రజనీకాంత్ కు హైకోర్టు సమన్లు జారీ..

- January 29, 2016 , by Maagulf
రజనీకాంత్ కు హైకోర్టు సమన్లు జారీ..

చెన్నై, గిండి, రేస్‌కోర్స్ ప్రాంతంలోని ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ పాఠశాల స్థల వివాదంలో నటుడు రజనీకాంత్, ఆయన భార్య లతా రజనీకాంత్, పాఠశాల చైర్మన్ వందనలకు మద్రాసు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో రజనీకాంత్, లతా రజనీకాంత్ ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా చెన్నై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నటుడు రజనీకాంత్‌కు చెందిన ఈ ఆశ్రమ్ పాఠశాల స్థల వివాదం కేసు గత కొంత కాలంగా కోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే.బుధవారం(27వ తారీఖున) ఈ కేసు విచారణకు రజనీకాంత్ ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వక పోవడంతో తమిళనాడు మెట్రిక్యులేషన్ పాఠశాలల జాయింట్ డెరైక్టర్ వారికి సమన్లు పంపారు.అయితే ఈ కేసు వ్యవహారంలో ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలన్న ఉత్తర్వులో నటుడు రజనీకాంత్ పేరును మినహాయించాలని ఆశ్రమ్ పాఠశాల ప్రిన్సిపల్ వందన హైకోర్టులో రిట్ పిటీషన్ వేశారు. ఈ కేసు విచారణ గురువారం న్యాయమూర్తి ఎంఎం.సుందరేశ్ సమక్షంలో విచారణకు వచ్చింది.అయితే వాదోపవాదాలు విన్న తరువాత రజనీకాంత్, లతా రజనీకాంత్‌లు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనని, అవసరమైతే రెండు వారాల వ్యవధి ఇవ్వనున్నట్లు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ పాఠశాలకు ఎలాంటి సంబంధం లేదని ఆశ్రమ్ మెట్రి క్యులేషన్ పాఠశాల నిర్వాహకులు తెలిపారు. అలాగే హైకోర్టు కూడా రజినీకాంత్‌ను ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశించలేదని పేర్కొన్నారు. ఈ కేసులో రిట్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు ఆశ్రమ్ మెట్రి క్యులేషన్ పాఠశాల నిర్వాహకులు చెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com