రాజకీయాలకు NTR ఒక బ్రాండ్: సీఎం రేవంత్

- July 20, 2024 , by Maagulf
రాజకీయాలకు NTR ఒక బ్రాండ్:  సీఎం రేవంత్

హైదరాబాద్: కులానికి, ప్రాంతానికి అతీతంగా తెలుగు వారి అభివృద్ధికి పాటుపడే నాయకత్వం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్ హచ్ఐసీసీలో శనివారం జరిగిన కమ్మ గ్లోబల్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిలో కమ్మ సామాజికవర్గం భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. తెలంగాణలో వివక్ష ఉండదని.. మా కులాలను అభిమానిస్తాం, ఇతర కులాలను గౌరవిస్తామని చెప్పారు. సమాజానికి సేవ సహజ గుణాన్ని మరవొద్దని కమ్మ సామాజిక వర్గాన్ని ఆయన కోరారు. రాజకీయాలకు NTR ఒక బ్రాండ్ అని, ఎంతో మందికి ఆయన అవకాశాలు ఇచ్చారని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలకు ఆయనే ఆద్యుడని గుర్తు చేశారు.

”కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారు. ఎక్కడ సారవంతమైన నేల ఉంటే అక్కడ కమ్మవారు కనిపిస్తారు. కష్టపడటం.. పదిమందికి సాయం చేయడం కమ్మవారి లక్షణం. కమ్మసామాజికవర్గం నన్ను ఎంతగానో అభిమానిస్తుంది. ఎన్టీఆర్ లైబ్రరీలో మేం చదువుకున్న చదువు.. మమ్మల్ని ఉన్నతస్థానంలో నిలబెట్టింది. నాయకత్వానికి ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయంగా ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. దేశంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాల వల్లే ఇవాళ చాలా మందికి రాజకీయ అవకాశాలు వచ్చాయి.

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు మీరు భాగస్వాములు కావాలి. మీలో నైపుణ్యాలను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మాకు భేషజాలు లేవు.. మా కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఎవరిపై వివక్ష ఉండదు.. అది మా ప్రభుత్వ విధానం కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ఒక హక్కు. నిరసన తెలపకుండా నియంత్రించాలనుకుంటే.. ఫలితాలు ఎలా ఉంటాయో మీరు చూశారు. జాతీయ స్థాయిలో తెలుగువారు లేని లోటు కనిపిస్తోంది. కుల, మతాలకు అతీతంగా జాతీయ స్థాయిలో రాణించే తెలుగువారిని ప్రోత్సహించాలి. వివాదంలో ఉన్న 5 ఎకరాల కమ్మ సంఘం భూ సమస్యను పరిష్కరిస్తాం. భూసమస్యను పరిష్కరించడంతో పాటు సంఘం భవన నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పదిమందికి సాయం చేసే మీ సహజ గుణాన్ని వీడొద్దని కోరుతున్నాన”ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు, మంత్రులు కోమటిరెట్టి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సినీ నటుడు మురళీ మోహన్, జెట్టి కుసుమకుమార్, సత్యవాణి, జీవిత రాజశేఖర్ దంపతులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, కమ్మ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com