర్చలు లేదా ఒప్పందాల్లోనైనా జీసీసీ సభ్య దేశాలకు భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్ చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు







