సామాజిక విప్లవ యోధుడు - మహాత్మ ఫులే
- November 28, 2024సమాజంలో మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలతో నలిగిపోతూ అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిబా ఫూలే కొత్తదారి చూపారు. చేయి పట్టి నడిపించారు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని చాటిచెప్పారు. భారతదేశంలో సామాజిక సంస్కరణ ఉద్యమానికి బీజం మొదటి మహోన్నతుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అనే చెప్పాలి. ఆయన సతీమణి సావిత్రిబాయి ఫులే మన దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు. నేడు సంఘ సంస్కర్త, ఉద్యమకారుడు, సమాజ సేవకుడెైన మహాత్మ జ్యోతీబా ఫులే వర్థంతి.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని వ్యవసాయ మాలి సామాజిక వర్గానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించారు ఫూలే. జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే ఛత్రపతి శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్ వాషింగ్టన్‌ల జీవిత చరిత్రలు చదివి ప్రభావితం అయ్యారు. విద్యార్ధి దశలోనే దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం ఆయన ఆలోచనలను ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది.
స్త్రీలపై నాడున్న కట్టుబాట్లను ఉల్లంఘిస్తూ మహిళల మహోద్దరణకు కృషి చేశారు. జ్ఞాన సంపదకు అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం చెప్పారు. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని గ్రహించిన ఫూలే స్త్రీ విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి సాధ్యమని బలంగా విశ్వసించారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రి బాయిని పాఠశాలకు పంపారు. అంతటితో ఆగక ఫులే బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను 1848 ఆగస్టులో పూనాలో ప్రారంభించారు. ఈ పాఠశాలలో నాడు అంటరానివారు సహా అన్ని కులాల వారికీ ప్రవేశం కల్పించడం, పాఠాలు చెప్పాల్సిరావడంతో ముందు ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిబా ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు.
నాటి సమాజంలో మూఢ ఆచారాలైన కన్యాశుల్కం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఫూలే పోరాటాలు చేశాడు. భావ సారూప్యత కలవారందరిని ఏకతాటిపైకి తీసుకువచ్చి సమాజానికి ఒక కొత్త మార్గాన్ని చూపాడు. చిన్న వయస్సులో వితంతువులైన వారికి స్వయంగా వివాహాలు జరిపించాడు. 1864లో “బాలహత్య ప్రధిబంధక్ గృహ” స్థాపించాడు. నాటి సమాజంలో వితంతువులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను గ్రహించి వారి కోసం ఆశ్రమాన్ని స్థాపించారు. వితంతు మహిళలలకు శిరోముండనం చేసే ఆనవాయితీకి స్వస్తి పలకాలన్నారు. శిశుహత్యలు, బాల్యవివాహాల నివారణ కోసం ప్రత్యేక చొరవ తీసుకొని అండగా నిలిచారు.
భారతదేశంలోని శూద్రాతి శూద్రులు (దళిత బహుజన, ఆదివాసీ గిరిజన, ముస్లిం మైనార్టీలు) బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో బానిసలుగా ఉన్నారనీ, వీరు అమెరికాలోని నల్లజాతి బానిసల్లాగా ఉన్నారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఫూలే. అందుకే బ్రాహ్మణీయ కుల వ్యవస్థలోని బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడడమొక్కటే మన ముందున్న ప్రథమ కర్తవ్యంగా ఫూలే ప్రకటించారు. బడుగులు బానిసలుగా ఉండడానికి బ్రాహ్మణీయ దోపిడీ, అణచివేత, వివక్షలను అర్థం చేసుకోకపోవడం, అందుకు చదువు లేకపోవడమే మూలమని ఫూలే గ్రహించారు.
1848లో పుణేలో మొట్టమొదటగా దళిత (అస్పృశ్యులకు) బాలికలకు పాఠశాల నెలకొల్పారు. ఆ తదనంతరం 1851లో మరో రెండు పాఠశాలల్ని నెలకొల్పారు. శ్రామిక ప్రజల కోసం 1855లో 'రాత్రి బడి'ని స్థాపించారు. ఇలా బ్రాహ్మణ వ్యతిరేకతతో శూద్ర వర్గంలోని అతిశూద్రులకు విద్యావ్యాప్తి చేయడంతో బెంబేలెత్తిన బ్రాహ్మణులు 1849లో ఫూలేను ఆయన తండ్రి చేత కుటుంబం నుంచి బహిష్కరింపజేశారు. అయినా ఫూలే కలత చెందక మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో మరింత ముందుకు పోయాడు. జీవిత భాగస్వామి సావిత్రీభాయి సహకారంతో బ్రాహ్మణ వ్యతిరేక సాంస్కృతిక పోరాటాల్ని నిర్మించారు ఫూలే.
అస్పృశ్యుల కోసం బ్రిటిష్ వారిచే పాఠశాలల్ని ఏర్పాటు చేయించారు. సామ్రాజ్యవాద కోణంలోనైతే ఇది మనకు వ్యతిరేకమైనది. భారతదేశంలో కులం కోణంలో చూస్తే అస్పృశ్యులు వేల సంవత్సరాలుగా విద్యకు, విజ్ఞానానికి దూరం చేయబడుతున్నారు కనుక అనుకూలమైనది. 1873-75 సంవత్సరాలలో బ్రాహ్మణ పురోహితులు లేకుండా జూన్నార్ పరిసర ప్రాంతాల్లో సుమారు 40 గ్రామాల్లో పెళ్ళిళ్లు నిర్వహించి, ప్రత్యామ్నాయ వివాహ సంస్కృతికి బీజం వేసారు.
1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటి సంస్కరణోద్యమం. శూద్రులు- అతి శూద్రులపై నాటి సమాజంలోని కొన్ని వర్గాలు ప్రదర్శించే క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించారు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. ఆయన ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. కార్మికులు, రైతులు, మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరు చేశారు. దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని పేర్కొన్న మహాత్మా ఫూలే చివరి శ్వాస వరకు సమాజాన్ని సంస్కరింంచారు. ఫూలేను తన ఉద్యమ గురువుల్లో ఒకరిగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ భావించారు.
శూద్ర వర్గంలోని రైతాంగంపై బ్రాహ్మణ-వైశ్యు (బాట్‌జీ-షేట్‌జీ) ల వడ్డీ దోపిడీ, శ్రమ దోపిడీల రూపాల్ని, వారి బండారాన్ని బయటపెట్టారు. అంతేకాదు, తను ఏర్పాటు చేసిన సత్యశోధక సమాజ్ సంస్థ సారథ్యంలో తన సహచరుడు ఎన్.ఎమ్.లోఖండేతో బొంబాయి నూలు మిల్లులలోని శూద్రాతిశూద్ర కార్మికుల హక్కుల కోసం, 12 గంటల పనిదినం, ఆదివారం సెలవుకై ట్రేడ్ యూనియన్‌ను నెలకొల్పి పోరాటాలు చేశారు. ఫూలేకి కేవలం కుల వ్యవస్థ వ్యతిరేకతే కాదు, సామ్రాజ్యవాద వ్యతిరేకత, కార్మికవర్గ, రైతాంగ పక్షంగా పోరాడే అవగాహన, కార్యాచరణ ఉన్నాయి.
ఆయన నడిపిన 'దీనబంధు' వారపత్రికలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు. శెత్కర్యాచ అస్సోడ్ (కల్టివేటర్స్ విప్‌కార్డ్) పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన తొలి దార్శనికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలకి, విశ్లేషణకి ‘గులాంగిరి’ అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ బ్రాహ్మణులు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి.
ఫూలే తన రచనల ద్వారా కూడా సమాజాన్ని మేల్కొల్పారు. మరీ ముఖ్యంగా పత్రికల ద్వారా ప్రచారం చేసి వారిలో ప్రశ్నించే తత్వాన్ని పెంచారు. జ్యోతిరావు ఫూలే రచనలు ఆ కాలం నాటి వైవాహిక పద్ధతులను సవాలు చేశాయి. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని కల్పించడం లక్ష్యంగా వారి సాధికారత కోసం తపించిన మహాత్మా ఫూలే 1890 నవంబరు 28న తుది శ్వాస విడిచారు.
- డి.వి.అరవింద్
తాజా వార్తలు
- సౌక్ వాకిఫ్ ఈక్వెస్ట్రియన్ ఫెస్టివల్ 2025 సక్సెస్..!!
- దుబాయ్ లో టాక్సీ కంటే చౌకైనది.. బస్సు కంటే వేగవంతం..!!
- కాన్సస్‌లో దిగ్విజయంగా NATS బ్యాడ్మింటన్ టోర్నమెంట్
- తెలంగాణకు భారీ ఒప్పందం
- డిపోల ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని ఖండించిన TGSRTC
- మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం...11 మంది మృతి
- తిరుపతి తొక్కిసలాట పై న్యాయ విచారణకు ఆదేశం
- ఘనంగా ముగిసిన రాచకొండ కమిషనరేట్ ఆరవ ఎడిషన్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2025
- బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు