అపస్మారక స్థితిలో.. స్వరాష్ట్రానికి

- March 22, 2016 , by Maagulf
అపస్మారక స్థితిలో.. స్వరాష్ట్రానికి

దోహాలో బిల్డింగ్ పైనుంచి పడిన కార్మికుడు ♦ బాధితుడు నిజామాబాద్ జిల్లావాసి ♦ అపస్మారక స్థితిలో స్వరాష్ట్రానికి తరలింపు ♦ 24న క్షతగాత్రుడిని తీసుకు రానున్న వైద్యుడు, నర్సు ♦ గాంధీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యానికి ఏర్పాట్లునిజామాబాద్ సిటీ: ఎనిమిది నెలల క్రితం ఖతర్‌లోని దోహాలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తిని ఈనెల 24న హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన సిద్దరాములు ఉపాధి నిమిత్తం గత ఏడాది జూన్‌లో ఖతర్‌లోని దోహాలో పెట్రో ప్లాస్టిక్ కంపెనీలో కార్మికునిగా పనిలో చేరాడు.
జూలై 3న తాను నివసిస్తున్న భవనంపై నుంచి ప్రమాదవశాత్తు సిద్దరాములు కింద పడడంతో పక్కటెముకలకు, మెడపై తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.అక్కడి కంపెనీ ఆయనకు చికిత్స చేయించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. అంతేకాకుండా సిద్దరాములు అపస్మారకస్థితిలో ఉండడంతో ఎలాంటి సమాచారాన్ని తెలుసుకోలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న దుబాయ్‌లోని గల్ఫ్ తెలంగాణ సంఘం ఫౌండర్ ఎలిశెట్టి శ్రీనివాసశర్మ వెంటనే స్పందించి సిద్దరాములు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యంతో, వైద్యులతో మాట్లాడారు. సిద్దరాములును స్వరాష్ట్రానికి తీసుకు రావడానికి రెండు నెలలపాటు తీవ్రంగా శ్రమించారు. కాగా, సిద్దరాములుకు అందిస్తున్న వైద్య సేవలు యథావిధిగా స్వరాష్ట్రంలో అందిస్తేనే ఆయన కోలుకుంటాడని అక్కడి వైద్యులు శ్రీనివాసశర్మతో చెప్పారు. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి వైద్య సేవలపై అంగీకారం తీసుకున్నారు.ఒక వైద్యుడు ఒక నర్సు, సిద్దరాములుకు వైద్య సేవ సామగ్రి వెంట ఉండగా రూ.8.5 లక్షల వ్యయంతో హైదరాబాద్‌కు ఈనెల 24న వేకువజామున 3 గంటలకు తీసుకువస్తున్నారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఏసీ అంబులెన్స్ ద్వారా ప్రత్యేక వైద్యుల బృందంతో సిద్దరాములును గాంధీ ఆసుపత్రికి తరలిస్తారు. ఇందుకోసం ప్రత్యేక చొరవ చూపిన శ్రీనివాసశర్మను గల్ఫ్ తెలంగాణ వెల్పేర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు జువ్వాడి శ్రీనివాసరావు, అధికార ప్రతినిధి బసంత్‌రెడ్డి అభినందించారు. జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ స్పందించి తన భర్త సిద్దరాములుకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని భార్య రేణక వేడుకున్నారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com