జనహృదయనేత-గొట్టిపాటి హనుమంతరావు
- March 23, 2025
గొట్టిపాటి హనుమంతరావు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణమైన రాజకీయవేత్త. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల ఆశయ శ్వాసలే ఊపిరిగా బ్రతికిన నాయకుడు. మాట పట్టింపు కోసం పదవులు వదులుకున్న చరిత్ర గొట్టిపాటి సొంతం. రాజకీయాల కోసం వ్యాపారాలను వదులుకొని తుదిశ్వాస వరకు ప్రజల మధ్యలోనే ఉన్నారు. నేడు మాజీ మంత్రివర్యులు గొట్టిపాటి హనుమంతరావు వర్థంతి సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం....
గొట్టిపాటి హనుమంతరావు 1945, జూన్ 6వ తేదీన అవిభక్త గుంటూరు జిల్లాలోని మార్టూరు తాలూకా యద్దనపూడి గ్రామంలో సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. కుటుంబ పరిస్థితులు కారణంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం లేని తరుణంలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిని సాగుచేస్తూ రైతుగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు.
వ్యవసాయ రంగంలో ఉంటూనే రైస్ మిల్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అంచలంచెలుగా ఎదిగి అనేక రంగాల్లోకి వ్యాపార కార్యకలాపాలను విస్తరించి వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలిచారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి అడుపెట్టి యద్దనపూడి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అనంతర కాలంలో మార్టూరు భూ తనఖా బ్యాంకు ఛైర్మన్‌గా, సంతమాగులురు సమితి అధ్యక్షుడుగా పనిచేశారు.
సమితి అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే 1982లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపునందుకొని ఆ పార్టీలో చేరిన గొట్టిపాటి 1983 అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నుండి పోటి చేసి తోలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు .అయితే కొద్దీ నెలల్లోనే వచ్చిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి 1984లో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా గొట్టిపాటి హనుమంతరావు ఎన్నికయ్యారు.
1985లో జరిగిన మధ్యంతర అసెంబ్లీ ఎన్నికల్లో మార్టూరు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం బలరాం గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి బలరాం నియంతృత్వ పోకడలతో నియోజకవర్గంలో వీరి అనుచరులను ఇబ్బందులకు గురి చేయడంతో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా అధిష్టానంలో కీలకంగా వ్యవహరించిన కొందరు నాయకులు తమ స్నేహితుడు బలరాంకు వత్తాసు పలకడంతో మనస్తాపం చెందిన వీరు టీడీపీకి రాజీనామా చేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరారు.
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మార్టూరు నుండి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే బలరాం చేతిలో ఓటమి చవిచూసినా కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ కార్యక్రమాల్లో చూరుగ్గా పాల్గొన్నారు. అయితే కేసుల మాఫీ కోసం తన పూర్వ రాజకీయ గురువు, అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సమక్షంలో 1993లో తన రాజకీయ ప్రత్యర్ధి బలరాం కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు.
బలరాం పార్టీకి చేసిన నమ్మక ద్రోహాన్ని క్షమించని పార్టీ అధినేత ఎన్టీఆర్ హనుమంతరావు గారిని పార్టీలోకి ఆహ్వానించారు. కానీ పార్టీ లోని కొందరు నాయకులు పార్టీలోకి ఆయన్ని రానీయకుండా చేయడంలో విజయం సాధించారు. అయితే ఎన్టీఆర్ గారే స్వయంగా 1994 ఎన్నికల్లో మార్టూరు నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గొట్టిపాటి గారికి పార్టీ తరపున మద్దతు ఇవ్వడంతో ఆయన రెండో సారి ఎమ్మెల్యే గా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీలో చేరారు.1995-97 వరకు
చంద్రబాబు నాయుడు గారి మొదటి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు.
గొట్టిపాటి హనుమంతరావు గారు గొప్ప పరిపాలనా దక్షులు తాను చేపట్టిన ప్రతీ పదవి ద్వారా పూర్తి స్ధాయిలో ప్రజా అభివృద్ధికి కృషి చేశారు. ముఖ్యంగా సంతమాగులూరు సమితి అధ్యక్షుడుగా సమితి పరిధిలోని అన్ని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధికి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా, మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో కృషి చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఆ శాఖలోని అవినీతిని అరికట్టడంలో విజయం సాధించారు.
హనుమంతరావు గారు రైతు పక్షపాతి, స్వతహాగా రైతైన వీరు రైతుల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో ఉండేవారు. తను చేపట్టిన ప్రతీ పదవి ద్వారా రైతన్నల సంక్షేమం కోసం పాటుపడ్డారు. తూర్పు ప్రకాశం ప్రాంతం ( మార్టూరు (రద్దయిన నియోజకవర్గం), అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు)లో సాగునీటి వనరుల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేసి రైతన్నల అభిమానాన్ని చూరగొన్నారు.
విద్యారంగంలో గొట్టిపాటి తనవంతు కృషి చేశారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం లేని కారణంగా తాను చదవకపోయినా తన సోదరుడు శేషగిరి రావును ఎంబీబీఎస్ మరియు మిగిలిన కుటుంబ సభ్యులను ఉన్నత చదువులు చదివించారు. అంతేకాకుండా అనేక మంది నిరుపేద కుటుంబాలను చెందిన విద్యార్ధులకు, తమ వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం అందించారు.
వీరి రాజకీయ ఎదుగుదలలో ఆయన తమ్ముడు శేషగిరిరావు గారిది కీలకమైన పాత్ర, తన సోదరుడి కోసం సుదీర్ఘ కాలం తెరవెనుక రాజకీయాల్లో పనిచేస్తూనే కుటుంబానికి చెందిన వ్యాపార వ్యవహారాలను చూసుకునేవారు. హనుమంతరావు గారి కుమారుడు గొట్టిపాటి నరసయ్య సైతం మార్టూరు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. శేషగిరి రావు గారి కుమారుడు ప్రస్తుత అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హనుమంతరావు గారి రాజకీయ వారసుడిగా మార్టూరు, అద్దంకి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు.
గొట్టిపాటి వారిది విలక్షణమైన వ్యక్తిత్వం, కేవలం మాట పట్టింపు చేత ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని తృణ ప్రాయంగా త్యజించిన ఆత్మాభిమానం గల మనిషి. చివరి శ్వాస వరకు అవినీతి అక్రమాలకు ఆమడ దూరంగా ఉంటూ నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు.
హనుమంతరావు గారు రాజకీయ జీవితంలో ఎన్నో విజయాలు ఉన్నా వ్యక్తిగత జీవితం మాత్రం విషాదభరితం. బలరాంతో ఏర్పడ్డ రాజకీయ వైరం తర్వాత కాలంలో వ్యక్తిగత వైరంగా మారి ఫ్యాక్షన్ గొడవలకు దారి తీసింది. ఈ క్రమంలోనే తన రాజకీయ వారసుడు మరియు చిన్న కుమారుడైన గొట్టిపాటి కిశోర్ బాబు హత్య ఆయన్ని మానసికంగా కృంగి పోయేలా చేసింది. కుమారుడితో పాటు తనను నమ్ముకున్న వందల మంది అనుచరులు ప్రాణాలు కోల్పోయారు.
అలాగే ప్రత్యర్థులు యద్దనపూడిలోని తమ రైస్ మిల్లులో అమర్చిన బాంబు పేలడంతో తన కూడి భుజం, తన తమ్ముడైన శేషగిరిరావు గారి మరణం ఆయన్ని మానసికంగా మరింత కృంగి కృశించేలా చేసింది, తన కళ్ల ముందే తనవారు చనిపోవడం భరించలేక కొద్దీ నెలల్లోనే 1997, మార్చి 23వ తేదీన తన 53 ఏళ్ల వయస్సులో కాలం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ చరిత్రలో రాజకీయ గొడవల్లో అత్యంత నష్టపోయిన కుటుంబంగా గొట్టిపాటి కుటుంబం నిలిచింది. సామాన్య రైతు నుండి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన హనుమంతరావు జీవితాన్ని రాజకీయాల్లోకి వెళ్ళాలి అనుకునే నేటి యువతరం అధ్యయనం చేయడం చాలా అవసరం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్