కశ్మీర్‌:పరిస్థితులు చక్కపడే వరకు ఆయన అక్కడే

- August 12, 2019 , by Maagulf
కశ్మీర్‌:పరిస్థితులు చక్కపడే వరకు ఆయన అక్కడే

జమ్మూకశ్మీర్‌ పరిస్థితులు క్రమక్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయి. 370, 35A ఆర్టికళ్ల రద్దు, కశ్మీర్‌ విభజన జరిగి వారం రోజులైంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగలేదు. ఈ వారం రోజుల్లో ఒక్క బుల్లెట్‌ కూడా పేలకుండా ప్రశాంతంగా ఉంది జమ్మూకశ్మీర్‌.

మరోవైపు కూడా ఆంక్షలు తొలగడంతో జనం స్వేచ్చగా తిరుగుతున్నారు. ఈద్ పర్వదినా న్ని జరుపుకోనున్నారు కశ్మీరీలుశ్రీనగర్ సహా అనేక జిల్లాల్లో రద్దీ కనిపిస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకొచ్చి నిత్యావసర వస్తువులు, మందులు కొనుగోలు చేశారు. ఏటీఎంల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొనుగోళ్లు, షాపింగులతో రోడ్లు, వీధులు కాస్త కళకళలాడుతున్నాయి. నిషేధాజ్ఞలు లేకపోవడంతో ఆదివారం ఈద్‌ షాపింగులో బిజీ బిజీగా గడిపారు.

ఈద్ సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే ప్రమాదముందనే హెచ్చరికలతో సైన్యం, పోలీసు యంత్రాంగం ఫుల్ అలర్ట్‌గా ఉంది. నిషేధాజ్ఞలు సడలిస్తూనే అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోంది.సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీని పెంచారు. కీలక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

అయితే… అక్కడక్కడా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతో కశ్మీరీ సంఘాలు నిరసన గళాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కశ్మీర్‌ లోయలో హింస చెలరేగినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు జమ్మూకశ్మీర్ పోలీసులు. వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కేంద్రహోంశాఖ కూడా కశ్మీర్‌లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని తెలిపింది.

మరోవైపు కశ్మీర్‌లో పరిస్థితులు చక్కపడే వరకు… జాతీయభద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అక్కడే ఉంటున్నారు. ఇప్పటికే అక్కడి ప్రజల్లో కలియతిరుగుతున్నారాయన. స్థానిక పరిస్థితుల్ని తెలుసుకుని.. ఎప్పటికప్పుడు సిబ్బందిని అలర్ట్‌ చేస్తున్నారు. వాస్తవానికి కశ్మీర్‌ మిషన్‌ పూర్తైన వెంటనే ఆయన ఢిల్లీ చేరుకోవాలి. అయితే… స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునేవరకు జమ్ముకశ్మీర్‌లో ఉంటున్నారు ధోవల్‌.

మరోవైపు… జమ్మూకశ్మీర్‌లో స్పెషల్‌ టెలిఫోన్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. స్థానికులు ఈద్‌ పండగు సంధర్భంగా… తమ ఆత్మీయులతో మాట్లాడేందుకు అవకాశం కల్పించేందుకు వీటిని అందుబాటులో తీసుకొచ్చారు. మొత్తం 300 టెలిఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మొత్తానికి జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితులు తిరిగి సాధార స్థితికి చేరుకుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com