హమాస్‌ మాస్టర్‌మైండ్ 'డెయిఫ్‌' హతం..! నిర్దారించిన ఇజ్రాయెల్‌

- August 01, 2024 , by Maagulf
హమాస్‌ మాస్టర్‌మైండ్ \'డెయిఫ్‌\' హతం..! నిర్దారించిన ఇజ్రాయెల్‌

హమాస్‌ పై యుద్ధంలో ఇజ్రాయెల్‌ పైచేయి సాధిస్తోంది.గతేడాది అక్టోబరు 7 నాటి మెరుపుదాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న హమాస్‌ సైనిక విభాగాధిపతి మహమ్మద్‌ డెయిఫ్‌ ను అంతమొందించినట్లు టెల్ అవీవ్‌ ప్రకటించింది.

గాజాలోని ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో జులై 13న జరిపిన దాడుల్లో అతడు హతమైన విషయాన్ని నిర్ధరించింది. పలు మార్లు చిక్కినట్లే చిక్కి చేజారిపోగా.. డెయిఫ్‌ లక్ష్యంగా గాజాలో చేసిన దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తమ నిఘా విభాగం అంచనాకు వచ్చిందని వెల్లడించింది.

శరణార్థి శిబిరంలో పుట్టి..

గాజాలోని ఖాన్‌ యూనిస్‌ శరణార్థి శిబిరంలో 1965లో డెయిఫ్‌ జన్మించాడు. పూర్తి పేరు మహమ్మద్‌ డియాబ్‌ ఇబ్రహీం అల్‌ మస్రీ. 1980ల చివర్లో హమాస్‌లో చేరాడు. హమాస్‌ ఉగ్రవాదులు తమ ఉనికి ఇజ్రాయెల్‌ దళాలకు తెలియకుండా రోజుకో సానుభూతిపరుడి ఇంట్లో దాక్కొంటారు. అందుకనే మస్రీ పేరు డెయిఫ్‌గా మారింది. డెయిఫ్‌ అంటే అరబిక్‌ భాషలో 'అతిథి' అని అర్థం. హమాస్‌ మిలిటరీ యూనిట్‌ 'అల్‌ కస్సం బ్రిగేడ్‌'లో పనిచేశాడు.

హమాస్‌ అగ్రనేత హనియా హత్య

అతడు ఎక్కడ పెరిగాడు..ఏం చదువుకున్నాడు తదితర వివరాలు ఎవరికీ తెలియవు. హమాస్‌ బాంబుల తయారీ నిపుణుడు అయ్యాష్‌కు సన్నిహితుడు. అయ్యాష్‌ గతంలో ఇజ్రాయెల్‌ దళాలపై పలు బాంబుదాడులు చేశాడు. అతడు ఇజ్రాయెల్‌ దళాల చేతిలో హతమయ్యాక.. 2002లో హమాస్‌లోని మిలిటరీ వింగ్‌ బాధ్యతలు డెయిఫ్‌ చేపట్టాడు. హమాస్‌ వాడే 'కస్సాం' రాకెట్ల తయారీ వెనుక కీలక పాత్ర పోషించాడు. ఇజ్రాయెల్‌ దళాలకు తలనొప్పిగా మారిన గాజా టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మాణం వెనుక మాస్టర్‌ మైండ్‌ కూడా అతడే. ఇజ్రాయెల్‌ దళాలకు చిక్కకుండా ఎక్కువ సమయం ఆ సొరంగాల్లోనే గడుపుతాడని సమాచారం.

పాదరసంలా జారుకొని.. ప్రాణాలతో బయటపడి!

ఇజ్రాయెల్‌ దళాలు డెయిఫ్‌ కోసం తీవ్రంగా గాలించాయి. అత్యాధునిక కమ్యూనికేషన్‌ వ్యవస్థలు, కంప్యూటర్లకు దూరంగా ఉండడంతో నిఘా సంస్థలకు డెయిఫ్‌ను గుర్తించడం అసాధ్యమైంది. అతడి రహస్య జీవితం నుంచి అస్సలు బయటకు రాలేదట. ఇప్పటి వరకు అతడిపై ఇజ్రాయెల్‌ దళాలు ఏడుసార్లు దాడులు చేశాయి. ప్రతిసారీ వెంట్రుకవాసిలో ప్రాణాలతో బయటపడ్డాడు. 2000లో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో ఒక కన్ను పోవడంతోపాటు కొన్ని అవయవాలు దెబ్బతిన్నట్లు తెలిసింది.

2006లో హమాస్‌ సభ్యుడి ఇంట్లో ఉండగా జరిగిన దాడిలో డెయిఫ్‌ మరోసారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనల్లో తప్పించుకున్న విధానంతో హమాస్‌లో అతడు పాపులర్‌ అయ్యాడు. అందుకే అతడిని 'ది క్యాట్‌ విత్‌ నైన్‌ లైవ్స్‌' అని పిలుస్తారు. 2014లో ఐదోసారి జరిగిన దాడి నుంచి కూడా బయటపడ్డాడు. ఈ దాడిలో అతడి భార్య, పిల్లలు మరణించారు. 2021 గాజాపై జరిపిన ఆపరేషన్‌లో కూడా రెండుసార్లు తప్పించుకున్నాడు. గతేడాది అక్టోబరులో 'ఆపరేషన్‌ అల్‌ అక్సా స్ట్రామ్‌' మొదలైందంటూ ప్రకటించిందీ అతడే. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షానికి రూపకర్త కావడంతో మరోసారి కోసం తీవ్రంగా జల్లెడ పట్టిన ఇజ్రాయెల్‌.. ఎట్టకేలకు అతడిని హతమార్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com