ఒమన్‌లో ఆహార భద్రతకు భారీ ప్రోత్సాహం..!!
- November 14, 2026
మస్కట్: ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా ఒమన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా RO 100 మిలియన్లకు పైగా పెట్టుబడి విలువ కలిగిన 111 కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 2026 ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ ముగింపు సందర్భంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అధ్యక్షుడు అబ్దుస్సలాం బిన్ మొహమ్మద్ అల్ ముర్షిదీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కొత్త ప్రాజెక్టులతో పాటు మరో 16 సహాయక కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. అలాగే వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించి 10 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. దేశంలో ఆహార ఉత్పత్తిని పెంచడంతో పాటు 'సెకండ్ బిలియన్ లోకలైజేషన్' లక్ష్యాలను వేగవంతం చేయడం వీటి ఉద్దేశమని ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్ జనరల్ సూపర్వైజర్ డాక్టర్ మసూద్ బిన్ సులైమాన్ అల్ అజ్రీ తెలిపారు. స్థానికంగా ఆహార ఉత్పత్తిని పెంచడం, ఆహార పరిశ్రమలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించే చర్యలతో అనుసంధానం చేయడం ద్వారా ప్రాజెక్టుల అమలును సులభతరం చేయవచ్చని పేర్కొన్నారు.
ఒమన్ విజన్ 2040 అమలు పర్యవేక్షణ కార్యాలయ డైరెక్టర్ ఇంజినీర్ అస్మా బింట్ హమూద్ అల్ హినాయ్ మాట్లాడుతూ.. 2026-2030 పదకొండో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఆహార భద్రత కార్యక్రమాల అమలుకు ఈ ల్యాబ్ రోడ్‌మ్యాప్ రూపొందించిందని తెలిపారు. ఫుడ్ సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇప్పటివరకు మొత్తం 376 ప్రాజెక్టులు గుర్తించగా, వీటి పెట్టుబడి విలువ సుమారు RO 899 మిలియన్లకు చేరింది. ఈ ప్రాజెక్టులు నాలుగు ప్రధాన రంగాల్లో విస్తరించి ఉన్నాయి. 'సెకండ్ బిలియన్ లోకలైజేషన్' లక్ష్యంలో భాగంగా 25 రకాల కీలక వస్తువులను కూడా గుర్తించారు. కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పుధాన్యాలు, వంట నూనెలు, మాంసం, పాల ఉత్పత్తులు, చేపలు, నీరు తదితరాలను ఇందులో చేర్చారు. 2030 నాటికి వీటి స్థానిక ఉత్పత్తిని పెంచి స్వయం సమృద్ధి స్థాయిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూడు కీలక పెట్టుబడి ఒప్పందాలు
ముగింపు కార్యక్రమంలో వ్యవసాయం, మత్స్య, జల వనరుల మంత్రిత్వ శాఖకు, ప్రాజెక్టులను అమలు చేసే కంపెనీలకు మధ్య పలు పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. ఖజైన్ సీఈఓ ఇంజినీర్ సలీం బిన్ సులైమాన్ అల్ తుహ్లీ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో భాగంగా 'ఒమేగా అరేబియా' సంస్థ RO 28 మిలియన్ల పెట్టుబడితో శుద్ధి చేసిన చేప నూనె నుంచి ఒమేగా-3 తయారు చేసే ప్రత్యేక పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. సుమారు 29,888 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యాక్టరీ నిర్మించనున్నారు. 'అల్ తాజ్ అల్ జదీద్ ఇన్వెస్ట్మెంట్' సంస్థ RO 1.554 మిలియన్ల పెట్టుబడితో మినరల్ వాటర్, స్పార్క్లింగ్ వాటర్, శీతల పానీయాలు, పాల ఉత్పత్తులు, టమాటా ఉత్పత్తులను తయారు చేసే సమీకృత పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 10,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు.
అలాగే 'అల్ అతా ఫుడ్ ఇండస్ట్రీస్' సంస్థ RO 600,000 పెట్టుబడితో ఫ్రోజెన్, సెమీ ఫ్రైడ్ బంగాళాదుంపల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. 5,243 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ పరిశ్రమ ద్వారా స్థానిక మార్కెట్ అవసరాలను తీర్చడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ చేకూరనుంది. స్థానిక ఆహార ఉత్పత్తిని పెంచడం, ఆహార పరిశ్రమల్లో పెట్టుబడులను ఆకర్షించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా 2030 నాటికి ఆహార భద్రత రంగంలో ఒమన్ మరింత స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టులు చేపడుతోంది.
తాజా వార్తలు
- ఎడారులను పచ్చదనంగా మార్చేందుకు సౌదీ కొత్త ప్రణాళిక..!!
- కువైట్‌లో వ్యవసాయ ఉత్పత్తి 12.65 శాతం తగ్గుదల..!!
- ఒమన్‌లో ఆహార భద్రతకు భారీ ప్రోత్సాహం..!!
- ఖతార్ – టర్కియే మధ్య కీలక రక్షణ ఒప్పందం..!!
- షార్జా, రస్ అల్ ఖైమా బీచ్‌లలో సందర్శకుల సందడి..!!
- సౌదీ అరేబియా విమాన సర్వీసుల నిలిపివేతను పొడిగించిన ఎయిర్ ఇండియా, ఇండిగో
- నాలుగు గంటలకు పైగా నిలిచిపోయిన అమెరికా విమాన సర్వీసులు..
- ఫిబ్రవరి 28 నుంచి గల్ఫ్ దేశాలపై 7,000కు పైగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు: జీసీసీ ప్రధాన కార్యదర్శి
- సీఐఐ సదస్సు విజయవంతం..
- కొత్తగూడెం విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ !







