కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!

- October 20, 2026 , by Maagulf
కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!

కువైట్: కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త, అల్ జాహెమ్ అండ్ మల్హోత్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ధరం వీర్ మల్హోత్రా (డి.వి. మల్హోత్రా) (87) సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కువైట్‌లోని భారతీయ వ్యాపార, ప్రవాస వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1939 జూలై 2న జన్మించిన మల్హోత్రా.. కువైట్‌లో అల్ జాహెమ్ అండ్ మల్హోత్రా గ్రూప్‌ను ప్రముఖ వ్యాపార సంస్థగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. నిత్యావసర వినియోగ వస్తువుల (FMCG) మార్కెటింగ్, పంపిణీ రంగాల్లో ఈ సంస్థ విశేష గుర్తింపు పొందింది.

మల్హోత్రా కుటుంబానికి కువైట్‌లో వ్యాపార నేపథ్యం 1940ల నుంచే ఉంది. 1980లో ఆయన ప్రస్తుత వ్యాపార నిర్మాణానికి పునాది వేశారు. అయితే, 1990లో ఇరాక్ కువైట్‌పై దాడి చేసిన సమయంలో సంస్థ భారీ నష్టాలను ఎదుర్కొంది. కువైట్ విముక్తి అనంతరం ఆయన పట్టుదలతో వ్యాపారాన్ని తిరిగి పునర్నిర్మించారు. సరఫరాదారులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ సంస్థ కార్యకలాపాలను పునరుద్ధరించారు. ఆయన నాయకత్వంలో సంస్థ గణనీయంగా అభివృద్ధి చెంది, 700 మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది.

వ్యాపార రంగంలోనే కాకుండా, సామాజిక సేవలోనూ డి.వి. మల్హోత్రా తనదైన ముద్ర వేశారు. 1990లో ఇరాక్ దాడి సమయంలో కష్టాల్లో ఉన్న భారతీయులకు నిత్యావసర వస్తువులను అందించడంలో సహాయపడ్డారు. భారత్‌లో నిరుపేద పిల్లల విద్యకు ఆయన కుటుంబం మద్దతు అందించడంతో పాటు, మతపరమైన, సంక్షేమ కార్యక్రమాలలో తరచూ పాల్గొనేవారని ఆయన సన్నిహితులు గుర్తుచేసుకుంటున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com