ప్రపంచ జల దినోత్సవం

- March 22, 2025 , by Maagulf
ప్రపంచ జల దినోత్సవం

నీరు లేనిదే సమస్త జీవ కోటికి మనుగడ లేదు. జలమే జీవనాధారం.అసలు జీవ పరిణామం ప్రారంభమైందే సముద్ర గర్భంలో అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు పుష్కలంగా లభించే మంచి నీటిని అభివృద్ధి పేరిట కలుషితం చేస్తున్నాం. అవసరానికి మించి వాడుతూ వాటిని వృథా చేస్తున్నాం. దీంతో సమీప భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు కూడా రానున్నాయనడంలో ఆశ్చర్యమేమీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతోనే ఐక్యారాజ్య సమితి ‘ప్రపంచ జల దినోత్సవం’ (వరల్డ్ వాటర్ డే) ను నిర్వహిస్తున్నది. ప్రతియేటా మార్చి 22న దీనిని ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

నీటికున్న‌ విలువ వెలకట్టలేనిదని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. జీవికి ఆక్సిజ‌న్ ఎంత అవ‌స‌ర‌మో దైనందిన జీవితంలో నీటి అవ‌స‌రం అలాంటిదే. అయితే, పది అడుగులు త‌వ్వ‌తే నీరు ప‌డే భూమి నుండి వంద‌ల అడుగులు చీల్చినా చుక్క నీరు క‌నిపించని క‌రువు ప్రాంతాలూ ఇదే భూమిపై ఉన్నాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. కాలం మారుతోంది.. న‌ది ప‌క్క‌నే బ‌తుకుతున్నగ్రామాల్లో కూడా మిన‌ర‌ల్ వాట‌ర్ టిన్నులు కొనుక్కు, తాగుతున్న కాలం దాపురించింది. నానాటికీ ప‌రిస్థితి దిగ‌జారుతోంది. 

ప్రపంచంలో దాదాపు 2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు లేకుండానే జీవితాన్ని బ‌లిచేసుకుంటున్నారు. ఈ త‌రుణంలో నీటి కొర‌త‌పైన‌ అవగాహన కల్పించేందుకు ఐక్యరాజ్యసమితి 1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని ఆచ‌రిస్తోంది. మితిమీరిన కాలుష్యం, భూగర్భ జలాలను వృధా చేస్తున్న‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మంచినీటి లభ్యత మరింత తగ్గిపోయింది. ఈ క్ర‌మంలో భూగర్భ జలమట్టం తగ్గడం కూడా మరో ప్రధాన సమస్యగా మారింది. అందుకే, 'సుస్థిర అభివృద్ధి లక్ష్యం'గా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.

2030 నాటికి అందరికీ నీరు, శానిటేష‌న్ అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు. ఇక‌, సైన్స్ ఎంత‌ అభివృద్ధి చెందినప్పటికీ, నీటి వనరుల్లోని కలుషితాలను తొలగించలేకపోయాము. ఇలాంటి ఎన్నో సమస్యలపై అవగాహన కల్పించడానికి, వాటికి పరిష్కారం కనుగొనేలా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రపంచ నీటి దినోత్సవం అవ‌స‌రం చాలా ఉంది.

భూగర్భ జలాలను పెంచడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి ఆ నీటిని సక్రమంగా వినియోగించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం దీని ప్రధాన లక్ష్యం. అంతేగాక నీటి విలువను తెలియజేస్తూ భావితరాలకు తాగు, సాగునీరు లభ్యంగా ఉండే విధంగా ఈరోజు అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తారు. ఇక ఈ ఏడాది వరల్డ్ వాటర్ డే విషయానికొస్తే ‘ప్రజలకు నీరు, దాని విలువ, ఆ వనరును మనం ఎలా సంరక్షించుకోగలం’ అనేదానిమీద అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా మనకు లభిస్తున్న నీటి విలువ.. దానికి నిర్దేశించిన ధర కంటే చాలా రెట్లు ఎక్కువ.

భారతదేశంలో సరైన నీటి పొదుపు ప్రణాళికలు, నిర్వహణ , ప్రజల్లో అవగాహన లేమి వలన నీటి వృధా జరిగి జల సంక్షోభానికి దారి తీయడం జరుగుతుంది. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఋతుపవనాల వల్ల నీరు లభ్యమైనప్పటికి.... నిర్వహణ లోపం, డ్యాములు, ప్రాజెక్టులు సరిపడా లేకపోవడం వలన వృధా కావడం జరుగుతుంది.రక్షిత మంచి నీరు, పారిశుద్ధ్యం అనేవి ప్రజల కనీస ప్రాథమిక హక్కులుగా భారత రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ నేటికీ ఆచరణలో అమలు కావడం లేదు. దేశంలో నీటి లభ్యత కూడా అసమానంగా ఉండటం వలన తరచుగా వివిధ ప్రాంతాలు కరువు, వరదల ప్రభావానికి గురికావడం జరుగుతుంది. మానవ తప్పిదాల వలన వాతావరణ మార్పులు సంభవించి వర్షపాతంలో అనిశ్చితి ఏర్పడి జల సంక్షోభానికి దారితీస్తుంది.

నేడు సమర్థవంతమైన జల వనరుల నిర్వహణ చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి పౌరుడు జలవనరుల పట్ల జాతీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి రాజస్థాన్‌లోనీ అల్వార్ జిల్లాకు చెందిన రాజేంద్ర సింగ్, మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి ప్రాంతంలో అన్నా హజారే చేపట్టిన కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలి. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణకు చేపట్టిన ‘జల శక్తి అభియాన్’‌ను జల ఉద్యమంగా తీసుకువెళ్లి నీటి కరువుకు చరమగీతం పాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com