పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- July 21, 2026
మచిలీపట్నం: ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (PM-USHA) పథకం కింద మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డా. సుకాంత మజుందార్, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణా యూనివర్సిటీకి కేటాయించిన రూ.20 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధి, భవనాల మరమ్మతులు, ఆధునిక విద్యా పరికరాల కొనుగోలు, పరిశోధన సదుపాయాల విస్తరణతో పాటు ఇతర విద్యా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన అన్ని ప్రతిపాదనలను కేంద్రం పరిశీలించి ఆమోదించిందని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రతిపాదనలు ప్రస్తుతం ఏవీ లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా పీఎం-ఉషా పథకం కింద మొత్తం 33 యూనిట్లకు రూ.378.75 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 7 విశ్వవిద్యాలయాలు, 21 ప్రభుత్వ కళాశాలలు, 5 జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయి.
కృష్ణా జిల్లా నుంచి మొత్తం నాలుగు ప్రతిపాదనలు కేంద్రానికి పంపగా, వాటిలో మూడు ఆమోదం పొందాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి:
- కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నం – రూ.20 కోట్లు
- ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బంటుమిల్లి – రూ.5 కోట్లు
- కృష్ణా జిల్లా (జెండర్ ఇన్‌క్లూజన్ అండ్ ఈక్విటీ ఇనిషియేటివ్స్) – రూ.10 కోట్లు
ఈ నిధులు జిల్లాలో ఉన్నత విద్యా రంగానికి మరింత ఊతమిస్తాయని ఎంపీ వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, పరిశోధన అవకాశాల విస్తరణకు ఈ నిధులు దోహదపడతాయని తెలిపారు.
విద్యా రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, పీఎం-ఉషా పథకం ద్వారా కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలకు విశేష ప్రయోజనం చేకూరుతుందని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- భారత్–కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు
- ఖతార్లో వేతనాల చెల్లింపుపై కొత్త నిబంధనలు.. WPSలో కీలక మార్పులు
- సౌదీ అరేబియా రెడ్ సీ తీరానికి ఎతిహాద్ విమాన సర్వీసులు
- స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం..అభ్యర్థుల ఎంపిక పై చంద్రబాబు కీలక ఆదేశాలు
- భారతీయ సంస్థల్లో ఏఐ పెట్టుబడుల జోరు
- దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్గా షేక్ హమ్దాన్కు 20 ఏళ్లు..
- దుబాయ్ స్క్వేర్ మాల్లో ప్రపంచంలోనే తొలిసారి ఏసీ పార్కింగ్..
- పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు
- ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు వెంకటరత్నం పంతులు ఫోటో ఆవిష్కరణ
- దుబాయ్ లో ఘనంగా జరిగిన GWAC 10వ ఆవిర్భావ వేడుకలు...







