కమల హాసన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన డీఎంకే

- May 28, 2025 , by Maagulf
కమల హాసన్‌ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన డీఎంకే

చెన్నై: లోకనాయకుడు, మక్కల్ నీది మయ్యం (ప్రజా న్యాయ కేంద్రం) అధినేత కమల హాసన్ ను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటిస్తూ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ సీట్లలో ఒక దాన్ని కమల కు కేటాయించింది. దీంతో కమల హాసన్ పార్లమెంట్ లో అడుగు పెట్టడానికి తొలి అడుగు పడింది.

కమల హాసన్ తో పార్టీతో గతంలో జరిగిన అగ్రిమెంట్ మేరకు తాము ఆ పార్టీకి ఒక రాజ్యసభ సీటును కేటాయిస్తున్నట్టు డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు. మిగిలిన మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను డీఎంకే ప్రకటించింది. పార్టీ సిట్టింగ్ ఎంపీ, సీనియర్ న్యాయవాది పి. విల్సన్, సేలం తూర్పు జిల్లా సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ శివలింగంతోపాటు పార్టీ అధికార ప్రతినిధి, ప్రముఖ రచయిత రొక్కాయ్ మాలిక్ (సల్మాగా సుపరిచితం)కు సీట్లు కేటాయించింది.

రాజ్యసభ సీట్ల కేటాయింపులో డీఎంకే సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంది. సల్మా (ముస్లిం) , విల్సన్ (క్రిస్టియన్), శివలింగం (హిందువు).. ఇలా ఒక్కో మతం నుంచి ఒక్కొక్కరికి సీటు కేటాయించింది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కమల్ పార్టీతో డీఎంకే పొత్తు కుదుర్చుకుంది. దీంతో మక్కల్ నీది మయ్యం పార్టీకి ఒక సీటు కేటాయించింది. ఆ పార్టీ నుంచి కమల పోటీ చేస్తారని పార్టీ సమావేశమై నిర్ణయించింది.

తమిళనాడు నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న షణ్ముగం, పి.విల్సన్, మొహమ్మద్ అబ్దుల్లా (ముగ్గురూ DMK), వైకో (ADMK) ల పదవీకాలం ముగుస్తుండడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. అలాగే పీఎంకే నేత అన్బుమణి రామస్వామి పదవీకాలం కూడా ముగియనుంది. మరోవైపు తమిళనాడులో ప్రతిపక్ష అన్నాడీఎంకేకి కూడా రెండు సీట్లు గెలవగల సంఖ్యా బలం ఉంది. ఆ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. జూన్ 9 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com