సెక్స్‌రాకెట్ గుట్టురట్టు: నిర్వాహకులు అరెస్ట్, మహిళలకు విముక్తి

- September 21, 2017 , by Maagulf
సెక్స్‌రాకెట్ గుట్టురట్టు: నిర్వాహకులు అరెస్ట్, మహిళలకు విముక్తి

నగరంలో మరో ఆన్‌లైన్‌ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన యువతులతో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌వోటీ పోలీసలు అరెస్టు చేశారు. నిందితుల బారినుంచి మహిళలకు విముక్తి కల్పించారు.

వివిధ రాష్ట్రాల యువతులతో..
మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వచ్చి మేడిపల్లిలో ఉంటున్న వంగలపూడి నూకరాజు (42), హైదరాబాద్‌లో ఉంటున్న మరో మహిళ నందిని ఆన్‌లైన్‌లో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తుంటారు. వీరు వివిధ రాష్ట్రాల నుంచి యువతులను, మహిళల్ని పిలిపించి హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో వారిని అద్దెకుంచి విటుల వద్దకు పంపిస్తుంటారు.

 

బంగ్లాదేశ్ నుంచి కూడా..
అయితే బంగ్లాదేశ్‌లోని జైశుర్‌ జిల్లాకు చెందిన మహిళ సురయ్యా అక్తర్‌ సుమి (27)ని ముంబైకి చెందిన కొందరు దళారులు ఐదేళ్ల క్రితం వ్యభిచారం కోసం ముంబైకి తీసుకువచ్చారు. వారి నుంచి ఆ మహిళను నూకరాజు, నందిని మూడేళ్ల క్రితం సికింద్రాబాద్‌కు తీసుకువచ్చి అద్దె ఇంట్లో ఉంచారు. ఈ మహిళను వారు వ్యభిచార కార్యకలాపాలకు పంపించేవారు.

 

ఆధార్ కార్డూ ఇప్పించారు..
అంతేగాక, హైదరాబాద్‌ బహదూర్‌పురాకు చెందిన మహమ్మద్‌ ముస్తాఫా (25) సహకారంలో వీరు ఆ మహిళలకు నకిలీ ధ్రువపత్రాలతో ఆధార్‌ కార్డును తీసుకున్నారు.


నిందితుల అరెస్ట్, పరారీలో నందిని
కాగా, వీరి వివరాలు సేకరించిన ఎస్‌వోటీ పోలీసులు సదరు మహిళతోపాటు నూకరాజు, మహమ్మద్‌ ముస్తాఫాను నేరేడ్‌మెట్‌లోని డిఫెన్స్‌కాలనీలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నూకరాజు, మహమ్మద్‌ ముస్తాఫాపై కేసు నమోదు చేశారు. వీరిని నేరేడ్‌మెట్‌ పోలీసులకు అప్పగించారు. వారి నుంచి మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిర్వాహకురాలు నందిని పరారిలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com