‘భోగి’ ఫస్ట్ కాపీ చూశాక చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది: హీరో శర్వా నంద్
- November 22, 2026
‘భోగి’ సినిమాతో శర్వానంద్ కి నేషనల్ అవార్డు రావాలి: డైరెక్టర్ సంపత్ నంది
-చార్మింగ్ స్టార్ శర్వా, సంపత్ నంది, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక చిత్రం ‘భోగి’ సర్వైవల్, మిస్టరీ, పవర్ ఫుల్ ట్రైలర్ లాంచ్
చార్మింగ్ స్టార్ శర్వా తన ప్రతిష్టాత్మక చిత్రం ‘భోగి’ తో రగ్గడ్, ఇంటెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది. తాజాగా మేకర్స్ గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. సినిమాలోని ఆసక్తికరమైన ప్రపంచం, మిస్టరీతో కూడిన సంఘటనలు, వాటిని ఎదుర్కొనే కథానాయకుడి పోరాటాన్ని ట్రైలర్లో చూపించారు.
1960వ దశకం ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ట్రైలర్లో గంగ పాత్రను పరిచయం చేశారు. తన చెల్లెళ్లతో గంగకు ఎంతో అనుబంధం ఉంటుంది. వారిని సొంత కూతుళ్లలా చూసుకుంటాడు. అయితే ఆ గ్రామం మొత్తం ఒక భూస్వామి ఆధీనంలో ఉంటుంది. అతని అధికారమే గ్రామస్తుల జీవితాలను శాసిస్తుంటుంది. ఆ గ్రామంలో ఒక వింత సంఘటన జరుగుతుంటుంది. ప్రతి అమావాస్య తర్వాత రోజు, సంప్రదాయంగా నిర్వహించే దిష్టి పూజ అనంతరం కొంతమంది యువకులు రహస్యంగా అదృశ్యమవుతుంటారు. అసలు ఆ యువకులు ఎందుకు మాయమవుతున్నారు? గ్రామంలో దాగి ఉన్న రహస్యాలు ఏమిటి? ఈ పరిస్థితులను గంగ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా కథలో కీలకంగా ఉండబోతోంది.
ఇంటెన్స్ కథలను, భారీ స్థాయి కథనాలను తెరకెక్కించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సంపత్ నంది ఈసారి మిస్టరీ అంశాలతో కూడిన రస్టిక్ డ్రామాను రూపొందించారు. ట్రైలర్లో చూపించిన వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టరైజేషన్స్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. పైకి కనిపించే కథకు మించి ఇందులో మరిన్ని రహస్యాలు ఉన్నాయనే ఆసక్తిని ట్రైలర్ కలిగిస్తోంది.గంగ పాత్రలో శర్వా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. తన చెల్లెళ్లపై ఎంతో ప్రేమ, బాధ్యత ఉన్న ఒక పల్లెటూరి యువకుడిగా కనిపించారు. అదే సమయంలో తనకు ఎదురైన సవాళ్లను, గ్రామంలో ప్రశాంతతకు ముప్పు కలిగించే పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో ఎంతో వైల్డ్ గా మారుతారు. తెలంగాణ యాసలో చెప్పిన డైలాగులు, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రకు మరింత బలాన్ని ఇచ్చాయి.అనుపమ పరమేశ్వరన్ ఆయనకు జోడీగా నటిస్తూ మంచి ఇంపాక్ట్ చూపించారు. డింపుల్ హయతి విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. మిగతా నటీనటుల పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండబోతున్నాయి.
1960ల కాలం నాటి వాతావరణాన్ని కిరణ్ కుమార్ మన్నె ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా చూపిస్తోంది. సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ ఆరోకియా గ్రామీణ వాతావరణాన్ని, కథలోని రా నేచర్‌ను తన విజువల్స్‌తో చక్కగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని టెన్షన్, ఇంటెన్సిటీని మరింత పెంచింది. సస్పెన్స్, రా యాక్షన్, ఊహించని ట్విస్టులతో ‘భోగి’ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన అనుభూతిని ఇవ్వబోతోందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 27న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో శర్వానంద్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ప్రతి సినిమాకీ ఒక టెన్షన్ ఉంటుంది. కాకపోతే ఈ సినిమాకి నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఫస్ట్ కాపీ చూసినప్పుడే ఒక తెలియని సంతృప్తిని ఇచ్చాడు మా సంపత్ నంది. తను కథ చెప్పినప్పుడు నేను చాలాసార్లు టెన్షన్ పడ్డాను. డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఈ భాష నాకు కరెక్ట్‌గా వస్తుందా? నేను చెప్పగలనా? అనిపించింది. ఎందుకంటే ప్రతి భాష ఒక తల్లిలాంటిది. మనం అమ్మతో మాట్లాడినప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడతామో, భాష విషయంలో కూడా ఆ గౌరవం మనకు ఉండాలి. ఈ సినిమాలో నా పాత్రతో మీ అందరినీ కన్విన్స్ చేయగలనని అనుకుంటున్నాను. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా ఒక కథను నమ్మి, శర్వా ఒక నటుడిగా ఈ పాత్ర చేయగలడని బలంగా నమ్మారు మా నిర్మాత. అంత మంచి కథ చేసినందుకు రాధా మోహన్ గారికి థాంక్యూ. ఆయనకు ఎలాంటి కష్టం రాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ ఎలాంటి కష్టం వచ్చినా మేమంతా ఆయన వెంట నిలబడతాం. అలాగే డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు ఎక్స్ట్రార్డినరీ హార్డ్ వర్క్ చేశారు. 1960లో పరిస్థితులు ఎలా ఉండేవో అచ్చంగా అలాగే చూపించారు. కేకే అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. భీమ్స్‌తో నా జర్నీ నరేష్ గారు చేసిన సినిమాతో మొదలైంది. ఇప్పుడు ‘భోగి’ సినిమాతో మళ్లీ వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన క్రియేట్ చేసిన పాటలు మామూలుగా ఉండవు. చచ్చిపోయే వరకు గుర్తుండిపోయే పాటలు ఇవి. అంత అద్భుతంగా మ్యూజిక్ చేశారు. అలాగే ఈ సినిమాకి మరో ప్రధాన బలం మా చంద్రబోస్ గారు. ఒక్కొక్క పదం అద్భుతంగా రాశారు. పాటలకు ప్రతిరోజూ లక్షల వ్యూస్ పెరుగుతున్నాయి. ఇది డబ్బు పెట్టి, పుష్ చేసి చేసిన సినిమా కాదు. సినిమా మీద నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను. అనుపమ, డింపుల్‌తో పాటు నా చెల్లెలి పాత్ర చేసిన అమ్మాయి.. ఇలా అందరూ అద్భుతంగా నటించారు. ఇమేజ్ను పక్కనపెట్టి, కథను నమ్మి చేసిన సినిమా ఇది. సంపత్ నందికి మాస్ మీటర్ బాగా తెలుసు. ఇందులో అందరి పెర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది.దిలీప్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. గుణ్ణం గంగరాజు, దేవా కట్టా, సుజిత్, సంపత్ నంది.. నా కెరీర్లో ఈ నలుగురినీ మర్చిపోలేను. ‘భోగి’ సినిమాతో సంపత్ నంది నాలో కొత్త యాంగిల్‌ను ఇండస్ట్రీకి చూపించారు. సంపత్ కి థాంక్యూ. ‘భోగి’ గురించి చెప్పాలంటే.. తగ్గినోడికి తగలబెట్టడం కూడా తెలుసు. అనవసరంగా కెలకకండి.. తగలబెట్టి పడేస్తాడు. అందరికీ థాంక్యూ వెరీ మచ్. లవ్ యూ!
డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ రిలీజ్ అయిన తర్వాత విష్ చేసిన మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్, సాయి ధరమ్ తేజ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ సినిమాను అభినందించారు. వాళ్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది సంక్రాంతికి ముందు వచ్చే భోగి కాదు. చెడును చంపిన తర్వాత వచ్చే భోగి. బొగ్గులకుంట అనే గ్రామంలో చాలా కాలంగా ఉన్న బానిసత్వాన్ని, కొన్ని నమ్మకాలను మంటలో వేసి కొత్త వెలుగును నింపే క్యారెక్టర్లో మా హీరో శర్వానంద్ కనిపిస్తారు. తెలంగాణలోని బొగ్గులకుంట గ్రామంలో జరిగే కథ ఇది. ఈ ప్రపంచమంతా ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అద్భుతమైన అనుబంధం చుట్టూ రాసుకున్న కథ ‘భోగి’. ఈ సినిమా కోసం ఒక కొత్త దర్శకుడిలా పనిచేశాను. నేను ఈ సినిమా కోసం రోజుకు 16 గంటలు పనిచేస్తే, నా టీమ్ 20 గంటలు పనిచేసింది. ఈ కథ నేను చెప్పిన ఏకైక హీరో చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారు. ఈ కథను ఆయనకు తప్ప మరొకరితో షేర్ చేసుకోలేదు. ఆయన కథ విన్న వెంటనే ఓకే చేశారు. అలా మొదలైన మా ప్రయాణం మూడేళ్లు కొనసాగింది. ఆయన ఇండియాలోనే ఉన్న ఫైనెస్ట్ యాక్టర్స్‌లో ఒకరు. ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజీ ఉంటుంది. శర్వానంద్ గారి క్లోజప్ షాట్స్ అద్భుతంగా ఉంటాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అంత అద్భుతంగా నటించారు. ఈ సినిమాతో శర్వానంద్ గారికి నేషనల్ అవార్డు రావాలి. అంత అద్భుతంగా చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత శర్వానంద్ ఫోన్ చేసి, "మా అమ్మ నాకు జన్మనిస్తే, మీరు నాకు మరో జన్మనిచ్చారు" అని చెప్పారు. ఒక డైరెక్టర్‌కు ఒక హీరో చెప్పే మాటకంటే గొప్ప అవార్డు ఉండదు. ఆ రోజే నేను సక్సెస్ అయిపోయాను. ఇప్పటివరకు శర్వానంద్ బెస్ట్ చూశారు. ఈ సినిమాలో ఆయనలోని బీస్ట్ చూస్తారు. అలాగే అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. డింపుల్ కూడా ఈ సినిమాలో చాలా కొత్త క్యారెక్టర్ చేసింది. ఇందులో పర్శి గ్యాంగ్ మిమ్మల్ని భయపెడుతుంది. వాళ్ల పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చెల్లెలి పాత్రల్లో నటించిన అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. భీమ్స్ అద్భుతమైన పాటలు ఇచ్చారు. చంద్రబోస్ గారు ఈ సినిమా కోసం అన్ని పాటలు రాశారు. నాతో పాటు గత ఏడాదిగా ప్రయాణిస్తూనే ఉన్నారు. ఆయన సాహిత్యం వల్ల ఈ పాటలకు ఈరోజు ఇంత ఆదరణ లభించింది. ఇందులో కొన్ని పాటలు వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతంగా రాశారు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రాధామోహన్ గారితో నా జర్నీ ఎప్పుడూ సక్సెస్‌ఫుల్‌గానే ఉంటుంది. ‘భోగి’ కూడా అద్భుతమైన విజయం కాబోతోంది. నేను ఆయనలో నా తండ్రిని చూసుకుంటాను. ఏ ప్రాబ్లమ్ వచ్చినా ఆయన పక్కన ఉంటాను. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమా చేశాడనే దృష్టితో చూడండి. మీకు నచ్చితే పదిమందికి చెప్పండి. మీడియాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఒక్కటే. అందరికీ థాంక్ యూ.
హీరోయిన్ డింపుల్ హయతి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నేను చాలా కొత్త క్యారెక్టర్ చేశాను. ఇప్పటివరకు నా గ్లామర్ సాంగ్స్, డాన్స్ చూశారు. కానీ ఇది మాత్రం చాలా వైవిధ్యమైన క్యారెక్టర్. మందారం అనే పాత్ర చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. ఇలాంటి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నంది గారికి ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడాను. అనుపమతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. శర్వానంద్ గారు ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు. కచ్చితంగా ఈ సినిమా ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను.
నిర్మాత కేకే రాధామోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శర్వానంద్ గారికి ధన్యవాదాలు. మా టీమ్ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పనిచేశారు. ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులకు ఒక క్వాలిటీ సినిమా ఇవ్వాలని ప్రయత్నించాం. అందరూ కూడా సినిమాకి ప్రాణం పెట్టి పనిచేశారు. శర్వానంద్ గారు పడిన కష్టం నేను కళ్లారా చూశాను. ఇది ఆయనకు డిఫరెంట్ మూవీ. ఆయన కష్టానికి ఫలితంగా ఆడియన్స్ ఈ సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. నవంబర్ 27న తప్పకుండా అందరూ థియేటర్లలో చూడండి. మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈ సినిమాను చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ.. నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకు మొదట అడ్వాన్స్ ఇచ్చింది రాధామోహన్ గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవ్వాల్సింది కూడా సంపత్ నంది గారి సినిమా ద్వారానే. సంపత్ నంది తో కలిసి ‘రచ్చ’ సినిమాకి పనిచేశాను. నా మొదటి సినిమా శర్వా గారితో చేశాను. సంపత్ నంది మమ్మల్ని పెంచి పోషించి పెద్ద చేశారు. నాకు తోడుగా నిలిచిన పెద్దన్న సంపత్ నంది. ఆయన మాకు మార్గదర్శకంగా ఉన్నారు. నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ‘భోగి’ కోసం శర్వానంద్, సంపత్ నంది చాలా కష్టపడ్డారు. ఈ సినిమాకి ఏం చేయాలో అవన్నీ చేశాను. ఈ సినిమా కోసం శర్వానంద్ పడిన కష్టాన్ని మీరు థియేటర్లలో చూస్తారు. ఆయన కష్టం కోసం మేమందరం నిలబడ్డాం. రాధామోహన్ ఈ సినిమా కోసం పడిన శ్రమ, చేసిన కష్టం వృథా పోవు. ఆయన నమ్మకం నిజమవుతుంది. ‘భోగి’ సినిమా మామూలుగా లేదు. ఫైట్స్, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కచ్చితంగా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను.
డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచందర్ నాయక్ మాట్లాడుతూ.. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో ‘శతమానం భవతి’ లాంటి అద్భుతమైన సినిమా వచ్చింది. అలాగే సంపత్ నంది, రాధామోహన్ కాంబినేషన్లో ‘బెంగాల్ టైగర్’ వచ్చింది. ఇప్పుడు ‘భోగి’ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబోస్ అద్భుతమైన పాటలు రాశారు. భీమ్స్ మ్యూజిక్ వింటుంటే మన పల్లె వాతావరణం గుర్తుకొస్తుంది. ఆయన అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. మళ్లీ పాత రోజులను తలపించేలా ఈ సినిమాను తీర్చిదిద్దిన టీమ్ అందరికీ అభినందనలు.
లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ..నేను పుట్టిన గడ్డ తాలూకు భాష, యాస ఈ చిత్రంలో పాటలు రాసే అవకాశం నాకు దక్కింది. అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సంపత్ నంది గారికి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శర్వానంద్ గారు ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నా సాహితీ ప్రస్థానంలో నిలిచిపోయే కొన్ని , పదాలు రాసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.
కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ మాట్లాడుతూ..ఇందులో 'ఎగిలి వారంగా’ సాంగ్ కాన్సెప్ట్ సంపత్ నంది గారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది. అదొక హీరో ఇంట్రడక్షన్ సాంగ్. అందులో యాక్షన్ ఉండదు. కానీ అద్భుతమైన కథ వుంది. ఆ పాట కచ్చితంగా మీ అందరినీ కదిలిస్తుంది. సంపత్ నంది గారు, శర్వానంద్ గారిలో ఒక ఫైర్ చూశాను. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సంపత్ నంది గారికి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
డీఓపీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ..ఈ సినిమా నాకు చాలా కొత్త అనుభవం. ఇక్కడి సామాజిక పరిస్థితులు, గ్రామంలో ఉండే వైవిధ్యం, పల్లె జీవనం.. ఇవన్నీ కూడా నేను ఎంతో నేర్చుకున్నాను. అలాగే సంపత్ నంది నుంచి హ్యూమన్ ఎమోషన్స్ గురించి నేర్చుకున్నాను. ఆయన వాటిని అద్భుతంగా తెరపై పండించారు. ఈ సినిమాను షూట్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్‌తో కూడుకున్న విషయం. మా నిర్మాత ఎంతో పాజిటివ్‌గా ఉండి అన్నివిధాలా సహకరించారు. ఆయన ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరు రాధామోహన్.ఆర్ట్ డైరెక్టర్ కూడా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. శర్వా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఇది 100% హిట్ సినిమా'. ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు
- లిబియాలో రష్యా నౌకపై డ్రోన్ దాడి అనుమానం.. బెంఘాజీ నౌకాశ్రయంలో భారీ పేలుడు
- రష్యా పౌరుడిని ఎయిర్ లిఫ్ట్ చేసిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- సౌదీలో అక్రమ నివాసులపై భారీ చర్యలు..!!
- ఖతార్‌లో ఇక పేపర్ సిక్‌లీవ్ సర్టిఫికెట్లకు సెలవు..!
- కువైట్‌లో 10 మంది అరెస్ట్, 6 వాహనాలు స్వాధీనం..!!
- ఇరాన్ దాడులపై UN కు బహ్రెయిన్ ఫిర్యాదు..!!







