ఆదర్శ సోషలిస్టు నేత-పరిపాటి
- March 29, 2025
పరిపాటి జనార్దనరెడ్డి...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సోషలిస్టు నేతగా వెలుగొందిన నాయకుడు. లోహియా వాదిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన జార్జి ఫెర్నాండెజ్ అనుచరుడిగా సుదీర్ఘ కాలం నడిచారు. సామ్యవాదానికి గాంధేయవాదాన్ని జోడించి అభివృద్ధి రాజకీయాలకు పట్టంకట్టిన ప్రజానాయకుడిగా నిలిచారు.నమ్మిన ప్రమాణాలను వదులుకోలేక చివరి దశలో రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ అరుదైన నాయకుడు జనార్దనరెడ్డి గురించి ప్రత్యేక కథనం...
కలుపల్లి జనార్దనరెడ్డి అలియాస్ పరిపాటి జనార్దనరెడ్డి 1935, జనవరి1న నిజాం పాలనలోని హైదరాబాద్ సంస్థానంలో భాగమైన అవిభక్త వరంగల్ జిల్లా హుజురాబాద్ తాలూకా పోతిరెడ్డిపల్లి గ్రామంలోని సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. వరంగల్, హైదరాబాద్ నగరాల్లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చరిత్ర, రాజనీతి శాస్త్రాలు ప్రధానాంశాలుగా ఎంఏ పూర్తి చేసిన ఆయన సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా సిద్ధాంత భావజాలం పట్ల ఆకర్షితుడై హైదరాబాద్ విమోచన ఉద్యమంలో పాల్గొన్నారు.
లోహియా, జయప్రకాశ్ నారాయణ్ గార్ల పట్ల అవాజ్యమైన గౌరవ భావంతో సోషలిస్టు పార్టీ బలోపేతాని కృషి చేశారు. 1959లో తన 24వ ఏట జమ్మికుంట సమితి అధ్యక్షుడిగా ఎన్నికైన జనార్దన రెడ్డి 1971 వరకు ఆ పదవిలోనే కొనసాగారు. సమితి అధ్యక్షుడిగా తన ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. లోహియా అనుచరుడిగా తొలుత సోషలిస్టు పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ మరియు సంయుక్త సోషలిస్టు పార్టీలో కొనసాగారు. ప్రముఖ సోషలిస్ట్ నాయకులు జార్జి ఫెర్నాండెజ్, మధు లిమాయే వంటి ప్రముఖ సోషలిస్టు ఉద్దండులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ప్రగతిశీల భావాలు కలిగిన ఉన్న పరిపాటి జనార్దన్ రెడ్డి జమ్మికుంట ప్రాంతంలోని భూస్వాములకు వ్యతిరేకంగా 1960 దశకంలోనే అప్పటి యువతరాన్ని సమీకరించి అనేక పోరాటాలను చేశారు.
లోహియా మరణం తర్వాత జార్జి ఫెర్నాండెజ్ మద్దతుదారుగా కొనసాగారు. జార్జ్ ఫెర్నాండెజ్ హైదరాబాద్ వచ్చినపుడల్లా జనార్ధన్రెడ్డి గృహంలోనే ఉండేవారు. కన్నాభిరాన్, కేశవరావు జాదవ్ వంటి వారి కార్యకలాపాలతో సంఘీభావం ఉండేది. ఇదే సమయంలో పలువురు విద్యార్ధి నేతలైన పట్లోళ్ళ ఇంద్రారెడ్డి, ఈటెల సమ్మయ్య, ఆవునూరి సమ్మయ్య, ముద్దసాని సత్యనారాయణ రెడ్డి వారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. జమ్మికుంట సర్పంచ్గా పనిచేసిన ఎర్రంరాజు కృష్ణంరాజు, ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల ఏలియాలు జనార్దన్ రెడ్డికి రాజకీయంగా అండగా నిలిచారు. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ తాలుకా తెలంగాణ ప్రజాసమితి నాయకునిగా ప్రధాన పాత్ర పోషించారు. ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జగిత్యాల సబ్ జైలులో శిక్ష అనుభవించారు.
1972లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినందుకు వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని లోక్ సంఘర్ష్ సమితిలో చేరారు. సంఘర్ష్ సమితి కార్యక్రమంలో కరీంనగర్లో ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడంలో ఆయన విజయవంతమయ్యారనే చెప్పాలి. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేపట్టిన సమయంలో కొన్ని కఠిన చట్టాలను నాటి ప్రభుత్వం నమోదయ్యేలా చేసింది. దీంతో ముషీరాబాద్ జైలులో సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించారు.
ఎమర్జెన్సీని ఎత్తివేసిన తర్వాత విడుదలైన జనార్దన్ రెడ్డి 1977లో కొత్తగా ఏర్పాటైన హన్మకొండ లోకసభ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పి.వి.నరసింహారావు పై పోటీచేసి ఓడిపోయారు. 1978లో అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుండి జనతా పార్టీ అభ్యర్థిగా తిరిగి పోటీ చేసి గెలుపొంది రెండోసారి అసెంబ్లీకి వెళ్లారు. 1980లో జనతాపార్టీ చీలిన సమయంలో లోక్ దళ్ పార్టీలో చేరారు.
1980-84 వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తన సోషలిస్టు సహచరులైన తుమ్మల చౌదరి, తుర్లపాటి సత్యనారాయణ, ఐనంపూడి చక్రధర్ గార్లతో తమ పార్టీలోకి చేరమని ఆహ్వానం పలికినప్పటికి కొన్ని కారణాల వల్ల వెళ్లలేకపోయారు. అయితే 1984లో తెలుగుదేశం పార్టీలో చేరి అప్పుడే కొత్తగా పెట్టిన స్టేట్ డెవలప్ మెంట్ కమిటీ నెల్లూరు విభాగానికి ఇన్చార్జ్గా వ్యవహరించారు. అయితే ఆ సంవత్సరమే జరిగిన ఆగస్ట్ సంక్షోభం తర్వాత క్రియాశీల ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
అయితే, 1989లో జనతాదళ్ పార్టీ ఏర్పడినప్పుడు ఫెర్నాండెజ్, మధు లిమాయే కోరిక మేరకు ఆ పార్టీలో చేరినప్పటికి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపలేదు. 1994లో జనతాదళ్ నుంచి వేరుపడి ఫెర్నాండెజ్ స్థాపించిన సమతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సైతం జనార్దన రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా జరిగారు.
జనార్దన రెడ్డి గారు గొప్ప. సోషలిస్టు సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన లోతైన అవగహన కలిగిన వీరు, వాటి పరిష్కారానికి అసెంబ్లీ వేదికగా ఎన్నో మార్లు అనర్గళంగా విషయం స్పష్ఠతో మాట్లాడి తోటి అధికార, ప్రతిపక్ష శాసనసభ్యుల నుంచి కితాబులు అందుకున్నారు. 1978లో వెంకయ్య నాయుడు, జనార్దన రెడ్డి, జైపాల్ రెడ్డి గార్లు అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఉమ్మడి రాష్ట్ర ప్రజానీకం రేడియోల చుట్టూతా వాలేవారు. సమస్యల పరిష్కారానికి ఎన్నో రాజీలేని పోరాటాలు అసెంబ్లీ లోపల, బయట చేసిన ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
జనార్దన రెడ్డి గారు గొప్ప పరిపాలనా దక్షులు. సమితి అధ్యక్షుడిగా, ఎమ్యెల్యేగా ఆయన అత్యంత వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తింప బడిన హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాలకు చేసిన అభివృద్ధి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్య రంగాల్లో ఆయన ఎంతో కృషి చేశారు. విద్యార్థులు చదువుకునేందుకు కాలేజీలు లేని రోజుల్లో 1965లో జమ్మికుంటలో ఆదర్శ డిగ్రీ కళాశాలను స్థాపించారు. కాగజ్నగర్ మొదలుకొని జనగామ వరకు రైలుమార్గంలో ఉన్న విద్యార్థులకు ఈ కాలేజీలో చదువుకునే అవకాశం కలిగింది. 1982లో ఇది ప్రభుత్వ యాజమాన్యంలోకి వెళ్ళింది.
జమ్మికుంట పట్టణానికి చాలాకాలం తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేది. సరాబు రాంగోపాల్ రావు సహకారంతో మానేర్ నది నుంచి పైప్ లైన్ వేయించి ఆ సమస్యను అధిగమించారు. ఆ రోజుల్లో కుష్టువ్యాధి కూడా ఒక భయంకరమైన సమస్య. వీరు లెప్రా సొసైటీలో సభ్యులై 1968లో హిందూ కుష్టు నివారణ్ సంఘ్ స్థాపించారు. దాని ఆధ్వర్యంలో 30 పడకల ఆసుపత్రిని, కుష్టువ్యాధిగ్రస్తుల పిల్లల కోసం జమ్మికుంటలో ఆశ్రమ పాఠశాలను స్థాపించారు. కరీంనగర్ జిల్లా తనుగుల గ్రామంలోనూ నల్గొండ జిల్లా రెడ్లరేపాక, మల్కాపూర్ గ్రామాల్లోను కుష్టు వ్యాధిగ్రస్తులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
1974లో గ్రామ నవనిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాలలో గ్రామీణ ప్రజలకు సేవలందించారు. 1978లో జమ్మికుంటలో లాల్ బహదూర్ ఇండస్ట్రియల్ కో ఆపరేటివ్ సొసైటీ స్థాపించారు. ఇందులో భాగంగా అట్టపెట్టెల తయారీ కేంద్రం, నూనె తయారీ కేంద్రం, ఐ.టి.ఐ., టైప్ ఇన్స్టిట్యూట్ వంటివి స్థాపించి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. స్వయం సమృద్ధిలో భాగంగా వావిలాల గ్రామంలో పీవీ నరసింహారావుతో కలిసి ఖాదీ ప్రతిస్థాన్, భాగ్యనగర్ ఖాదీ ప్రతిస్థాన్ ఏర్పాటు చేశారు. వీటికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ‘సాధన’ అనే స్వచ్ఛంద సంస్థకు, హైదరాబాదు రైటర్స్, పబ్లిషర్స్ అండ్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా జనార్ధనరెడ్డి పనిచేశారు.
1992 నుంచి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహకారంతో జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. ఈ ప్రాంత అభివృద్ధిలో కృషి విజ్ఞాన కేంద్రం పాత్ర గణనీయమైనది. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జమ్మికుంట ప్రాంతంలోని రైతాంగానికి శాస్త్రీయ వ్యవసాయ పద్దతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల చేత చైతన్యాన్ని అందిస్తుండటం గమనార్హం. 2006-07 సంవత్సరానికి గాను ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం అవార్డును అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చేతుల మీదుగా అందుకున్నారు. 2019లో స్వామి రామానందతీర్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి పీవీ నరసింహారావు పేరిట ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన్ పురస్కారం అందుకున్నారు. జనార్దన రెడ్డి గారు చివరి వరకు కృషి విజ్ఞాన కేంద్రంతో మమేకమై వున్నారు.
జనార్ధన రెడ్డి స్థాపించిన సంస్థలలో కుష్టు నివారణ సంఘ్ వంటివి అవసరం లేకపోవడంతో అంతరించిపోగా కృషి విజ్ఞాన కేంద్రం, ఖాదీ కేంద్రాలు, కళాశాల వంటివి జాతీయస్థాయి కీర్తిని సంపాదించి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం చైతన్యం వెనుక, ఈ ప్రాంతం ధాన్యాగారం, విత్తన భాండాగారం కావడం వెనుక జనార్ధనరెడ్డి కృషి ఉంది. వీరి గ్రామానికి కల్లుపల్లి అనే పేరు కూడా ఉండేది. అందుకని ప్రజలు కల్లుపల్లి జనార్ధనరెడ్డి అని ప్రేమగా పిలుచుకునేవారు.
లోహియా స్పూర్తితో సోషలిస్టుగా రాజకీయాల్లో అడుగుపెట్టిన జనార్దన రెడ్డి గారు చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతాన్ని ఏనాడు వదల లేదు. పన్నెండేండ్లు సమితి ప్రెసిడెంట్గా, పదేండ్లు శాసనసభ్యులుగా, అనేక సంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షులుగా సేవలందించి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. సామ్యవాద సిద్ధాంతంలోని సమత మరియు సంపన్నత, గాంధేయవాదానికి చెందిన స్వస్థత, సాక్షరత, స్వావలంబన, సదాచారాలను తన జీవితాంతం పాటించిన జనార్దన రెడ్డి 2022, మార్చి 28న తన 87వ ఏట అనారోగ్యంతో భాగ్యనగరంలో కన్నుమూశారు. ఆయన స్మారకార్థం జమ్మికుంట జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాన్నిఏర్పాటు చేశారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







