విజయవాడలో 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' పై సదస్సు

- March 30, 2025 , by Maagulf
విజయవాడలో \'ఒకే దేశం-ఒకే ఎన్నిక\' పై సదస్సు
విజయవాడ: ఏకకాల ఎన్నికలతో భారత దేశానికి ప్రయోజనమని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు.శనివారం ఆయన విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో "ఒకే దేశం-ఒకే ఎన్నిక" అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు గొప్ప వివేచనతో, విచక్షణతో ఓటు వేస్తారని స్పష్టం చేశారు.లోక్సభకు,రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగినా కేంద్రంలో ఎవరిని అధికారంలోకి తీసుకురావాలి, రాష్ట్రంలో ఎవరికి అధికారం ఇవ్వాలి అన్న విషయంలో వారికి స్పష్టత ఉంటుందని చెప్పారు.ఓటర్లు స్థానిక, జాతీయ అంశాల మధ్య స్పష్టమైన విభజన రేఖ గీసుకుని ఓటు వేస్తారని వివిధ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయన్నారు."ఏకకాల ఎన్నికల వలన జాతీయ పార్టీలకు ప్రయోజనమని, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనం కోసమే జమిలి ఎన్నికల ప్రతిపాదన ముందుకు తీసుకు వస్తున్నారని కొన్ని రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. దేశంలో వివిధ సందర్భాల్లో జరిగిన ఎన్నికలను స్థూలంగా పరిశీలిస్తే ఆ పార్టీల వాదనలో పసలేదని స్పష్టం అవుతుంది." అని చెప్పారు.మనకు ఏకకాల ఎన్నికలు కొత్త కాదని స్పష్టం చేశారు.
 
"మన మొట్టమొదటి ప్రధానమంత్రి నెహ్రూ హయాంలో 1952,1957,1962లో, ఆ తర్వాత  ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్పప్పుడు 1967లో ఏకకాల ఎన్నికలు జరిగాయి. అంటే కేంద్రానికి, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. మన దేశంలో జరిగిన ఎన్నికలను స్థూలంగా గమనిస్తే గతంలో జమిలి ఎన్నికలు జరిగినప్పుడు కేంద్రంలో ఒకే పార్టీ దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్నా ప్రాంతీయ పార్టీలు లేదా విపక్ష పార్టీలు స్పష్టమైన ఆధిక్యంతో గెలిచినట్లు స్పష్టమవుతుంది. 1957 లో కేంద్రంలో జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానిగా ఉన్నారు.అప్పుడు జరిగిన ఏకకాల ఎన్నికల్లో కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా వామపక్ష ప్రభుత్వం ఏర్పడింది.1967లోనూ  కేరళలో వామపక్ష ప్రభుత్వం గెలిచింది. అదే సంవత్సరం తమిళనాడు శానసనభ ఎన్నికల్లో డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంది. ఆ సమయంలో కేంద్రంలో ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నారు.అదే సంవత్సరం ఒడిశా   ప్రజలు కేంద్రంలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కు ఓటు వేసినా రాష్ట్రంలో మాత్రం  స్వతంత్ర పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. 1984 సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో శ్రీ రాజీవ్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ 400కు పైగా స్థానాల్లో గెలిచి విజయాన్ని సాధించింది.  కొద్ది నెలల తర్వాత 1985 మార్చిలో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో నందమూరి తారకరామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది.1985లోనే కర్ణాటక శానసనభకు నిర్వహించిన ఎన్నికల్లో  శ్రీ రామకృష్ణ హెగ్డే గారి నేతృత్వంలోని జనతాపార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. 1999 అక్టోబరులో సాధారణ ఎన్నికలతో పాటు కర్ణాటక శానసనభకు కూడా ఎన్నికలు నిర్వహించగా రాష్ట్రంలో ఎస్.ఎం.కృష్ణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కేంద్రంలో మాత్రం ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ శాసనసభకు ఇటీవల-అంటే–2023 నవంబరు 30న నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.కొద్ది నెలల తర్వాత నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో భాజపా రాష్ర్టంలో 8 లోక్ సభ స్థానాలు గెల్చుకుంది." అని సోదాహరణంగా వివరించారు. ‘‘జమిలి ఎన్నికలు నిర్వహిస్తే సమాఖ్య స్ఫూర్తి ప్రమాదంలో పడుతుంది. జమిలి ఎన్నికల్లో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఒకదానిపై ఒకటి పోటీ పడడం వల్ల జాతీయ అంశాలకు ఓటర్లు ప్రాధాన్యం ఇస్తారు- దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం  కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి . ఇలా వాదిస్తూ సగటు భారతీయ ఓటరు తెలివితేటలను తక్కువ అంచనా వేయకూడదు." అని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. 
 
దేశంలో ఎప్పుడూ ఏదో ఒక ఎన్నిక జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు గట్టి నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు.ఏదైనా గట్టి నిర్ణయం తీసుకుంటే తదుపరి ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన పార్టీలో ఉంటుందని చెప్పారు. "ప్రభావవంతమైన పరిపాలన, సుస్థిరత, పురోగతి దిశగా పడే గొప్ప ముందడుగుగా ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను చూడాలి. " అన్నారు."కేంద్ర ఎన్నికల సంఘం, భారత న్యాయ కమిషన్ లే కాకుండా నీతి ఆయోగ్ కూడా ‘‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’’ను ప్రతిపాదించింది. వ్యయం ఆదా అవుతుందనే అంశంతో పాటు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతిపాదించింది." అని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.తరచూ ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పనికి అంతరాయం ఉండదని, అధికారులు, ఎన్నికయిన ప్రజా ప్రతినిధులు పరిపాలనపై, అభివృద్ధి కార్యక్రమాలపై 100శాతం దృష్టి పెట్టడానికి వీలవుతుందని చెప్పారు.ఈ అంశాలన్నింటినీ దృష్ట్యా జాతీయ ప్రయోజనాలను, సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఏకకాల ఎన్నికలపై రాజకీయ పార్టీలు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షించారు.విద్య, వైద్యం మినహా ఇంకా వేటికీ ఉచితాలు ఇవ్వరాదని వెంకయ్య నాయుడు సూచించారు.పార్టీ ఫిరాయింపులపై ఇప్పుడున్న చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, శాసనసభ్యులు సుజనా చౌదరి,కామినేని శ్రీనివాస్,పార్థసారథి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శివ శంకర్ రావు, ఇతర ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com