ఒక్క రోజే 1300 ఎకరాలు....!
- October 15, 2016
కృష్ణా జిల్లాలో బందరు పోర్టు భూసమీకరణ ఊపందుకొంది. శనివారం ఒక్క రోజే 1300 ఎకరాలను ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. మచిలీపట్నం ఏరియా డెవల్‌పమెంట్ అథారిటీ (ఎంఏడీఏ- మడ) కార్యాలయాన్ని మంత్రి నారాయణ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో రైతులు బైకులపై ర్యాలీగా తరలివచ్చారు. భూసమీకరణకు భూములు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ పత్రాలను అందజేశారు.వీరిని మంత్రులు అభినందించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన రైతులు భూసమీకరణలో పాలుపంచుకోవాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్న చైనా, జపాన్, సింగపూర్ వంటి దేశాల అభివృద్ధిలో పోర్టులు కీలకపాత్ర పోషించాయన్నారు. 13 కోట్ల జనాభా ఉన్న జపాన్‌లో 1020 పోర్టులు, చైనాలో 2 వేల పోర్టులు ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 14 పోర్టులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న బందరు పోర్టుకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. బందరు పోర్టు, పోర్టు అధారిత పరిశ్రమల నిర్మాణానికి అవసరమైన భూసమీకరణ 'మడ' ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. పోర్టు భూసమీకరణపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి నారాయణ విమర్శించారు. రాజధాని భూముల విషయంలోనూ ప్రతిపక్షాలు కాకిగోల చేశాయన్నారు. రాజధాని కోసం తీసుకున్న 33 వేల ఎకరాల్లో రోడ్లు, పార్కులు, డ్రైనేజీలతో పాటు రైతులకు ప్లాట్లు పంపిణీ చేయగా ప్రభుత్వం వద్ద కేవలం 6 వేల ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు. బందరు పోర్టు విషయంలోను అలాగే జరుగుతుందన్నారు. పోర్టు, పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులకు ఎలాంటి అన్యాయం జరగదన్నారు. రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉండగా ఎలాంటి అభివృద్ధిని ఆశించామో అధికారంలోకి వచ్చాక దాని కోసమే పని చేస్తున్నామన్నారు. బందరు పోర్టును నిర్మించి తీరుతామన్నారు. సభకు అధ్యక్షత వహించిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. అధికారంలో ఉండగా అభివృద్ధి గురించి పట్టించుకోని నాయకులు ఇప్పుడు అక్కసుతో అడ్డు పడుతున్నారన్నారు. బందరు పోర్టును అడ్డుకోవాలని చూస్తే బంగాళాఖాతంలో కలిసి పోతారని విపక్షాలను హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. బైకు ర్యాలీలో మంత్రులు భూసమీకరణకు అంగీకారపత్రాలు ఇచ్చేందుకు బైకులపై రైతులు ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు నారాయణ, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు. బందరు పోర్టు కోసం ఇప్పటి వరకు 250 ఎకరాలను సమీకరించగా, శనివారం మరో 1300 ఎకరాలకు రైతులు అంగీకారపత్రాలను అందజేశారు. దీంతో మొత్తం 1550 ఎకరాలు సమీకరించినట్లయింది. శనివారం నాటి ఉదంతంతో భూసమీకరణ మరింత ఊపు అందుకుంటుందని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







