బంగాళాఖాతంలో బీభత్సం..ఏపీకి భారీ వర్షాల ముప్పు!

- October 25, 2026 , by Maagulf
బంగాళాఖాతంలో బీభత్సం..ఏపీకి భారీ వర్షాల ముప్పు!

అమరావతి: బంగాళాఖాతంలో బీభత్సం నెలకొంది.. తీవ్ర వాయుగుండం వేగంగా కదులుతూ తుపానుగా మారబోతోంది. రానున్న రోజుల్లో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారనుంది. ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం:
ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నానికి సుమారు 820 కిలోమీటర్లు, కాకినాడకు 910 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1,010 కిలోమీటర్లు, బాపట్లకు 1,080 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ వ్యవస్థ సోమవారం ఉదయానికి తుపానుగా మారవచ్చని అంచనా. ఎల్లుండి ఉదయానికి తీవ్ర తుపానుగా, బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే సూచనలున్నాయి.

గంటకు 125 కి.మీ వేగం :
బుధవారం మధ్యాహ్నం బాపట్ల–విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. దీంతో తీర ప్రాంతాల్లో అప్రమత్తత అవసరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చు:
మరోవైపు, తుపాను ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. మంగళవారం ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురవవచ్చు.

సహాయక చర్యల కోసం ఏడు జాతీయ విపత్తు స్పందన బృందాలు, 8 రాష్ట్ర విపత్తు స్పందన బృందాలను రంగంలోకి దిగనున్నాయి. తుపాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఏపీలో ప్రజలు మంగళ, బుధవారాల్లో అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు. పడవలు, వలలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలి. ఉప్పొంగే అలల దగ్గర సెల్ఫీలు తీసుకోవడం, పొంగిపొర్లే వాగులు దాటడం వంటి ప్రమాదకర పనులకు దూరంగా ఉండాలి. అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com