నట వైవిధ్యానికి కేరాఫ్ ప్రకాష్ రాజ్
- March 26, 2025
తెలుగు ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. విలక్షణ నటుడుగా ఎన్నో పాత్రల్లో నటించి అందరి మనసును చూరగోన్నాడు.. హీరోగా, ఫ్రెండ్ గా, అన్నగా, తండ్రిగా, తాతగా ఇలా ఏ పాత్రలోనైనా జీవించి నటిస్తాడు. గత ముప్పై ఏళ్లుగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఏడు ప్రధాన భారతీయ భాషల్లో దాదాపు నాలుగు వందల సినిమాలకు పైగా నటించారు. నటుడిగానే కాకుండా టీవీ హోస్ట్ గా, నిర్మాతగా, దర్శకుడిగానూ ప్రత్యేక మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. నేడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం...
ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్.1965, మార్చి 26న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు. రంగ స్థల నటుడుగా ఎన్నో షోలు చేశాడు.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో అక్కడకు ఎంట్రీ ఇచ్చాడు.. కేరీర్ మొదట్లో కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన ప్రకాశ్ రాజ్..1994లో కె. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డ్యూయెట్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. సంకల్పం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆ తర్వాత ఆయన తెలుగులో వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.
ఏ.ఎమ్.రత్నం రూపొందించిన ‘సంకల్పం’లో ప్రతినాయకునిగా ఆకట్టుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి ‘వినోదం’లో చిన్న పాత్రే అయినా ఇట్టే ఆకట్టుకొనేలా నటించేసి మార్కులు కొట్టేశారు. ఆ పై ‘సుస్వాగతం’లో “నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు…” అంటూ ఆయన మురిపించిన తీరునూ జనం మరచిపోలేరు.తన కంటే వయసులో పెద్దవారికి తండ్రిగా, మామగానూ నటించేసి ప్రత్యేకత చాటుకున్నారు.ఒకానొక సమయంలో తెలుగు సినిమాల్లో అధిక శాతం ఆయన హీరోకో, హీరోయిన్ కో తండ్రిగా నటించేసి, ఓ నాటి గుమ్మడిని గుర్తు చేశారు.
‘‘అమ్మా! అడక్కుండానే జన్మనిచ్చావ్. ఏడిస్తే పాలిచ్చావ్...వానోస్తే గొడుగు ఇచ్చావ్... ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావ్... వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావ్...వేసుకోవడానికి బట్టలిచ్చావ్... చూసుకోవడానికి అద్దమిచ్చావ్...రాసుకోవడానికి పలకనిచ్చావ్... గీసుకోవడానికి గడ్డమిచ్చావ్.! అందుకే.. అందుకే...నువ్వు నాకు నచ్చావ్...కానీ, ఎందుకమ్మా ఇంత ఎర్లీగా చచ్చావ్? అయినా, నువ్వు నాకు నచ్చావ్.’’
డైనింగ్ టేబుల్ దగ్గర కుటుంబ సభ్యులంతా ఆకలితో అలమటిస్తుంటే... ప్రార్థన పేరుతో భోజన సమయంలో నటుడు ప్రకాష్ రాజ్ చెప్పిన ఈ కవిత ఇప్పటికీ జనం నాలుకలపై నానుతూనే ఉంది. డైలాగులు చెప్పడంలో కాస్త హాస్య చతురత అద్దడం వల్ల ప్రేక్షకులు తరచూ గుర్తు చేసుకుంటూ మళ్లీ మళ్లీ నవ్వుకుంటున్నారు. నలుగురిని నవ్వించే అలాంటి పాత్రలే కాదు... కరడు కట్టిన ప్రతినాయకుడి పాత్రల్లోనూ పరకాయ ప్రవేశం చేసి జనాన్ని భయభ్రాంతులకు గురిచేయడంలో ఈ తరం నటుడిగా ఆయన శైలే ప్రత్యేకం. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చిత్రాలు... ఇంకెన్నో పాత్రలు. ప్రకాష్ రాజ్ ఓ పాత్ర పోషిస్తున్నారంటే తెరపై కన్నా.. సమాజంలో మన కళ్లెదుట మనకు తెలిసిన ఓ వ్యక్తి కనిపించినట్లే అనిపిస్తుంది. అంతలా ప్రేక్షకులను తన పాత్రలో మమేకం చేసే సత్తా ఆయనది.
ప్రకాష్ కన్నడ సినిమాలతో తన నట జీవితాన్ని ప్రారంభించినప్పటికి ఇతర దక్షిణ భారతీయ భాషలలో కూడా ఈజీగానే అవకాశాలు వచ్చాయి. ఆయనకి ఉన్న నటనా నైపుణ్యం, వివిధ పాత్రలను లోతుగా విశ్లేషించి నటించగల టెక్నీక్స్ తో ఆయన అనతికాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రకాశ్ రాజ్ నటించారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెప్పించారు. ప్రతీ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండబుల్ యాక్టర్ గా కొనసాగారు. అన్ని భాషలు కలుపుకొని ఆయన 400 సినిమాలకి పైగా చేశారు.
ప్రకాష్ రాజ్ అధ్బుతమైన నటనకు గుర్తుగా ఇప్పటిదాకా నాలుగు జాతీయ చలన చిత్ర పురస్కారాల్ని అందుకున్నారు. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే 8 నంది పురస్కారాలు సొంతం చేసుకున్నారు. ఇవే కాకుండా 8 తమిళనాడు రాష్ట్ర పురస్కారాలు, 3 విజయ అవార్డులు, 4 సైమా అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇద్దరు' (1998) చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా తొలిసారిగా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్నారు ప్రకాశ్ రాజ్. ఆ తర్వాత ప్రియదర్శన్ తెరకెక్కించిన 'కాంచీవరం' (2009) చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం సాధించారు. ఆయన నటించిన 'పుట్టక్కన హైవే' కన్నడలో ఉత్తమ చలనచిత్రంగా నేషనల్ అవార్డ్ గెలుచుకుంది.
ప్రకాష్ రాజ్ నటనతోనే ఆగిపోలేదు పలు భాషల్లో సినిమాలకు దర్శకత్వం సైతం చేశాడు. కన్నడ “నాను నన్న కనసు” (2010)తో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత కన్నడలోనే “ధోని” (2012) “ఒగ్గరనే” (2014) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో జరిగే అన్యాయాలను బహిరంగంగా మాట్లాడుతూ, సామాజిక రాజకీయ అంశాల మీద అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉంటాడు.
ఆర్టిస్ట్‌గా ప్రకాష్ రాజ్‌లో ఎన్ని పార్శ్వాలో? తొలినాళ్లలో రంగస్థల కళాకారుడిగా, తెరపై నటుడిగా, తెర వెనుక నిర్మాతగా, దర్శకుడిగా, టెలివిజన్ ప్రెజంటర్‌గా.. ఇలా అనేక రూపాల్లో సృజనను ఆవిష్కరించారు.ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక కఠోర శ్రమ ఉందా? అన్న మీడియా ప్రశ్నకు ప్రకాష్ రాజ్ ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. "ఏం చేయాలో తెలియని తికమక, అయోమయం నుంచి మొదలైన ప్రయాణం ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొంది. కళ్లముందు కనిపించి దిగంతాలు చేరుకోవాలని చేసే యత్నంలో ఎప్పటికప్పుడు సరికొత్త దిగంతాలు ఊరించేవి" అని ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతలోనే... "ఇప్పటికీ నా ప్రయాణంలో గమ్యాలు తప్ప లక్ష్యాలు లేవుంటూనే.. అంది వచ్చిన ఒక్కో అవకాశాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగాను" అని ఆయన అంటారు.
ప్రకాష్ రాజ్ బహుభాషలు తెలిసిన నటుడు. మాతృభాష కన్నడం. ఆపై.. తమిళ్, తెలుగు, మలయాళం, మరాఠీ, హిందీ, ప్రపంచ భాష ఇంగ్లీష్‌లో ప్రావీణ్యత పుష్కలంగా ఉంది. ఏ భాషా చిత్రంలో నటిస్తే.. అందులో అంతరంగాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. 'గుల్జార్' కవితలంటే ఆయనకు మహా ఇష్టం. ఆలాగే తెలుగులో 'అమృతం కురిసిన రాత్రి' ఇష్టమైన పుస్తకం. ఆయన శ్రీ శ్రీ ని చదివారు. చలం భావజాలాన్ని పట్టుకున్నారు. అందువల్ల ఆయనని అన్ని భాషల ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. మావాడేనంటూ ఆత్మీయత పంచారు. ఈ తరహా ధోరణే నటుడిగా ఆయన విజయానికి ప్రధాన కారణం.
ప్రకాశ్ రాజ్ విలక్షణ నటులే కాదు, వ్యక్తిత్వంలోనూ ఆయన విలక్షణత చూపిస్తారు. నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ముక్కుసూటిగా సాగే తత్వం. సామాజిక సేవల్లోనూ ప్రకాశ్ రాజ్ ముందుంటారు. కరోనా కల్లోల సమయంలో ఎంతో మందికి సాయం అందించారు. చదువుకొనే పేదవారికి చేతనైన సహాయం చేయడంలోనూ, కష్టాల్లో ఉన్నారని తెలిసిన వారిని స్వచ్ఛందంగా ఆదుకోవడంలోనూ ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ ముందుంటారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం 'అప్పు ఎక్స్ ప్రెస్' పేరుతో అంబులన్స్ సేవలు అందిస్తున్నారు.
ప్రకాష్ రాజ్ పేరు చెప్పగానే సంపూర్ణ నటుడు కళ్లముందు కదలాడుతాడు. నాయికా నాయకులు సినిమా కథను నడిపించే ప్రధాన సూత్రధారులైతే... చుట్టూ ఉన్న నటులంతా శాయశక్తులా ప్రతిభతో సొగసులద్దినవాళ్లే. వాళ్లలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చెప్పుకోదగ్గ పాత్రల్ని మొదటి నుంచి పోషిస్తున్నారు. ఎస్.వీ రంగారావు, నాగభూషణం, గుమ్మడి, రావు గోపాలరావు నుంచి నేటివరకూ ఎందరెందరో క్యారెక్టర్ ఆర్టిస్టులు తెరంగేట్రం చేసి తమ ముద్ర వేశారు. ఆ కోవలోనే ప్రకాష్ రాజ్ ఈ తరం నటుడిగా సుప్రసిద్ధుడయ్యాడు. అయినా.. ఆయన నట వైభవాన్ని ఒక చట్రంలో బిగించలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా... ఇలా అన్ని రకాల పాత్రల్లోనూ ఇట్టే ఒదిగిపోయే నటుడిగా ప్రకాష్ రాజ్‌కి భిన్నమైన శైలి ఉంది.
కొందరు నటులకు కొన్ని పాత్రలు సరిగ్గా సరిపోతాయి. అయితే ఎలాంటి పాత్రనైనా చేయగలిగే నటులు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ప్రకాశ్ రాజ్ ముందు వరుసలో ఉంటారు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం పలు భాషల్లో వందలాది సినిమాల్లో నటించారు. హీరోగా, నటుడిగా, ప్రతినాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేశారు. అందుకే ఆయన్ను అన్ని బాషల ప్రేక్షకులు విలక్షణ నటుడు అంటారు. భావి నటులకు స్ఫూర్తినిస్తూ సాగుతున్న ప్రకాశ్ రాజ్ మునుముందు మరిన్ని మంచి పాత్రలతో అలరిస్తారని ఆశిద్దాం.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!