దుబాయ్ లో ఐఎస్ ముఖ్య అనుచరుడు

- July 08, 2016 , by Maagulf
దుబాయ్ లో ఐఎస్ ముఖ్య అనుచరుడు

ఏడాది కిత్రం దుబాయ్ వెళ్లిన ఇబ్రహీం-టర్కీలోని ఐదిన్ వర్సిటీలో చేరేందుకు యత్నాలు-ఎన్‌ఐఏ విచారణలో వెలుగులోకి-షఫీ ఆర్మర్ కీలక అనుచరుడితో భేటీపై ఎన్‌ఐఏ ఆరా-ఈసేవ యజమాని ఐడీలతో సిమ్‌కార్డులు -కర్ణాటకకు చెందిన కీలక వ్యక్తి కోసం వేట-మరి కొందరి అరెస్ట్ తప్పదా? క్రైంబ్యూరో, నమస్తే తెలంగాణ:ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సానుభూతిపరుల విచారణలో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఇబ్రహీం అండ్ గ్యాంగ్ కుట్రలపై పూర్తిస్థాయి ఆధారాల సేకరణ పనిలో పడింది. అందులో భాగంగానే కుట్రకోణం ఆద్యుడైన ఇబ్రహీం ఏడాది క్రితం దుబాయ్ వెళినట్టు ఎన్‌ఐఏ గుర్తించినట్టు తెలిసింది. తొలుత గ్రీస్‌కు వెళ్లేందుకు ఇబ్రహీం ప్రయత్నించాడని, అది విఫలం కావడంతో టర్కీలోని ఐదిన్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడని ఎన్‌ఐఏ విచారణలో వెలుగులోకి వచ్చింది. అసలు ఇబ్రహీంకు దుబాయ్‌లో పనేమిటి? అతడి వెనుక ఎవరున్నారు? దుబాయ్‌లో ఉన్న వ్యక్తికి షఫీ ఆర్మర్‌కు సంబంధం ఏమిటి? అన్న కోణంలో దర్యాప్తును వేగవంతం చేసినట్టు దర్యాప్తు వర్గాల ద్వారా తెలిసింది. -దుబాయిలో ఇబ్రహీంకు పనేంటి?సరిగ్గా ఏడాది క్రితం ఐఎస్ సానుభూతిపరుడు ఇబ్రహీం దుబాయ్ వెళ్లినట్టు ఎన్‌ఐఏ అధికారుల దృష్టికి వచ్చింది. దుబాయ్‌లో అతను ఎవరెవరని కలిశాడు? వారి నేపథ్యం ఏమిటి? వారి ద్వారా ఐఎస్ కీలక నేతలను కలిశాడా? ఇబ్రహీం దుబాయ్ పర్యటనలోనే ఐఎస్ రిక్రూట్‌మెంట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న షఫీ ఆర్మర్‌ను కూడా కలిశాడన్న ఆరోపణలపై ఎన్‌ఐఏ ప్రధానంగా దృష్టి సారించినట్టు సమాచారం. దుబాయ్ నుంచి కూడా ఇండియాలో ఐఎస్ నెట్‌వర్క్ విస్తృతానికి కొంతమంది పనిచేస్తున్నారని ఎన్‌ఐఏ అనుమానిస్తున్నది. ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలన్నింటిని అక్కడినుంచే చక్కబెడుతున్నట్టు కేంద్ర నిఘావర్గాలు కూడా అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీం దుబాయ్ నుంచి హవాలా ద్వారా హైదరాబాద్‌కు డబ్బులు తెప్పించి ఉంటా డా అన్న కోణంలోనూ ఎన్‌ఐఏ విచారణ జరుపుతున్నది. -షఫీ ఆర్మర్‌కీలక అనుచరుడు దుబాయ్‌లోనే?ఐఎస్ కీలకనేతగా ఉన్న షఫీ ఆర్మర్ ముఖ్య అనుచరుడైన కర్నాటకవాసి ఒకరు దుబాయ్‌లో ఉన్నాడని ఎన్‌ఐఏ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఇండియాలో పేలుళ్ల కుట్రకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని ఆ కీలకవ్యక్తే పర్యవేక్షిస్తున్నాడని, మాడ్యూల్స్ రిక్రూట్‌మెంట్‌లోనూ అతడి జోక్యం ఉందని ఎన్‌ఐఏ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మేరకు కర్నాటక అధికారులు కూడా ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. అతడి వివరాలు సేకరణతో పాటు అతడికి ఇండియాలో ఉంటూ సహకరిస్తున్న వారిని త్వరలోనే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. -ఆ సిమ్‌కార్డులు ఎలా వచ్చాయి? ఉగ్రకుట్రలో ఐసిస్ సానుభూతిపరులు వాడిన సిమ్‌కార్డులపై ఎన్‌ఐఏ ప్రధానంగా దృష్టి సారించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక టెక్నికల్ టీమ్‌ను రప్పించి మరీ వివరాలను రాబట్టే పనిలో పడింది. పేలుళ్లకు కుట్రపన్నిన వ్యవహారంలో 32 సిమ్‌కార్డులను ఐదుగురు సానుభూతిపరుల నుంచి ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. ఇన్ని సిమ్‌కార్డులు తీసుకోవడం వెనుక అసలు రహస్యం ఏమిటి? ప్రతిరోజూ ఇంటర్నెట్ ద్వారా ఎవరెవరనీ కాంటాక్ట్ చేశారు? కాంటాక్ట్ అయిన వారి వివరాలు ఏమిటి? ఇన్ని సిమ్‌కార్డులకు ధృవపత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో ఎన్‌ఐఏ దర్యాప్తు జోరందుకున్నది. -32 కార్డులకు నకిలీవే?కిరాణాషాపులో చాక్లెట్లు కొన్నంత సునాయాసంగా ఇబ్ర హీం అండ్ గ్యాంగ్ 32 సిమ్‌కార్డులను కొనేసింది. ప్రతి సిమ్‌కార్డుకు నకిలీ ధృవపత్రాలు సృష్టించి కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే సంతోష్‌నగర్‌లోని ఈద్‌బజార్‌కు చెందిన నిజాముద్దీన్ ధృవపత్రాలతో సిమ్‌కార్డు పొందినట్టు ఎన్‌ఐఏ విచారణలో స్పష్టమైంది. అయితే ఇబ్రహీం నిత్యం ఈద్‌బజార్‌లోని ఓ ఈసేవ సెంటర్‌లో ఇంటర్నెర్ బ్రౌజింగ్ చేసేవాడని ఎన్‌ఐఏ తెలుసుకుంది. ఆ ఈ సేవ సెంటర్ కూడా నిజాముద్దీన్‌కు చెందినదే కావడవంతో శుక్రవారం ఎన్‌ఐఏ అతడిని అదుపులోకి తీసుకొని విచారించింది. కేవలం అతడి ఐడీ ప్రూఫ్‌లతో ఇబ్రహీం సిమ్‌కార్డులు పొందినట్టు దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. అయితే ఇబ్రహీం కేవలం నిజాముద్దీన్ ఐడీ ప్రూఫ్‌లతో మాత్రమే మరి కొంతమంది పేర్లమీద సిమ్‌కార్డులు పొందాడని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఏ ఒక్క సిమ్‌కార్డు కూడా ఇబ్రహీం అండ్ గ్యాంగ్ పేర్ల మీద లేదని, వ్యూహాత్మకంగానే ఇతరుల ధృవపత్రాల మీద కార్డులు కొనుగోలు చేశారని ఎన్‌ఐఏ గుర్తించింది. నిజంగా ఇబ్రహీం పెట్టిన ఐడీ ప్రూఫ్‌లు పెట్టిన వ్యక్తులకు, ఈ కుట్రకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా? లేవా అన్న కోణంలోనూ తాము విచారిస్తున్నట్టు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. నిజాముద్దీన్ వాంగ్మూలం సేకరించి వదిలివేసినట్టు ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. -భారీస్థాయిలో డేటా యూసేజ్సిమ్‌కార్డులు పొందిన ఇబ్రహీం అండ్ గ్యాంగ్ ఆ కార్డులతో భారీస్థాయిలో ఇంటర్నెట్ డాటా యూసేజ్ చేసినట్టు ఎన్‌ఐఏ టెక్నికల్‌టీం గుర్తించింది. ఇంటర్నెట్, సోషల్ వెబ్‌సైట్ల ద్వారా వీడియో కాలింగ్ చేసి ఐఎస్ కీలక నేతలతో సంభాషణలు సాగించినట్టు ఎన్‌ఐఏ విచారణలో బయటపడినట్టు సమాచారం. ఇందులో కొన్నిసార్లు షఫీ ఆర్మర్‌తోనూ, దుబాయ్‌లోని మరికొందరితోనూ ఇబ్రహీం సంప్రదింపులు జరిపినట్టు ఎన్‌ఐఏ టెక్నికల్ అనాలసిస్ వింగ్ గుర్తించినట్టు తెలిసింది. ఇలా ఒక్కో సిమ్‌కార్డుతో భారీస్థాయిలో ఇంటర్నెట్ బ్రౌజింగ్ జరిగిందని అధికారులు తేల్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com