కర్తాపూర్ కారిడార్‌కు బ్రేకులు: భక్తుల నుంచి సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్న పాక్

- September 04, 2019 , by Maagulf
కర్తాపూర్ కారిడార్‌కు బ్రేకులు: భక్తుల నుంచి సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్న పాక్

న్యూఢిల్లీ: భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో కర్తాపూర్ కారిడార్ నిర్మాణంపై చర్చలకు బ్రేక్ పడింది. కర్తాపూర్‌లోని ప్రముఖ గురుద్వారాను సందర్శించే భక్తులకు సర్వీస్ రుసుం విధిస్తుండటాన్ని భారత్ తప్పుబట్టింది. ఇది మంచి పద్ధతి కాదని భారత్ పేర్కొంది. బుధవారం మూడో దఫా చర్చలకు ఇరుదేశాల అధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముసాయిదా ఒప్పందంపై ఫైనలైజ్ చేయాలని భావించారు.

కర్తాపూర్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ స్పందించారు. పూజలు చేసేందుకు వస్తున్న భక్తులపై సర్వీసు ఛార్జీ విధించడం పాకిస్తాన్‌కు భావ్యం కాదని అన్నారు. పాక్ ఇలా వ్యవహరించడం ద్వారా కర్తాపూర్ కారిడార్ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోందని మండిపడ్డారు. కారిడార్ ప్రారంభానికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పాక్ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు హర్‌సిమ్రత్ బాదల్.

ఇదిలా ఉంటే కర్తాపూర్ కారిడార్ పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఉన్న డేరాబాబా నానక్ ఆలయాన్ని అనుసంధానం చేస్తుంది. అంతేకాదు ఎలాంటి వీసా లేకుండానే భక్తులు ఆలయాన్ని దర్శించుకునేలా వెసులుబాటు కల్పిస్తోంది. ఈ ఆలయంను సిక్కుల మతగురువు గురునానక్ దేవ్ 1522లో స్థాపించారు. స్వాతంత్ర్యం సిద్ధించాక తొలిసారిగా వీసా లేకుండా సందర్శించుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

భారత సరిహద్దు నుంచి గురునానక్ చివరిగా విశ్రాంతి తీసుకున్న గురుద్వార దర్బార్ సాహిబ్ వరకు పాకిస్తాన్ రోడ్డు నిర్మాణం చేపడుతుండగా... డేరా బాబా నానక్ ఆలయం నుంచి సరిహద్దు వరకు భారత్ నిర్మాణం చేపడుతోంది. ఈ చరిత్రాత్మకమైన ఆలయాలను అనుసంధానం చేసేందుకు భారత్‌ పాకిస్తాన్‌లు గతేడాది నవంబర్‌లో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ కారిడార్‌ను సిక్కుల మతగురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా నవంబర్‌లో ప్రారంభించాలని భావిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com