బాలీవుడ్ సింగమ్-అజయ్ దేవ్‌గన్

- April 02, 2025 , by Maagulf
బాలీవుడ్ సింగమ్-అజయ్ దేవ్‌గన్

అజయ్ దేవ్‌గన్...బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఖాన్ త్రయం తర్వాత అత్యధిక మాస్ ప్రేక్షకాదరణ ఉన్న స్టార్ హీరో. సినీ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పటికి తన స్వశక్తితోనే స్టార్ హీరో హోదాను అందుకున్నారు.సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ రాణించారు.తన తరం హీరోల్లో అత్యధిక జాతీయ అవార్డులను అందుకున్న ఏకైక కథానాయకుడిగా అజయ్ నిలిచారు. నేడు బాలీవుడ్ సింగమ్ అజయ్ దేవ్‌గన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం...

అజయ్ దేవ్‌గన్ అసలు పేరు విశాల్ వీరు దేవ్‌గన్. 1969,ఏప్రిల్ 2న ముంబైలో వీరు దేవ్‌గన్, వీణా దంపతులకు జన్మించారు. అజయ్  బాల్యం, విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే జరిగింది. మితాబాయి కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అజయ్ తండ్రి వీరు దేవ్‌గన్ బాలీవుడ్‌లో ప్రముఖ స్టాంట్ కొరియోగ్రాఫర్ మరియు సినీ నిర్మాత. తండ్రి ద్వారా సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకున్న అజయ్ 1991లో సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఈ సమయంలోనే తన పేరును విశాల్ నుంచి అజయ్‌గా మార్చుకున్నారు.

అజయ్ 1991లో "ఫుల్ ఔర్ కంటే" చిత్రంతో హీరోగా అడుగుపెట్టి తోలి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరసగా లవ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ 90ల్లో ఉత్తరాది యువతలో మంచి క్రేజ్ సంపాదించడమే కాకుండా ఎన్నో సూపర్ డూపర్ హిట్లను సాధించాడు. ఒకానొక సమయంలో షారుక్, అమిర్, సల్మాన్‌ల చిత్రాల కంటే అత్యధిక బాక్సాఫీస్ వసూళ్లను అజయ్ చిత్రాలు సాధించాయి. హిందీలో హిట్టైన అజయ్ చిత్రాలన్ని ఇతర భాషల్లో రీమేక్ అయ్యి ఆయా ఇండస్ట్రీల్లో ఘన విజయాలు సాధించాయి. అందువల్లే 90వ దశకంలో అజయ్ చిత్రాల రీమేజ్ రైట్స్ కోసం ఇతర బాషల నిర్మాతలు పోటీ పడేవారు.

2000 దశకం ప్రారంభంలో అజయ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. ఇదే సమయంలో తన తోటి హీరోలు వరుస చిత్రాలతో హిట్లు కొడుతూ వచ్చారు. అజయ్ రేస్‌లో వెనుకబడుతున్న సమయంలోనే 2002లో దర్శకుడు ఆర్జీవీ తీసిన కంపెనీ చిత్రంతో మరోసారి కెరీర్లో మరపురాని హిట్ కొట్టడం జరిగింది. ఆ తర్వాత వరుసగా వివిధ జానర్స్‌ చిత్రాల్లో నటిస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైనప్పటికి ఆడియన్స్ మాత్రం అజయ్‌లోని మాస్ హీరోని బాగా ఒన్ చేసుకోవడంతో అందుకు తగ్గట్లే తన సినిమాల్లో మాస్ అంశాలు మిస్ కాకుండా చూసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అజయ్ ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో నటించగా అందులో అత్యధిక శాతం విజయవంతమైన చిత్రాలే కావడం విశేషం.

బాలీవుడ్లో అత్యధిక మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించిన హీరోగా అజయ్ నిలిచారు. తన తరంతో పాటుగా తన ముందు, తర్వాతి తరాలతో సైతం నటించి ప్రేక్షకులను మెప్పించారు. అజయ్ నటించిన మల్టీస్టారర్ చిత్రాల్లో దాదాపుగా 70 శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. అజయ్ జోడిగా నటించిన కథానాయికలు తర్వాత కాలంలో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగు వెలిగారు.

అజయ్ హీరోగానే కాకుండా నిర్మాతగా రాణించారు. దేవ్‌గన్ ఫిలింస్ పేరిట చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1999లో తన తండ్రి వీరు దర్శకత్వంలో హిందుస్తానీ కా కసమ్ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత వరసగా సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు. ఇవే కాకుండా ఇతర బాషా చిత్రాలను హిందీలో పంపిణీదారుగా సైతం ఉన్నారు. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి చిత్రాలను హిందీ చిత్ర సీమకు పరిచయం చేసిన ఘనత అజయ్‌దే. అజయ్ దర్శకత్వ బాధ్యతల్లో కూడా రాణించారు. అజయ్ సినీ విఎఫ్ఎక్స్ రంగంలో కూడా ఉన్నారు.

అజయ్ ఇప్పటి వరకు చాలా అవార్డులు అందుకున్నారు. ఒక్క నటుడిగానే మూడు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ఇవే కాకుండా నటుడిగా, నిర్మాతగా సైతం పలు ప్రతిష్టాత్మకమైన అవార్డులను అందుకున్నారు. 2016లో పద్మశ్రీ పురస్కారాన్ని సైతం అందుకున్నారు. అజయ్ వ్యక్తిగత జీవితానికి వస్తే 1999లో నటి కాజోల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.

మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్లో అజయ్ ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని బలంగా నిలబడ్డారు. ఈరోజు బాలీవుడ్ హీరోల్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా నిలిచారు. సినిమాలతోనే కాకుండా అజయ్ రియల్ ఎస్టేట్, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్ మరియు ఇతర వ్యాపారాల ద్వారా భారీగా ఆర్జన చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.  

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com