అమీర్‌ పేటలో సినిమా రివ్యూ

- December 16, 2016 , by Maagulf
అమీర్‌ పేటలో సినిమా రివ్యూ

చిత్రం: అమీర్‌ పేటలో... 
నటీనటులు: శ్రీ.. అశ్విని.. సాయి.. రాజు.. తిలక్‌.. సోనియా.. మమత.. తదితరులు 
సంగీతం: మురళి లియాన్‌ 
ఛాయాగ్రహణం: గోరా 
కూర్పు: హేమంత్‌ 
నిర్మాత: మహేష్‌ ఎం.
దర్శకత్వం: శ్రీ 
సంస్థ: పద్మశ్రీ క్రియేషన్స్‌ 
విడుదల: 16-12-2016
సందేశం ఎప్పుడూ వినోదపు పూత పూసి చెప్పాల్సిందే. చేదు మాత్ర ఆరోగ్యానికి మంచిదే అయినా.. దానికి తీపి కోటింగ్‌ ఉండాల్సిందే. పైగా యువతరానికి ఓ మంచి మాట చెప్పాలనుకొన్నప్పుడు దాని చుట్టూ వాళ్లకు ఇష్టమైన అంశాల్ని మేళవిస్తూ విశ్లేషించాల్సిందే. అప్పుడే మనసుకు సూటిగా తాకుతుంది. 'అమీర్‌పేటలో' సినిమాతో అలాంటి ప్రయత్నమే చేసింది చిత్రబృందం. మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకొంటూ వీలైతే పక్కవాళ్లకూ సహాయపడండి అనే సందేశాన్ని.. యువతకు చెప్పారు. మరి ఆ ప్రయత్నం ఎలా సాగిందో తెలియాలంటే 'అమీర్‌ పేట'లో అడుగు పెట్టాల్సిందే.
కథేంటంటే...: వివేక్‌ (శ్రీ) సినిమా హీరో అవ్వాలని హైదరాబాద్‌ వస్తాడు. అమీర్‌పేటలో స్నేహితులతో కలసి సినిమా అవకాశాల వేటలో ఉంటాడు. అతనికి వెన్నెల (అశ్విని) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. డేటింగ్‌ పేరుతో ఆమెతో కలసి తన సరదాలు తీర్చుకొందామనుకొంటాడు వివేక్‌. కానీ వెన్నెల ఆ అవకాశం ఎంత మాత్రం ఇవ్వదు. కానీ మనస్ఫూర్తిగా వివేక్‌ని ప్రేమిస్తుంది. లింగు (సాయి), వెంకట్రావు (రాజు), బిర్యాని బిట్టు (తిలక్‌) వీళ్లంతా ఉద్యోగాల కోసం అమీర్‌పేటలో తిష్ట వేసినవాళ్లే. కానీ.. తమ సరదాలు తీర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. వీళ్లందరినీ వెన్నెల ఎలా మార్చింది? మంచి మార్గం వైపు ఎలా నడిపించింది? అనేదే 'అమీర్‌ పేటలో' కథ.
ఎలా ఉందంటే..: యువతరం సినిమా, పైగా వాళ్ల సరదాలు, ప్రేమ పేరుతో వేసే వెర్రి వేషాలూ నేపథ్యంలో సాగే కథ. దాంతో 'బూతు' ధ్వనించే ఆస్కారం ఎక్కువగా ఉంది. కానీ చిత్రబృందం మాత్రం ఆ గీత దాటకుండా, యువతరం ఆలోచనల్ని తెరపై చూపించగలిగింది. తొలి సన్నివేశాలు చూస్తే కేవలం యూత్‌ కోసం చేసిన ప్రయత్నం అనిపిస్తుంది. హాస్టల్‌లో అమ్మాయిలు చేసే అల్లరి, అమ్మాయిల్ని ప్రేమలో దింపడానికి అబ్బాయిలు చేసే ప్రయత్నాలూ ఇవన్నీ మసాలా సినిమా చూస్తున్నామేమో అనే భావన తీసుకొస్తాయి. అయితే క్రమంగా కథలోకి వెళ్లిపోయాడు దర్శకుడు. యువతరం ఆలోచనలు మార్చుకొని, మంచి వైపు.. ఆశయాల వైపు అడుగులు వేస్తే ఏం చేయగలరో చూపించారు. అనాథ పిల్లల కోసం వాళ్లంతా చేసే ప్రయత్నం, ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కదిలిస్తాయి. ప్రతి తండ్రికీ తన పెంపకంపై నమ్మకం ఉంటుంది. చెడుదారుల్లో నడవరు అనే భరోసాతోనే వూరుకాని వూరు పంపిస్తుంటారు. కానీ ఇక్కడి కొచ్చిన పిల్లలేం చేస్తున్నారు? ఫ్యాషన్‌ ముసుగులో ఎన్ని వెర్రి వేషాలేస్తున్నారో 'గీత' దాట కుండా చూపించిన విధానం ఆకట్టుకొంటుంది. పతాక సన్నివేశాలన్నీ సందేశం చుట్టూ తిప్పుతూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల సమస్యలు ఒక వైపు, ప్రేమ పేరుతో అమ్మాయిలు పెట్టే షరతులు భరించలేని అబ్బాయిల అగచాట్లు మరో వైపు చూపించాడు దర్శకుడు.
 
ఎలా చేశారంటే..: నటీనటులంతా కొత్తవారే. అంతా తమ పాత్రల్లో రాణించారు. సీనియర్‌ నటులు లేని కొరత కనిపించింది. అయితే ఇలాంటి కథలు త్వరగా రిజిస్టర్‌ అవ్వాలంటే కొత్తవాళ్లే నయమేమో. దర్శకుడిగా, కథానాయకుడిగా రెండు బాధ్యతల్నీ బాగానే మోశాడు శ్రీ. స్నేహితుల బృందం కూడా చక్కగానే నటించారు. సంభాషణలు అక్కడక్కడా ఆకట్టుకొంటాయి. అమీర్‌ పేటలో అనే టైటిల్‌ గీతంతో పాటు, యువతరానికి సందేశాన్ని ఇచ్చే స్ఫూర్తి గీతం ఆకట్టుకొంటాయి.
బలం 
+ వినోదం, సందేశం 
+ ద్వితీయార్ధం
బలహీనతలు 
- మేకింగ్‌ 
- నటీనటులంతా కొత్తవారే కావడం
చివరిగా: యువత ఆలోచనలకు ప్రతిబింబం 
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత దృష్టికోణానికి సంబంధించింది. ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com