కువైట్ విమానాశ్రయ రుసుములపై క్లారిటీ..!!

- October 24, 2026 , by Maagulf
కువైట్ విమానాశ్రయ రుసుములపై క్లారిటీ..!!

కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వసూలు చేస్తున్న వివిధ రుసుములపై జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) స్పష్టత ఇచ్చింది. సర్క్యులర్ నం. 58/2026లో పేర్కొన్న ఛార్జీలన్నీ కొత్తవి కావని, వాటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. విమాన టికెట్ల ధరల్లో పారదర్శకతను పెంచడం, ప్రతి రుసుము వివరాలను ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయడం ఈ సర్క్యులర్‌ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అక్టోబర్ 19న జారీ చేసిన ఈ సర్క్యులర్‌పై GACA అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్ రాజ్హి మాట్లాడుతూ.. కొన్ని రుసుములు గత కొంతకాలంగా అమల్లో ఉండగా, మరికొన్ని ఇటీవల ప్రవేశపెట్టినవని తెలిపారు. విమాన టికెట్లపై ప్రతి ఛార్జీకి సంబంధించిన కోడ్‌, దాని మొత్తాన్ని విడివిడిగా స్పష్టంగా ప్రదర్శించేలా నిబంధనలను ప్రామాణీకరించడమే లక్ష్యమని వివరించారు.

టికెట్ల ధరల వివరాలు స్పష్టంగా ఉండటం వల్ల ప్రయాణికులు తాము చెల్లిస్తున్న మొత్తంలో ఏయే ఛార్జీలు ఉన్నాయో తెలుసుకోవచ్చని అల్ రాజ్హి తెలిపారు. టికెట్ రద్దు చేసుకునే సమయంలో లేదా రీఫండ్ కోరే సందర్భంలోనూ ఈ వివరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అయితే, రీఫండ్‌లు వర్తించే టికెట్ నిబంధనలు, సంబంధిత నియంత్రణలకు లోబడి ఉంటాయని స్పష్టం చేశారు.టికెట్లపై రుసుముల వివరాలు సరిగ్గా వెల్లడించకపోవడం వల్ల విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు అనుమతించిన మొత్తానికి మించి ప్రయాణికుల నుంచి వసూలు చేయకుండా నిరోధించడం కూడా ఈ సర్క్యులర్‌ లక్ష్యమని GACA వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఛార్జీలు ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయ విమానాశ్రయాల్లోనూ అమల్లో ఉన్నాయని వివరించాయి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలకు సంబంధించిన రుసుములను చేర్చడానికి లేదా సవరించడానికి GACAకు ఈ సర్క్యులర్‌ అధికారం కల్పిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించిన సంస్థలపై తదుపరి చర్యల కోసం ఫిర్యాదులు, మధ్యవర్తిత్వ కమిటీకి కేసులను పంపిస్తారు. కువైట్ విమాన రవాణా మార్కెట్ నియంత్రణకు సంబంధించిన చట్టం నం. 31 ఆఫ్ 1987లోని ఆర్టికల్ 21 ప్రకారం చర్యలు తీసుకుంటారు. ప్రయాణ విధానాలపై స్పష్టత కల్పించడం, సర్క్యులర్‌ అమలును పర్యవేక్షించడం, ప్రయాణికుల హక్కులను కాపాడటం కోసం GACA తన నియంత్రణ, పర్యవేక్షణ బాధ్యతలను కొనసాగిస్తుందని అల్ రాజ్హి వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com