ఎడారులను పచ్చదనంగా మార్చేందుకు సౌదీ కొత్త ప్రణాళిక..!!

- November 14, 2026 , by Maagulf
ఎడారులను పచ్చదనంగా మార్చేందుకు సౌదీ కొత్త ప్రణాళిక..!!
రియాద్: ఎడారి ప్రాంతాలను పచ్చదనంతో నింపడంతోపాటు పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు సౌదీ అరేబియా భారీ ప్రణాళికను అమలు చేస్తోంది. సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ (SGI)లో భాగంగా 2030 నాటికి 600 మిలియన్ చెట్లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నీటి వనరులపై అదనపు భారం పడకుండా ఈ లక్ష్యాన్ని ఎలా సాధించాలన్నది ప్రధాన సవాలుగా మారింది. సౌదీ పర్యావరణ, జల, వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2026 ప్రారంభం నాటికి దేశవ్యాప్తంగా 159 మిలియన్లకు పైగా చెట్లను నాటడంతోపాటు, క్షీణించిన 1 మిలియన్ హెక్టార్ల భూమిని పునరుద్ధరించారు. 2021 మార్చిలో ప్రారంభించిన సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్‌లో భాగంగా చివరకు 10 బిలియన్ చెట్లను పెంచడం దీర్ఘకాలిక లక్ష్యం.
 
కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (KAUST)కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్తలు థామస్ క్రౌథర్, అలెగ్జాండర్ రోసాడో ఈ లక్ష్యం సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. అయితే కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా, సహజంగా వృక్ష సంపద తిరిగి అభివృద్ధి చెందే పరిస్థితులను కల్పించడం కూడా అవసరమని పేర్కొన్నారు. కరువు, అధికంగా పశువులను మేపడం వల్ల సౌదీలో మొక్కల పెరుగుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని క్రౌథర్ వివరించారు. ముఖ్యంగా లోయలు, నీరు సహజంగా నిలిచే ప్రాంతాల్లో మొక్కలు పెరిగేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని తెలిపారు. పశువుల మేతను నియంత్రించడం ద్వారా చిన్న మొక్కలు బలంగా పెరిగే అవకాశం కల్పించాలని సూచించారు.
 
మొదటి నెలలు కీలకం
 
మొక్కలు నాటిన తర్వాత తొలి కొన్ని నెలలు వాటి మనుగడకు అత్యంత కీలకమని రోసాడో తెలిపారు. స్థానిక వాతావరణానికి అనుకూలమైన మొక్కలను ఎంపిక చేయడం, చల్లని నెలల్లో నాటడం, అవసరమైన మేరకు నీరు అందించడం, పశువుల నుంచి రక్షించడం ద్వారా మొక్కల మనుగడ శాతాన్ని పెంచవచ్చని చెప్పారు. కరువు పరిస్థితులను తట్టుకునే స్థానిక మొక్కలైన సిద్ర్ చెట్లు బలంగా పెరిగేందుకు ప్రత్యేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునే సూక్ష్మజీవులు మొక్కల వేళ్లు అభివృద్ధి చెందడానికి, నీటి అవసరాన్ని తగ్గించడానికి ఎంతవరకు సహాయపడతాయన్న అంశంపై KAUST శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.
 
నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి
 
600 మిలియన్ చెట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం శుద్ధి చేసిన మురుగునీటిని తిరిగి వినియోగించడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నేలలో తేమ ఆధారంగా నీటిపారుదల చేపట్టడం వంటి విధానాలను ప్రోత్సహిస్తున్నారు. డ్యామ్‌ల నీరు, వర్షపు నీటి సేకరణ ద్వారా భూముల పునరుద్ధరణ కార్యక్రమాలకు మద్దతు లభిస్తోందని పర్యావరణ, జల, వ్యవసాయ శాఖ మంత్రి అబ్దుల్‌రహ్మాన్ అల్ ఫద్లీ తెలిపారు. మడ అడవుల పునరుద్ధరణకు ప్రాధాన్యం
 
సౌదీ అరేబియా తీర ప్రాంతాల్లో మడ అడవుల (Mangroves) అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఇవి సముద్ర జీవులకు ఆవాసాలుగా ఉండటంతోపాటు, తీర ప్రాంతాలను ప్రకృతి విపత్తుల నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మడ అడవులు కార్బన్‌ను నిల్వ చేయడం, చేపలు సహా సముద్ర జీవుల సంతానోత్పత్తికి అనువైన వాతావరణాన్ని కల్పించడం వంటి ప్రయోజనాలను అందిస్తాయని రోసాడో వివరించారు. ముఖ్యంగా సముద్రపు నీరు, సహజమైన ఆటుపోట్ల ద్వారా ఇవి పెరుగుతాయి కాబట్టి, భూభాగంలోని మొక్కలతో పోలిస్తే మంచినీటి అవసరం తక్కువగా ఉంటుందని తెలిపారు.
 
చెట్ల సంఖ్యే విజయానికి కొలమానం కాదు
 
ఇప్పటివరకు ఎన్ని చెట్లు నాటామన్న లెక్కల కంటే, వాటిలో ఎన్ని బతికి పెరుగుతున్నాయి? పర్యావరణానికి ఎంత ప్రయోజనం కలుగుతోంది? అన్న అంశాలే ముఖ్యమని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన వృక్ష సంపద అభివృద్ధి చెంది, జీవవైవిధ్యానికి తోడ్పడుతూ, సహజంగానే తిరిగి పెరిగే పరిస్థితులు ఏర్పడినప్పుడే పర్యావరణ పునరుద్ధరణ విజయవంతమైనట్లు భావించాలని వారు స్పష్టం చేశారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com