శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

- April 23, 2025 , by Maagulf
శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు

న్యూ ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పర్యటకులపై జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రమంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన చేశారు. పర్యటకుల భద్రత మేరకు వారి కోసం శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు ప్రత్యేక విమానాలు శ్రీనగర్‌ నుంచి ముంబయి, ఢిల్లీకి చేరుకుంటాయని.. ఈవిషయంపై మంగళవారం హోంమంత్రి అమిత్‌ షాతో మాట్లాడానని తెలిపారు.

అవసరమైతే మరిన్ని విమానాలు నడపడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులోభాగంగా మంత్రి అన్ని విమానయాన ఆపరేటర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ కష్ట సమయంలో ప్రయాణికులపై భారం పడకుండా.. సాధారణ స్థాయి ఛార్జీలను వసూలుచేయాలని విమానయాన సంస్థలను ఆదేశించారు. మరణించిన వ్యక్తుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకొని పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.

ఆంధ్రభవన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు
జమ్మూలో ప్రస్తుత పరిస్థితుల గురించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబునాయుడుతో రామ్మోహన్‌నాయుడు మాట్లాడారు. కశ్మీర్‌లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు సురక్షితంగా తిరిగి రావడంలో సాయం చేయడానికి ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం వాసి, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడారు. మృతదేహాన్ని విమానంలో తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com