స్టైలిష్‌స్టార్' హ్యాపీ బర్త్‌డే ఈ రోజు
- April 07, 2017
అల్లు అర్జున్. పరిచయం అక్కర్లేని కథానాయకుడు. తెలిసిన వాళ్లందరూ ముద్దుగా బన్ని అని పిలుచుకుంటారు. అభిమానులు స్టైలిష్‌స్టార్ అంటారు. సినీ పరిశ్రమకు చెందిన కుటుంబం నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. సినిమాల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తూ, ఎప్పటికప్పుడు ప్రేక్షకులు మెచ్చే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. శనివారం బన్ని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.
అమ్మ ప్రభావం ఎక్కువ!
బన్నిపై వాళ్లమ్మ ప్రభావం ఎక్కువట. ముగ్గురు పిల్లల్లో తానే కాస్త నిదానమని, చదువులో చాలా నెమ్మదిగా ఉండేవాడినని అంటారు.
‘అమ్మ నా కోసం ఎంతో కష్టపడేది. చదువు విషయంలో మాట వినకపోతే దెబ్బలు కూడా పడేవి. చదువులో అంతంత మాత్రమే అని తెలిసినా నా అభిరుచులకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. నాకు జిమ్నాస్టిక్స్ అంటే చాలా ఇష్టం. అమ్మ దాన్ని గుర్తించి ప్రోత్సహించింది. జిమ్నాస్టిక్స్ చేయడం వల్ల శరీరం కూడా తేలిగ్గా ఉంటుంది కాబట్టి.. డ్యాన్స్ కూడా బాగా వచ్చేది. బొమ్మలు వేయడమన్నా కూడా ఇష్టం. అందుకే యానిమేషన్ దిశగా వెళ్లేలా చేసింది’ అని అమ్మ ఇచ్చి ప్రోత్సాహం గురించి చెబుతారు బన్ని.
అలా సినిమాల్లోకి..
అల్లు అర్జున్‌ది సినిమా కుటుంబం నేపథ్యంలో కావడంతో ఆయనపై ఎంతో కొంత ప్రభావం ఉండేది. అయితే వాళ్లమ్మకు మాత్రం కుమారులను సినిమాల్లోకి తీసుకురావాలని ఉండేది కాదట. యానిమేషన్ కోర్సులో పూర్తిస్థాయి శిక్షణ తీసుకునేందుకు కెనడా వెళ్లాలని బన్ని అనుకున్నారట. అందుకు సంబంధించిన ఫీజు కూడా కట్టేశారట. ఆ సమయంలో ఓ సినిమాకి హీరోగా ప్రయత్నిస్తే ఎంపిక కాలేదట. దీంతో యానిమేషన్ కన్నా సినిమాలపైనే ఆసక్తి పెరిగిందని చెబుతారు బన్ని. ఆ తర్వాత ముంబైలో కిశోర్ నమిత్కపూర్ యాక్టింగ్ స్కూల్లో నటనకు సంబంధించిన శిక్షణ పూర్తిచేసుకుని వచ్చారు. అప్పుడే తొలి ప్రయత్నంగా ‘గంగోత్రి’ చేయడం అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం జరిగిపోయాయని అంటారు. అంతకన్నా ముందు తొలిసారి వెండితెరపై చిరంజీవి సినిమాలోనే నటించారు. ‘విజేత’తో చిన్న పిల్లాడి పాత్రలో నటించగా, ‘డాడీ’ చిత్రంలో చిరంజీవి వద్ద డ్యాన్స్ నేర్చుకుంటూ కనిపిస్తారు.
సినిమాల్లో తనదైన ముద్ర
తండ్రి ప్రముఖ నిర్మాత అయినా, మావయ్య అగ్రకథానాయకుడైనా ఆ పేరు చెప్పుకొని ఎవరైనా ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేయగలరు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోకపోతే ఎంతటి గొప్పవారైనా పరిశ్రమలో మనుగడ సాగించడం కష్టం. తనపై అలాంటి ముద్ర ఉండకూడదని బన్ని ఎప్పుటికప్పుడు కష్టపడుతుంటారు. ముఖ్యంగా సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. 2003 ‘గంగోత్రి’ దగ్గరి నుంచి త్వరలో రాబోతున్న ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ వరకూ ఏటా కచ్చితంగా ఓ సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మాస్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాందించుకున్న బన్ని అభిమానులు మెచ్చే పాత్రలను చేస్తూ అలరిస్తున్నారు.
బన్ని చిత్రాల్లో ఇదే ప్రత్యేకం
నేటి యువతరం కథానాయకుల్లో ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారంటే టక్కున చెప్పే రెండు, మూడు పేర్లలో అల్లు అర్జున్‌ది కచ్చితంగా ఉంటుంది. నృత్య దర్శకుడు చెప్పిన ఏ స్టెప్‌నైనా ‘నాకు రాదు’ అనడం బన్నికి తెలియదట. అందుకే బన్ని చిత్రాల్లో డ్యాన్సులు ప్రత్యేకం. అందుకోసం ఎంత రిస్క్ చేయడానికైనా వెనుకాడరట. పైగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ తీసుకోవడం బన్నికి బాగా కలిసి వచ్చింది. డ్యాన్స్‌లు చేసేటప్పుడు చేతులు విరగొట్టుకున్న సందర్భాలూ ఉన్నాయంటారు అల్లు అర్జున్.
బన్ని కెరీర్లో ఇవి ప్రత్యేకం
అల్లుఅర్జున్‌కు కేవలం తెలుగు పరిశ్రమలోనే కాదు మలయాళ చిత్ర పరిశ్రలోనూ మంచి పేరుంది. మల్లు అర్జున్ అంటూ అభిమానులు కీర్తిస్తుంటారు. తన సినిమాల గురించి ఇతర విషయాల గురించి ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటారు. ఫేస్బుక్లో 1కోటి ఫాలోవర్లు సొంతం చేసుకున్న తొలి దక్షిణ భారత నటుడు అల్లుఅర్జున్ కావడం విశేషం. ఇక కేవలం కథానాయకుడిగానే కాకుండా అభిమానులు మెచ్చే పాత్రలను చేయడానికి ఎప్పుడూ సిద్ధమే అంటారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రంలో పోషించిన గోనా గన్నారెడ్డి పాత్రకు మంచి పేరు వచ్చింది. ‘ఎవడు’ చిత్రంలో రామ్‌చరణ్‌తో కలిసి కొద్దిసేపు తెర పంచుకున్నారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలో నటిస్తున్నారు. అభిమానులు మెచ్చే మరిన్ని చిత్రాలను అల్లు అర్జున్ చేయాలని కోరుకుంటూ ఆయనకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









