బస్సు యాత్రలో సీఎం జ‌గ‌న్‌ పై రాయిదాడి..ఈసీ కీలక ఆదేశాలు

- April 14, 2024 , by Maagulf
బస్సు యాత్రలో సీఎం జ‌గ‌న్‌ పై రాయిదాడి..ఈసీ కీలక ఆదేశాలు

విజయవాడ: విజయవాడలో మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేస్తున్నవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‎ మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. సింగ్ నగర్ గంగానమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వ్యక్తి పూలతోపాటు రాయిని కూడా విసరడంతో జగన్‌ కనుబొమ్మ పైభాగంలో రాయి తాకింది. దీంతో గాయం కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు జగన్ మోహన్ రెడ్డికి చికిత్స అందించారు. గాయమైన చోట కుట్లు వేశారు. మరోవైపు ఈ ఘటనలో.. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా గాయమైంది. దీంతో అతనికికూడా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించారు.

సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. దాడి జరిగిన గంగానమ్మ గుడి ప్రదేశం వద్ద జల్లెడ పట్టిన పోలీసులు.. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పక్కనే ఉన్న ఇండోర్ స్టేడియం నుంచి దాడి జరిగిందా అనే దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. పాఠశాలలోని ఓ ఫ్లోర్ నుంచి నిందితుడు దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి సమయంలో గ్రూప్ కాల్స్ పై ఆరా తీస్తున్నారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. దాడి జరిగిన ప్రదేశాన్ని విజయవాడ సీపీ పరిశీలించారు. మరోవైపు.. జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్రలో జరిగిన దాడి ఘటనపై జాతీయ ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఘటనపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఐఎస్ డబ్ల్యూ, విజయవాడ సీపీని కోరింది.

విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ పై దాడి ఘటన పట్ల స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించిన చంద్రబాబు నాయుడు.. ఈ ఘటనపై ఈసీ నిష్పాక్షికమైన విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. అంతేకాదు.. నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వీరితోపాటు వైఎస్ షర్మిల, తమిళనాడు సీఎం స్టాలిన్, బీఆర్ఎస్ నేత కేటీఆర్, పలువురు ప్రముఖ నేతలు జగన్ పై రాయిదాడిని ఖండించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com