రహస్య కన్నీరు

- October 23, 2015 , by Maagulf


తను తలవంచుకొని నును సిగ్గుగా నడుస్తుంటే
పూల దారులన్నీ సాదరంగా పలకరిస్తూ ...తీపిగా 
రేకు విచ్చుకుంటాయి 

కంచె వేసిన ముళ్ళ పొదల చూపులన్నీ ఆమె సౌందర్య 
ప్రాకారంపైకి ప్రాకాలని చూస్తాయి .. 

కాంక్షతో చేసే ప్రేమ బాసలన్నీ తప్పించుకుంటూ 
సిగ్గూ పూబంతి అయి అలవోకగా  

తనతో అనుబంధం పెంచుకొని అర్థం చేసుకొని  
ఆదరించే ఏ ప్రియ సఖుని పరమో అవ్వాలని  

మనసుతో ఊసులాడుతూ తనువుతో కలిసిపొయ్యె 
తన ప్రియ మిత్రునితో నిత్య సంతోషినిలా వెలగాలని  
కలలు కంటూ ..  

ప్రేమ ఎంతో మధురం అని రెండు హృదయాల 
అపూర్వ కలయికతో జంటగా విరాజిల్లాలని 
గట్టిగా ఆశ పడుతుంది..   

అబ్బ ఆమె భావనలు ఎంత మధుర తలపులు 
ఆమె ఫలితాలన్నీ అనుకూలించేనా 

అనుకునే లోపే ... 

బొత్తిగా జీవితానుభవం లేని ఓ చిన్నోడు 
గుండెను పిండే ములుకు లాంటి ఒక ప్రశ్న వేస్తాడు .. 

మంచి కొలువు.. కాంతులీను అనుకువైన అందం 
అన్నీ ఉండి అన్నింట్లో కార్య నిర్వహణ అధికారియైన ఆమె!

అలా ఎప్పుడూ ఎవరికీ కనిపించకుండా.. 
ఒంటరితనంలో గోడు గోడున..విలపిస్తుందెందుకని?

ఏమో ఈ లోకం పోకడకు ఎప్పుడో మోడువారిన 
నా మనసుకేం తెలుసు? 

ఏ కఠిన మనసు, ఒక అనుమానపు  సొరంగమై  
దేహ మోహంలో పడి ఆమెను కంటనీరు పెట్టించేనో, 

ప్రేమించి మోసగింపబడిన ఆ లేడిని అలక్ష్యం చేసి, 

ఏ కర్కశమైన గొంతు తన దుష్ట వాక్కులతో 
ఆ గువ్వ గుండెను ఛిద్రం చేసెనో

పుట్టుకలోనే ఆ మీనాక్షి కన్నులు..
మనసుపంచే నేస్తం నిరర్ధక ఆవేశానికి గురియై 
ఎవరికి కనిపించని రహస్య కన్నీటి చెలిమలయ్యేనో ... 

ఏమో నాకేం తెలుసు ఆ కోమలాంగి కన్నీటి రహస్యం!

--జయ రెడ్డి బోడ(అబుధాబి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com