సాహితీ కథకుడు-దాట్ల దేవదానం రాజు

- March 20, 2025 , by Maagulf
సాహితీ కథకుడు-దాట్ల దేవదానం రాజు

"రవిగాంచని చోట కవి గాంచును” అని తెలుగులో ఒక నానుడి ఉంది. అంటే ప్రపంచంలో జరిగే అనేక మార్పులు, నేరాలు, ఘోరాలు, అన్యాయాలు మొదలగున్నవి ఏవైనా సూర్యుడైనా చూడకపోవచ్చేమో కానీ, కవి కంటి నుండి ఏ సంఘటన, ఏ వస్తువూ తప్పించుకోలేవని భావం. కవి అన్నిటినీ కవిత్వీకరించి వెలుగులోకి తీసుకువచ్చి సమాజహితానికి దోహదకారి అవుతాడు. వారిలో దాట్ల దేవదానం రాజు ఒకరు.. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం. 

దాట్ల దేవదానం రాజు 1954, మార్చి 20న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం తాలూకా కోలంక గ్రామంలో క్షత్రియ వ్యవసాయ కుటుంబానికి చెందిన దాట్ల వెంకటపతి రాజు, సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించారు. కోలంక, రామచంద్రపురం మరియు యానాంలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. తెలుగులో ఎంఏ, ఏంఈడీ పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోలంక, ఇంజరం, పిల్లంక, నీలపల్లి గ్రామాల్లో పనిచేశారు. 

కవిగా, కథకుడిగా ఈ తరం ప్రతిభావంతులలో ఒకరిగా గుర్తింపు పొందిన దాట్ల దేవనం రాజు గారూ యానాంలో ఉపాధ్యాయులుగా ఉంటూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు పొందిన దేవదానం రాజు గారూ వారం వారం సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తున్నారు. వీరు వ్రాసిన “వానరాని కాలం” కవితా సంపుటి విమర్శకుల మెప్పు పొందింది. 

దాట్ల వారు రచయిత్రి రంగనాయకమ్మ గారి “రామాయణ విషవృక్షం” ముందుమాట చదివారు. అది చదివిన తర్వాత వారి ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చింది. ఆ మార్పుతోనే హేతువాద దృష్టి,  ప్రశ్నించే తత్వం, సమాజ పరిణామాన్ని పరిశీలించడం వారికి అలవాటయ్యాయి. కవిగా దేవదానం రాజు గారిపై ఎవరి ప్రభావం లేదు. ఎవరిలాగో వ్రాయాలని వారు అనుకోలేదు. “గుండె తెరచాపు” కవితా సంపుటిలో ప్రకృతి ప్రేమ ప్రస్ఫుటంగా కనిపించడంతో ఎవరికైనా ఇస్మాయిల్ గుర్తుకు రావచ్చు. కానీ అది మాత్రం యాదృచ్ఛికమే.

కథకుడిగా ప్రయాణం మొదలుపెట్టి శిఖామణి అనే సాహసయాత్రికుడి సహచర్యం వల్ల కథల నుండి కవితల్లోకి తన ప్రస్థానాన్ని మళ్ళించి వందలాది కవితలు వ్రాసిన కథకుడిగా గుర్తింపు నిలబెట్టుకొని తెలుగు పాఠకులకు చిర పరిచితులయ్యారు దాట్ల దేవదానం రాజు గారూ. ఒకవైపు ఉత్తమ ఉపాధ్యాయునిగా, మరోవైపు కథకునిగా, కవిగా రెండు కథా సంపుటాలు, ఐదు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, ఒక చరిత్ర గ్రంథం వెలువరించారు. 

వాస్తవానికి కథలు వ్రాయడం కష్టంతో కూడుకున్న పని. అయితే కథ రాయడం పూర్తయ్యాక మనసుకు కలిగే సంతృప్తిని దేనితోనూ కొలవలేము. మన అనుభవాల నుండి వచ్చినదే మంచి కథ అవుతుంది.కథకుడు ఏరుకోగలగాలే గానీ సమాజమే అనేక కథా వస్తువులకు నెలవు.  దేవదానం రాజుకి నలుగురు మెచ్చి నాలుగు కాలాలపాటు నిలిచే కథలనే వ్రాయాలనేదే అభిలాష. తన అనుభవ పరిధి దాటి ఏ కథ కూడా వ్రాయలేదు. ఏ.ఎన్ జగన్నాధ శర్మ, కొలకలూరు ఇనాక్ వంటి కథకుల్లాగా చిన్న చిన్న వాక్యాలతో కథను నడిపిస్తూ వ్రాయాలని వారి కోరిక. 

కథ యొక్క ముగింపు చాలా వరకు సానుకూల దృక్పథంతో ఉండాలి. విషాదం, అననుకూలత వంటివి జీవితంలో తప్పనిసరిగా ఉంటాయి. కానీ కథ యొక్క సందేశం మాత్రం తప్పనిసరిగా ఆత్మవిశ్వాసం కలిగించేటట్టు సానుకూల దృక్పథంతో ఉండాలి. కథలలో విషాదాంతాలు, ఆత్మహత్యలు పరిష్కారం చూపటం ప్రతికూల దృక్పథం కలిగిస్తాయి. అవి అంత మంచివి కాదు.

మామూలుగానే రచనకు ఎప్పుడూ ప్రయోజనం ఉంటుంది. దాట్ల వారి కథలు, కవితలు చదివి స్పందించి ప్రేరణ పొందిన యువకులు చాలా మంది తాము రాయాలని ప్రయత్నించి కృతకృత్యులైన వారు ఉన్నారు. వారి కథల మీద ఎన్.సురేష్ కుమార్, మధురై కామరాజు యూనివర్సిటీ నుంచి ఎం.ఫిల్ పట్టా పొందారు.వారే దేవదానం రాజు కి సమగ్ర సాహిత్యం మీద పి.హెచ్.డి చేస్తున్నారు. ఇటీవల ప్రచురించిన దీర్ఘ కవిత “నాలుగో పాదం” ను తమిళంలోకి "నాన్ గాన్ పాదమ్" పేరుతో శాంతాదత్ గారు అనువదించారు.

ఎప్పుడూ చదువుకోవడం, రాయాలన్న తపన నిజాయితీగా ఉండడం.ఇతరులకు చేతనైన సాయం చేయడం ఎన్నడు ఎవరికి అపకారం తలపెట్టకపోవడమే దేవదానం రాజు తత్వం. ఎన్ని సంక్షోభాలు, సంఘర్షణలు ఎదురైనా కూడా చుట్టూ ఉన్న అనుభవాలని మట్టి కాళ్ళు సాక్షిగా గుండె తెరచాప రెపరెపలాడిస్తూ, అక్షరాల్లోకి వొంపుకుంటూ పుటల మధ్య సేద తీరడమే తనకు సంతోషాన్ని కలిగిస్తుంది అంటారు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com