నాగార్జున హర్రర్ సినిమాలో...

- November 27, 2016 , by Maagulf
నాగార్జున హర్రర్ సినిమాలో...

అక్కినేని సోగ్గాడు నాగార్జున సంచలన ప్రకటన చేశారు. తన జీవితంలో తొలిసారి ఓ హర్రర్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. అది కూడా ఓ చిన్న డైరెక్టర్‌తో నాగార్జున నటిస్తుండడం విశేషం. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఎంతో కష్టపడి డైరెక్టర్‌గా ఎదిగిన ఓంకార్‌తో నాగ్ ఈ హర్రర్ సినిమాను చేస్తున్నారు. పివీపీ సినిమా మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నాగార్జున కొత్త సినిమా రాజుగారి గది-2 షూటింగ్ ఆదివారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ హర్రర్ సినిమాలో నాగార్జున హీరోగా నటిస్తున్నారు. ఆయనకు ఇదే తొలి హర్రర్ సినిమా. ఈ చిత్రానికి డైరెక్టర్ ఓంకార్. ఈ సందర్భంగా నాగార్జున మీడియాతో మాట్లాడుతూ..మనం సినిమాతో తన కెరీర్లో మళ్లీ మలుపు ప్రారంభమైందన్నారు. సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి, ఇప్పుడు రాజుగారి గది-2 ప్రారంభమైందని చెప్పారు. అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్లని ఆయన అన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓం నమో వెంకటేశాయ సినిమా తర్వాత ఏం చేయాలని అనుకున్న సమయంలో పీవీపి, నిరంజన్‌లు తనను కలిసి ఓంకార్ వద్ద ఒక సబ్జెక్ట్ ఉందని, అది థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్..చేస్తారా అని అడిగారని.. అయితే తనకు కూడా థ్రిల్లర్, హర్రర్ మధ్య ఉండే ఒక క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో కోరిక ఉందని నాగార్జున తెలిపారు. అసలు రాజుగారి గది ఒరిజనల్ సినిమా కూడా చూడలేదని, కానీ ఓంకార్ గురించి తనకు తెలుసునని, ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చిందని, ఇందులో ఇంత మంచి క్యారెక్టర్ ఉంటుందని ఊహించలేదని ఆయన అన్నారు. రాజుగారి గది-2 సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని నాగ్ తెలిపారు.ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com