చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..

- April 18, 2024 , by Maagulf
చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకు ఎంతోమంది ప్రాణాలను నిలబెడుతూ 26 ఏళ్లుగా నిరంత‌ర సేవ‌లు అందిస్తూ వస్తుంది. ఉచితంగా ర‌క్త‌నిధులను దానం చేస్తూ పేదవారికి ఒక తోడు అవుతుంది. అయితే చిరంజీవి ఈ బ్లడ్ బ్యాంకుని ఇలా సక్సెస్ ఫుల్ గా నడపడంలో వంద‌లాది మెగాభిమానులు సపోర్ట్ ఉంది. చిరంజీవికి వెన్నుద‌న్నుగా నిలుస్తూ.. బ్ల‌డ్ బ్యాంకు సేవలను అభిమానులే ముందుకు తీసుకు వెళ్తున్నారు.

ఈ అభిమానుల్లో ‘మ‌హ‌ర్షి’ మూవీ నటుడు రాఘ‌వ కూడా ఉన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి రాఘవ రక్తదానం చేస్తూనే వచ్చారు. 1998 అక్టోబర్ 2 బ్ల‌డ్ బ్యాంక్ స్టార్ట్ అయిన‌ప్పుడు.. ముర‌ళీ మోహ‌న్‌ మొదటి వ్యక్తిగా రక్తదానం చేసారు. ఆ తరువాత రెండో వ్యక్తిగా రాఘ‌వ రక్తదానం చేసారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు దానిని ఒక యజ్ఞంలా భవిస్తూ.. వందసార్లు రక్తదానం చేసారు.

గతంలో చిరంజీవి, రాఘవకి ఒక మాట ఇచ్చారట. “నువ్వు వందోసారి ర‌క్త‌దానం చేస్తున్నప్పుడు నేను కచ్చితంగా పక్కన ఉంటాను” అని చెప్పారట. అయితే ఇటీవల రాఘవ రక్తదానం చేసే సమయంలో.. చిరంజీవి చెన్నైలో పనిలో ఉన్నారట. ఇక తిరిగి హైదరాబాద్ వచ్చిన తరువాత విషయం తెలుసుకున్న చిరంజీవి.. రాఘవని ఇంటికి పిలిపించుకొని ప్రత్యేకంగా సత్కరించారు.

రాఘవతో ఆయన స‌తీమ‌ణి శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, అలాగే రాఘవతో పాటు మొదటిసారి రక్తదానం చేసిన మురళి మోహన్ కూడా స‌న్మాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. వందసార్లు ర‌క్త‌దానం చేసిన వ్యక్తిల్లో రాఘ‌వ మొదటివాడని, తాను చేసే మంచి పనిలో రాఘవ ఇలా వెన్నుద‌న్నుగా నిలవడం తనకి ఎంతో సంతోషాన్ని కలగజేస్తుందని చిరు చెప్పుకొచ్చారు. రాఘవని సన్మానించి గౌరవించారు. కాగా రాఘవ భార్య శిల్పాచ‌క్ర‌వ‌ర్తి.. చిరంజీవితో కలిసి ఆప‌ద్బాంధ‌వుడు సినిమాలో నటించారు. ఈ సందర్భంగా ఆనాటి విషయాలను కూడా గుర్తు చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com