భాజపాకు సంతోష్‌జీ ప్లస్సా, మైనస్సా...!
- May 23, 2025
బి.ఎల్.సంతోష్....ఈపేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసుంటుంది...కానీ ఇప్పటి దేశ రాజకీయాల్లో భాజపాకు సంస్థాగత బలాన్ని రోజు రోజుకు పెరగడం వెనుకున్న వ్యక్తుల్లో ఇతను ఒకరు. పార్టీలో మోడీ- షా ద్వయం తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా సంతోష్ నిలుస్తున్నారు.2006లో ఆరెస్సెస్ నుంచి భాజపాకు ట్రాన్స్ఫర్ అయిన నాటి నుంచి నేటి వరకు రాజకీయాలే శ్వాసగా, ధ్యాసగా బ్రతుకుతున్న నాయకుడు సంతోష్‌జీ. భాజపా అధినాయకత్వం నిర్దేశించుకున్న "ఆపరేషన్ సౌత్" కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకొని దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు శ్రమిస్తున్నారు.. ఈరోజు భాజపా జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బి.ఎల్. సంతోష్ మీద ప్రత్యేక కథనం...
సంతోష్జీగా జాతీయ రాజకీయాల్లో సుపరిచితమైన బి.ఎల్. సంతోష్ పూర్తిపేరు బొమ్మరబెట్ట లక్ష్మీ జనార్దన సంతోష్. 1969 ,ఫిబ్రవరి 1వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా హిరియడ్క అనే చిన్న పట్టణంలో మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి పూజారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ కుటుంబ పోషణ చేసేవారు. చిన్నప్పటి నుంచి చదువుల్లో చక్కటి ప్రతిభను కనబరుస్తూ వచ్చిన అయన దాతలు, ప్రభుత్వ ఉపకారవేతనాలతో ఉన్నత విద్యను పూర్తిచేశారు. దావణగిరెలోని బి.డి.టి పాలిటెక్నీక్ కళాశాల నుంచి కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేశారు.
సంతోష్ తన బాల్యంలోనే ఆరెస్సెస్ పట్ల ఆకర్షితుడై సంఘ్ శాఖలకు హాజరవుతూ వచ్చారు. ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన తర్వాత 1990లో ఆరెస్సెస్ ఫుల్ టైమ్ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టి షిమోగా జిల్లాలో మొదట పనిచేశారు. 1990 నుంచి 2006 వరకు కర్ణాటకలోనే వివిధ హోదాల్లో పనిచేశారు. సంఘంలో సీనియర్ నాయకుడైన దత్తాత్రేయ హోసబలే సహకారంతో భాజపా పార్టీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారు. 2006లో కర్ణాటక భాజపా ఆర్గనైజింగ్ సెక్రెటరీగా నియమితులైన సంతోష్ 2014 వరకు ఆ పదవిలోనే కొనసాగారు.
2006లో జేడీఎస్- భాజపా ప్రభుత్వం కర్ణాటకలో కొలువుదీరిన తర్వాత అప్పటి డిప్యూటీ సీఎం మరియు భాజపా అగ్రనేత యడ్యూరప్పతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయడం మొదలుపెట్టారు. అయితే. అదే సమయంలో యడ్యూరప్ప వైరి వర్గమైన బ్రాహ్మణ నేత అనంత్ కుమార్ వర్గంలో ఉంటూ వచ్చారు. కర్ణాటక పార్టీ శాఖలో యడ్యూరప్పకు ఉన్న పట్టును తగ్గించేందుకు సంతోష్ తెరవెనుక ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే, అప్పటి రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ అరుణ్ జైట్లీ మాత్రం యడ్యూరప్ప మరియు ఇతర సీనియర్ నేతలకు మద్దతుగా నిలవడంతో కొంచెం వెనక్కి తగ్గినప్పటికి, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టారు.
2008లో భాజపా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తన వర్గానికి చెందిన ఎమ్యెల్యేలకు మంత్రి పదవులు ఇప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో సంతోష్ లాబీయింగ్ చేసినప్పటికి కుదరలేదు. పైగా పార్టీ బలోపేతానికి వచ్చి వర్గాలను తయారు చేస్తున్నారని ఆయనపై సంఘానికి సైతం ఫిర్యాదులు వెళ్లాయి. యడ్యూరప్ప సైతం ఆరెస్సెస్ నేపథ్యం నుంచి వ్యక్తి కావడంతో సంఘ్ పెద్దలు సైతం ఎడ్డికే తమ మద్దతు తెలిపారు. ఆరెస్సెస్ పెద్దల ఆశీస్సులతో పాలన మొదలుపెట్టిన యడ్యూరప్పకు తర్వాత సంతోష్ అడ్డుపడలేదు.
2011లో యడ్యూరప్ప సీఎంగా దిగిపోయిన తర్వాతనే సంతోష్ పార్టీలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలుపెట్టారు. తన వర్గానికి చెందిన వారికి సదానంద గౌడ, జగదీశ్ శెట్టర్ మంత్రివర్గాల్లో మంత్రిపదవులు ఇప్పించుకున్నారు. పార్టీలో సంతోష్ వర్గం పైచైయి కావడంతో పాటు కష్టకాలంలో పార్టీ తనని దూరం పెట్టిందని ఆవేదన చెందిన ఎడ్డీ పార్టీకి రాజీనామా సొంత కుంపటి పెట్టుకున్నారు. యడ్యూరప్ప పార్టీకి దూరమైన తర్వాత తన అనుచర బృందంతో పార్టీ పదవులను నింపారు.
2013లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓటమికి సంతోష్ వ్యవహారశైలి కూడా ఒక కారణమని ఆ పార్టీలోని సీనియర్లు సైతం ఆఫ్ దా రికార్డుగా అంగీకరించారు. అయితే, సంతోష్ కోటరీ మాత్రం ఈ వాదనను అంగీకరించకపోవడమే కాకుండా, యడ్యూరప్ప వల్లే ఓడామని ఆయన్ని వెనకేసుకొచ్చారు. అదే ఏడాది గోవాలో జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి మోడీకి మద్దతుదారుగా మారిన సంతోష్, సంఘంలో ఉన్న మోడీ సన్నిహితుల ద్వారా ఆయనకు దగ్గరవుతూ వచ్చారు. మోడీతో పాటుగా అమిత్ షాతో సైతం పరిచయాలు ఏర్పరచుకున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ మానియాతో పాటుగా యడ్యూరప్ప తిరిగి పార్టీలో చేరడంతో, ఆ ఎన్నికల్లో 28 స్థానాలకు గానూ 17 స్థానాలను కైవసం చేసుకుంది. కేంద్రంలో ఎన్డీయే కూటమి ఏర్పడిన తర్వాత సంతోష్ కర్ణాటక నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. 2015లో అప్పటి వరకు ఉన్న జాతీయ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామ్ లాల్ తర్వాత ఆ పదవిని సంతోష్ చేపట్టారు. 2015 నుంచి ఇప్పటి వరకు అదే పదవిలో కొనసాగుతున్నారు. అయితే, సంతోష్ ఢిల్లీలో ఉన్నప్పటికి మనసు మాత్రం కర్ణాటక మీదనే ఉండేది.
ఇదే సమయంలో భాజపాను దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణపై దృష్టి పెట్టిన మోడీ- షా ద్వయం "ఆపరేషన్ సౌత్" కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని తొలుత అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ మాధవ్‌కు అప్పగించేందుకు సిద్ధమైంది. మాధవ్ అప్పటికే ఈశాన్య మరియు జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉండటంతో ఆరెస్సెస్ నుంచి పార్టీలోకి వచ్చిన సతీష్జీకి బాధ్యతలు అప్పజెప్పింది. సతీష్జీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసినప్పటికి, అనుకున్న ఫలితాలు రాకపోవడంతో ఆయన్ని పశ్చిమ భారతానికి బదిలీ చేశారు.
సతీష్జీ తర్వాత ఎవ్వరికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వకుండా, సంతోష్ పర్యవేక్షణలోనే ముందుకు సాగేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే అదనుగా తన మకాం ఢిల్లీ నుంచి బెంగుళూరుకు మార్చారు.పేరుకే ఆపరేషన్ సౌత్ కానీ ఆయన దృష్టి కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటూ వచ్చింది. సంతోష్ కర్ణాటకకే పరిమితం కావడం ఇతర రాష్ట్రాల్లో పర్యటించకపోవడం గమనించిన అధిష్టానం వివరణ అడగ్గా, తనకు సహాయకులు లేనిదే కార్యక్రమాన్ని ముందుకు నడిపించలేనని అనడంతో చేసేదేమిలేక సునీల్ బన్సల్ మరియు సునీల్ దేవధర్, మధుకర్జీ వంటి పలువురు సీనియర్ ఆర్గనైజింగ్ వ్యక్తులను సహాయకులుగా పంపారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా దాదాపుగా ఒంటరిగానే గెలిచి తీరుతుందని విశ్లేషకులు అంచనా వేసినప్పటికి, సంతోష్ జోక్యం మరియు కొన్ని స్థానాల్లో ఆయన అనుచరులు చేసిన తిరుగుబాటు వల్లే పార్టీ 100 మార్క్ దాటింది కానీ, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు యడ్యూరప్పకు పార్టీ పెద్దలు పూర్తి సహాయ సహకారాలు ఇవ్వడంతో 2019లో పార్టీని అధికార పీఠం కూర్చోబెట్టారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సైతం సంతోష్ దక్షిణ బెంగళూరు పార్లమెంట్ అభ్యర్థి తేజస్వి సూర్య వరకే పరిమితం అయినప్పుడు యడ్యూరప్ప రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పార్టీని 28 స్థానాలకు గానూ 25 స్థానాల్లో గెలిపించారు.
యడ్యూరప్ప సీఎం అయినప్పటికి ఆయన పార్టీ పెద్దలకు పితూరీలు చెప్పడం, తన అనుచరులతో ఏదొక గందరగోళం సృష్టించడంతోనే ఎక్కువగా నిమగ్నమైయ్యారు. సంతోష్ వ్యవహారశైలి రోజురోజుకు వివాదాస్పదం కావడంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకొనే స్థాయికి వచ్చింది. సంతోష్ కాలయాపన వల్లే ఆపరేషన్ సౌత్ ముందుకు వెళ్లడం లేదని గ్రహించిన పార్టీ నాయకత్వం ఆయన్ని పక్కన పెట్టి తామే స్వయంగా పార్టీ విస్తరణ బాధ్యతలు కోసం ప్రణాళికలు, వ్యూహాలు రచిస్తూ మరికొందరి నేతలను దక్షిణాది రాష్ట్రాలకు పంపించడం మొదలుపెట్టారు. వారిలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఒకరు.
2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత తర్వాత వచ్చిన బస్వారాజ్ బొమ్మైతో దోస్తీ కట్టి పార్టీ, ప్రభుత్వంలో తన అధికారాన్ని చెలాయించడం మొదలుపెట్టారు సంతోష్. సంతోష్ పాలనా వ్యవహారాల్లో తలదూరుస్తూ ఉండడాన్ని ఆ రాష్ట్ర మీడియా బహిరంగంగానే ఆక్షేపించింది. మొదట్లో బొమ్మై మొహమాటానికి పోయి సంతోష్ అడిగిన ప్రతి పని చేసి పెట్టేవారు. అయితే, రానురాను అడగం స్థానంలో డిమాండ్ చేయడాన్ని భరించలేని బొమ్మై పనులు చేయడానికి ససేమిరా అనడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలై పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. 2023 ఎన్నికలకు ముందు పార్టీ, ప్రభుత్వంలో వచ్చిన వైఖరిని పసిగట్టిన కేంద్రం, రక్షణ చర్యలకు పూనుకొని యడ్యూరప్పను రంగంలోకి దించింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది.
కర్ణాటక రాజకీయాలకు మాత్రమే పరిమితం కావడం, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం వల్ల జాతీయ పార్టీలో సంతోష్ స్థానం తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు ఢిల్లీ వచ్చారంటే ఆయన్ని కలుసుకునేందుకు బారులు తీరిన పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ముఖం చాటేస్తూ వచ్చారు. తన స్థానం తగ్గుతుందన్న ప్రమాద ఘంటికలు వినబడటంతో వెంటనే రంగంలోకి దిగి మోడీ- షాలతో మాట్లాడుకొని తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే, ఈసారి ఒకప్పటి స్థాయిలో ఉన్న పూర్తి అధికారాలకు భారీగా కత్తెర వేయడం జరిగింది. సంతోష్ సైతం ఏమి చేయలేక ఆ ద్వయం ముందుకు సాగిలపడ్డారు.
పార్టీలో తిరిగి పునర్వైభవాన్ని సంపాదించుకోవడానికి సంతోష్ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. 2023లో రాబోతున్న తెలంగాణ ఎన్నికలు కోసం పార్టీని సన్నద్ధం చేయాల్సింది పోయి పార్టీకి ప్రజల్లో ఊపు తెచ్చిన బండి సంజయ్‌ని పక్కన పెట్టి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో అప్పటి వరకు తెలంగాణాలో నంబర్ 2గా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఆమడ దూరంలో ఉన్న పార్టీ కాస్త చతికపడిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగ భాజపా 8 స్థానాలకు పరిమితం అయ్యింది. ఈ సంతోష్ క్రెడిబిలిటీని బాగా డ్యామేజ్ చేసింది. ఇంక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అయితే పార్టీ నానాటికి తీసికట్టుగా తయారైంది. అధికార పార్టీల పట్ల కొన్ని వర్గాల్లో వ్యతిరేకతలను క్యాష్ చేసుకోవడంలో భాజపా విఫలమైంది. సంతోష్ దగ్గరివారే ఈ రెండు రాష్ట్రాల వ్యవహారాల చూడటం ఆయనకు బాగా మైనస్.
సంతోష్ వల్ల తమ విస్తరణ కార్యక్రమం మొత్తం విఫలం అవుతుందని భావించిన మోడీ- షాలు, క్రమంగా ఆయన్ని దక్షిణాది వ్యవహారాల నుంచి దూరం పెడుతూ వచ్చారు. అందులో భాగంగానే మోడీనే స్వయంగా కేరళలో క్రిస్టియన్స్ కు దగ్గరవ్వడం, తమిళనాడులో దళిత వర్గాలకు చేవయ్యేలా ఆ వర్గానికి చెందిన మురుగన్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. విటన్నటి వెనుక షా సైతం క్రియాశీలకంగా వ్యవహరించారు. " ఆపరేషన్ సౌత్"ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు తమ శక్తి, యుక్తుల మీదనే నమ్మకం పెట్టుకున్నారు. వారిద్దరూ అంతగా కష్టపడుతూ ఉంటె సంతోష్ మాత్రం తన వల్లే ఇంకా పార్టీ దక్షిణాదిలో ఉందనే భ్రమలోనే ఉన్నారు.
సంతోష్ వ్యవహారశైలి పట్ల చాలా సార్లు ఫిర్యాదులు అందినప్పటికి, ఆయనకి ఆరెస్సెస్ పెద్దల నుంచి గట్టి మద్దతు ఉండటంతో ఏమి చేయలేక ఊరుకున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ పార్టీతో పొత్తును రాష్ట్ర నేతలు కోరుకుంటే సంతోష్ మాత్రం దానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు. చివరకు మోడీ- షాలు సైతం జేడీఎస్‌తో సుముఖుంగా ఉండటంతో సైలెంట్ అయ్యారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పార్టీకి బాగానే కలిసి వచ్చింది. ఇరు పార్టీలు కలిసి 19 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఈ ఎన్నికల తర్వాత సంతోష్ పూర్తిగా దక్షిణాది రాష్ట్రలకు దూరం జరిగి జాతీయ రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు.
సంతోష్ రాజకీయ ప్రయాణం మొత్తం చాలా వివాస్పదంగానే సాగుతుంది. పార్టీలో అన్ని వర్గాలను సమ దృష్టితో చూడకుండా బ్రాహ్మణ నేతలకు పెద్దపీట వేయడం, వారికే పదవులు ఇప్పిస్తారు తప్పించి మిగిలిన సామాజిక వర్గాలను దగ్గరకు తీయరు అనే వాదన బలంగా ఉంది. అందుకు ఉదాహరణే బెంగళూరు బసవనగుడి ఎమ్యెల్యే రవి సుబ్రమణ్య, బెంగళూరు దక్షిణ యువ ఎంపీ తేజస్వి సూర్య లాంటి బ్రాహ్మణ నేపథ్యం ఉన్న వారిని పార్టీలో పైకి తీసుకొచ్చారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి కథనం ప్రకారం సంతోష్ బెంగుళూరు బ్రాహ్మణ మాఫియా నాయకుడిగా వ్యవహరిస్తారు తప్పించి పార్టీని పటిష్టపరిచే నేతగా కనపడరు. ఇలాంటి వ్యవహార శైలి వల్లే ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం సానుకూల ఫలితం రాదు. ఏది ఏమైనప్పటికి పార్టీకి, సంఘానికి మధ్య వారధిగా నడవాల్సిన వ్యక్తి వర్గ నాయకుడిగా మిగిలిపోయారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







