సార్ బిజీ ..ఆయన్ని కలవడం కుదరదు

- May 08, 2019 , by Maagulf
సార్ బిజీ ..ఆయన్ని కలవడం కుదరదు

తెలంగాణ సీఎం కేసీఆర్‌-డీఎంకే చీఫ్‌ స్టాలిన్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 13న వీరిద్ధరి మధ్య భేటీ ఉంటుందని మొదట టిఆర్‌ఎస్‌ వర్గాలు ప్రకటించాయి. అయితే 4 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 19న ఉప ఎన్నికలు జరగనున్నాయని, వాటి ప్రచారంలో స్టాలిన్‌ బిజీగా ఉన్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. అందుకే, కేసీఆర్‌ను స్టాలిన్‌ కలవడం లేదని వివరించాయి.

మరోవైపు ప్రస్తుతం డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి కొనసాగుతోంది. ఇప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో మూడో కూటమి అవసరం లేదని స్టాలిన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి, బీజేపీ యేతర, కాంగ్రెసేతర ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గత ఏప్రిల్‌లో ఆయన చెన్నై వెళ్లి స్టాలిన్‌తో చర్చలు జరిపారు కూడా. తరువాత ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో స్టాలిన్‌ కాంగ్రె్‌సతో పొత్తు పెట్టుకున్నారు. కూటమి తరఫున కాబోయే ప్రధాన మంత్రి రాహుల్‌ గాంధీయేనని స్టాలిన్‌ బహిరంగ సభలో ప్రకటించారు.

కేసీఆర్‌ మాత్రం కాంగ్రెస్‌ రహిత కూటమికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ స్టాలిన్‌ మాత్రం కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారు. అందుకే, కేసీఆర్‌తో భేటీకి స్టాలిన్‌ నిరాకరించినట్టు సమాచారం.

ప్రస్తుతం కేరళ పర్యటనలో కేసీఆర్‌ కుటుంబం బిజీగా ఉంది. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్‌తో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చించారు. త్వరలో సమాఖ్య, లౌకిక విధానాలతో కూడిన కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుందని కేరళ సీఎం వివరించారు. కేసీఆర్‌తో చాలా ప్రాముఖ్యం కలిగిన సమావేశం జరిగిందన్నారు. దేశ రాజకీయ పరిస్థితులపై కేసీఆర్‌ చర్చించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. దేశంలో ఎన్డీయే, యూపీఏ మెజారిటీ సాధించలేవన్నారు. ప్రాంతీయ పార్టీలకే మెజారిటీ వస్తుందని, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇవే కీలక పాత్ర పోషిస్తాయని విజయన్‌ అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రధాని అభ్యర్థిపై తమ భేటీలో చర్చించలేదని విజయన్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com