నరాలు బలహీనం రాకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

- November 03, 2024 , by Maagulf
నరాలు బలహీనం రాకుండా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

మెదడు(బ్రెయిన్) నుంచి శరీరంలోని అన్ని భాగాలకు సంకేతాలు పంపించడానికి నరాలు కీలకం. వీటి వల్ల నాడీవ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అన్ని భాగాలకు అవసరమైన ఆక్సిజన్, పోషకాలు తీసుకెళ్లడంలో నరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే, ఈ రోజుల్లో మారుతున్న జీవన శైలి, కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నారు. శరీరానికి కావాల్సిన పోషకాలు సరైన సమయానికి అందకపోతే రకరకాల వ్యాధులు వస్తాయి.అందులో నరాల బలహీనత కూడా ఒకటి.

జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చేతుల కాళ్ల తిమ్మిరి, దీర్ఘకాలిక తలనొప్పి, కండరాల బలం కోల్పోవడం వంటి లక్షణాలు ఎంత మాత్రం మంచిది కాదు.నరాల బలహీనత ఉంటే ఈ లక్షణాలు మీలో కనిపిస్తాయి. చెడు అలవాట్లు, ఒత్తిడి కారణంగా నరాల్లో రక్తా సరఫరా సరిగ్గా జరగదు.దీంతో ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సమస్య ఎదుర్కోనే వారు చాలా బాధ, నొప్పి భరిస్తూ ఉంటారు. అయితే, ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కొన్ని సూపర్ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.ఈ సూపర్ ఫుడ్స్‌తో నరాల బలం పెరుగుతుంది. ఇంతకీ ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పండ్లను సిట్రస్ ఫ్రూట్స్ అంటారు.నిమ్మ, నారింజ, బత్తాయి, గ్రేప్ ఫ్రూట్ వంటి పండ్లు సిట్రస్ జాతికి చెందినవి. సిట్రస్ ఫ్రూట్స్‌లో ఎన్నో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. వీటిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫైబర్, ప్లాంట్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్ వంటి పోషకాలు నరాలు దెబ్బ తినకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆకుకూరలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో విటమిన్ ఎ, సి, ఇ, కాల్షియం, ప్రోటీన్, ఐరన్, పొటాషియం ఉంటాయి.ఇవి ఇమ్యూనిటీ పవర్ పెంచడమే కాకుండా.. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాకుండా రోజూ తింటే నరాల బలహీనత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

బ్లూ బెర్రీ పండ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. బ్లూబ్రెరీ పండ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదుడుని ఆరోగ్యంగా ఉంచుతాయి.ఇవి జ్ఞాపక శక్తి మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పండ్లలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ నరాలు దెబ్బ తినకుండా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com