హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య :రివ్యూ
- January 14, 2017
చిత్రం: హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య
తారాగణం: ఆర్.నారాయణమూర్తి, జయసుధ, సునీల్ శర్మ, జయప్రకాష్‌రెడ్డి, చలపతిరావు, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, వై.విజయ, సమీర్, విజయ భాస్కర్, విజయ్, పార్వతి తదితరులు.
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
ఛాయాగ్రహణం: కె.సుధాకర్ రెడ్డి
కూర్పు: మోహన రామారావు
నృత్యాలు: శివసుబ్రహ్మణ్యం
ఫైట్స్: సతీష్ మాస్టర్
సమర్పణ: చదలవాడ తిరుపతిరావు
నిర్మాత: చదలవాడ పద్మావతి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావు.
విడుదల: 14-01-2017
సమాజంలోని సమస్యలే ఆర్.నారాయణమూర్తి సినిమాలకి కథలు. రకరకాల వెతలతో సతమతమవుతున్న సగటు మనిషే ఆయన సినిమాల్లోని హీరో. పీపుల్‌స్టార్‌గా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకొన్న ఆర్.నారాయణమూర్తి కార్మికుడిగా, కర్షకుడిగానే తెరపై కనిపించాడు. కానీ తొలిసారి ఆయన ఓ పోలీసుగా `హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య`లో నటించారు. ఈ చిత్రానికి ఇంకా చాలా ప్రత్యేకతలున్నాయి. స్వీయ దర్శకనిర్మాణంలోనే సినిమాలు చేసే ఆర్.నారాయణమూర్తి తొలిసారి చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో నటించారు. మొట్టమొదటిసారి సంక్రాంతి పండగకి విడుదలైన ఆయన చిత్రం కూడా ఇదే. మరి పోలీసు పాత్రలో ఆర్.నారాయణమూర్తి ఎలా ఒదిగిపోయారు? ఇదివరకు ఆయన చేసిన సినిమాలకీ ఈ సినిమాకీ మధ్య తేడా ఏమిటి? తదితర విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథేంటంటే?: నీతి.. నిజాయతీతో పనిచేసే ఓ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (ఆర్.నారాయణమూర్తి). ఏ విషయంలోనూ రాజీ పడడు. ఎవరి దగ్గరా లంచాలు తీసుకోడు. ఆ తత్వం చుట్టూ ఉన్నవాళ్లకి నచ్చకపోయినా తాను మాత్రం నమ్మిన దారిలోనే బతకాలనుకొంటాడు. దాంతో తన సహచర ఉద్యోగులు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. భార్య పద్మ (జయసుధ) కూడా డబ్బుపై ఆశతో లంచాల్ని తీసుకోవాలని ఒత్తిడి చేస్తుంటుంది. అయినా సరే తన తీరు మార్చుకోని వెంకట్రామయ్య ఊహించని రీతిలో ఓ అవినీతి కేసులో ఇరుక్కుంటాడు. దాంతో భార్య పద్మ (జయసుధ) అతన్ని వదిలి వెళ్లిపోతుంది. అసలు నీతిగా బతికే వెంకట్రామయ్యకి అవినీతి మకిలీ ఎలా అంటింది? అందుకు కారకులు ఎవరు? తననుంచి దూరమైన భార్య మళ్లీ దగ్గరైందా లేదా? మానవీయ విలువల్ని సైతం శాసిస్తూ... సమాజంలోని అవినీతి, అక్రమాలకి కారణమవుతున్న నల్లధనంపై ఓ సాధారణ హెడ్ కానిస్టేబుల్ ఎలా పోరాటం చేశాడు? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: ఆర్.నారాయణమూర్తి గతంలో చేసిన సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఒక కొత్త పాత్రతో పాటు, ఒక కొత్త కథలో ఆయన్ని చూసినట్టు ఉంటుంది. తొలి సగభాగం సినిమా అంతా నిజాయతీ గల హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య వ్యక్తిత్వాన్ని, ఆయన కుటుంబ నేపథ్యాన్ని ప్రతిబింబిస్తూ సాగిపోతుంది. జయసుధలాంటి నటి ఆర్.నారాయణమూర్తికి జోడీగా నటించడం కూడా కథకి కొత్తదనాన్ని తెచ్చిపెట్టింది. దర్శకుడు ఎంచుకొన్న కథాంశం నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంది. దాంతో కథలో తొందరగానే లీనమైపోతాం. తొలి సగభాగం కథంతా కూడా సహజంగా, మన చుట్టూ మనుషుల్ని చూసినట్టుగా ఉంటుంది. ద్వితీయార్ధం కూడా అలాగే ఉండుంటే బాగుండేది. కానీ అక్కడే కథ దారి తప్పింది. నల్లధనం నిర్మూలించాలన్న అసలు లక్ష్యం పక్కదారి పట్టింది. ఆ సమస్యకి సరైన పరిష్కారం లభించకుండానే కథ ముగుస్తుంది. ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ భార్యని అడ్డు పెట్టుకొని హోంమంత్రి ఓట్లు రాల్చుకోవాలని ప్రయత్నించడం, ఆమెని ముఖ్యమంత్రి చేయాలని కూడా ప్రయత్నించడం వంటి సన్నివేశాలు కథకి అంతగా అతికినట్టు అనిపించవు.
ఎవరెలా చేశారంటే?: ఆర్.నారాయణమూర్తి, జయసుధలు మాత్రం వాళ్ల వాళ్ల పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. ఇటు హెడ్ కానిస్టేబుల్‌గా, అటు భర్తగా, ఒక సమస్యకి పరిష్కారం కనుక్కోవాలనే ఆవేశం చూపించే సగటు పౌరుడిగా నారాయణమూర్తి చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. జయసుధతో పాటు, ఇతర నటీనటులు కూడా వాళ్ల వాళ్ల పాత్రల పరిధి మేరకు చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు. సాంకేతిక బృందం కూడా మంచి పనితీరును కనబరిచింది. దర్శకుడిగా ఇదే తొలి ప్రయత్నమైనా చదలవాడ శ్రీనివాసరావు ఎక్కడా తడబాటుకి గురికాలేదు. నటీనటులు, సాంకేతిక బృందం నుంచి చక్కటి పనితీరును రాబ్టటుకొన్నారు. ద్వితీయార్ధంపై ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకొనుంటే ఫలితం వేరుగా ఉండేది. సుధాకర్ రెడ్డి కెమెరా పనితనం, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం బాగా కుదిరాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బలాలు
+కథ
+ ఆర్.నారాయణమూర్తి, జయసుధ నటన
బలహీనతలు
-ద్వితీయార్ధం
చివరిగా: నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









