నేడు సీబీఐ కోర్టు ముందుకు చిదంబరం

నేడు సీబీఐ కోర్టు ముందుకు చిదంబరం

కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ బుధవారం రాత్రి అరెస్టు చేసింది. గురువారం మధ్యాహ్నం ఆయన్ను సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని కూడా సీబీఐ విచారించే ఆస్కారమున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, తన అరెస్టు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమని చిదంబరం ఆరోపించారు. అరెస్టవ్వడానికి ముందు బుధవారం రాత్రి ఆయన దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కేసులో తనపైగానీ, తన కుటుంబ సభ్యులపైగానీ ఎలాంటి నేరాభియోగమూ లేదని అన్నారు. ఈడీ, సీబీఐగాని కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయలేదని చెప్పారు. కాగా సీబీఐ, ఈడీ చిదంబరంపై ఇప్పటికే లుక్‌ ఔట్ నోటీసు జారీచేశాయని ఏఎన్‌ఐ తెలిపింది. అంతకుముందు బుధవారం ఉదయం ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిదంబరానికి చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అంతకుముందు రోజు దిల్లీ హైకోర్టు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  

ఇప్పుడేం జరుగుతుంది...
గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చిదంబరాన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనుంది. శుక్రవారం సుప్రీం కోర్టు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంది. అయితే, ఇప్పడు ఆయన అధికారికంగా అరెస్టైనందున ఇప్పుడు ఆ పిటిషన్‌కు విలువ లేదు. చిదంబరాన్ని విచారించాల్సి ఉన్నందున, ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక కోర్టు ముందు సీబీఐ విన్నవిస్తుంది. మరోవైపు చిదంబరం అదే న్యాయస్థానాన్ని బెయిల్ కోసం అభ్యర్థిస్తారు. ఒకవేళ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే ఆయన వెంటనే విడుదల అవుతారు. బెయిల్ రాకపోతే చిదంబరం తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇదివరకు ముందస్తు బెయిల్ కోసం చిదంబరం చేసుకున్న అభ్యర్థనను ఆ కోర్టు తోసిపుచ్చింది.
 
అసలు కేసు ఏంటి..
ఐఎన్ఎక్స్ మీడియా సంస్థపై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఐఎన్ఎక్స్ ప్రెస్, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఇందులో నిందితులుగా సీబీఐ పేర్కొంది. అయితే, ఈ ఎఫ్‌ఐఆర్‌లో చిదంబరం పేరు లేదు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు విదేశీ పెట్టుబడులు తీసుకోవాలని భావించింది. ఇందుకోసం ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) అనుమతి కోరింది. ఒక్కో షేర్‌ను 10 రూపాయల ముఖ విలువతో జారీ చేస్తామని పేర్కొంది. దీంతో ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.4 కోట్ల 62 లక్షల విదేశీ పెట్టుబడులకు ఎఫ్ఐపీబీ అనుమతి ఇచ్చింది. అదే సమయంలో ఐఎన్ఎక్స్ న్యూస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థలోకి డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి విడిగా అనుమతి తీసుకోవాలని ఎఫ్ఐపీబీ స్పష్టంగా చెప్పింది. ఎఫ్ఐపీబీ సిఫార్సుతో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ దరఖాస్తుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అయితే, ఐఎన్ఎక్స్ మీడియా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి, ఐఎన్ఎక్స్ న్యూస్‌ సంస్థలో 26శాతం డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. డౌన్‌స్ట్రీమ్ ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఎఫ్ఐపీబీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. ఐఎన్ఎక్స్ మీడియా ఆ పని చేయలేదు. రూ.4 కోట్ల 62 లక్షలకు విదేశీ పెట్టుబడులకు ఎఫ్ఐపీబీ అనుమతివ్వగా.. రూ.305 కోట్లకుపైగా ఎఫ్‌బీఐలను సేకరించింది. విదేశీ పెట్టుబడిదారులకు ఒక్కో షేర్‌ను 10 రూపాయలకు కేటాయించాల్సి ఉండగా.. 800 రూపాయలకు ఒక షేర్ జారీ చేసింది.

కార్తీ చిదంబరంపై ఆరోపణలు
ఐఎన్ఎక్స్ మీడియాపై జరగబోయే దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నించారని కార్తీ చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి. కార్తీ డబ్బులు డిమాండ్ చేశారని ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణీ ముఖర్జీ తమకు చెప్పారని సీబీఐ చెబుతోంది. ఈ ఒప్పందం దిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిందని దర్యాప్తు ఏజెన్సీ చెబుతోంది. ఇంద్రాణీ ముఖర్జీని ఈడీ విచారించినప్పుడు చిదంబరం పేరు బయటకు వచ్చింది. 2018లో ఈడీ మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది. అప్పడు ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ఇంద్రాణీ ముఖర్జీకి సాయం చేయమని కార్తీ చిదంబరానికి చెప్పారని ఈడీ తన చార్జీషీట్‌లో పేర్కొందని టైమ్స్‌ ఆఫ్ ఇండియా కథనం రాసింది.

Back to Top