భారత్ లో కలవరపెడుతున్న కరోనా కేసులు

- May 29, 2025 , by Maagulf
భారత్ లో కలవరపెడుతున్న కరోనా కేసులు

న్యూ ఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ మరోసారి ప్రజలను కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అధికంగా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.

ఇప్పటికే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1000 మార్క్‌ను దాటింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం, యాక్టివ్ కేసుల సంఖ్య 1010కి చేరింది. కరోనా కేసులు వెయ్యి దాటడం ఇదే మొదటిసారి కావడంతో పరిస్థితిని ప్రభుత్వ శాఖలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.

కొత్త వేరియంట్లు – NB 1.8.1, LF.7 ప్రభావం
భారత్‌లో ఎన్‌బీ 1.8.1, ఎల్‌ఎఫ్‌ 7, అనే కరోనా కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఇండియన్‌ జీనోమిక్స్‌ కన్సార్టియం వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని.. వైరస్‌ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని గుర్తించింది. అందులోనూ.. జేఎన్‌ 1 సబ్‌ వేరియంట్‌ అయిన ఎన్‌బీ 1.8.1 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం చూపినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది.

రోగనిరోధక శక్తి తగ్గుదల కారణమా?
మొదటి, రెండో వేవ్‌ల సమయంలో ప్రజలందరికి వ్యాప్తి చెందిన కోవిడ్ వ్యాధి, టీకాలు ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి మెల్లగా తగ్గిపోవడం వల్ల కేసులు మళ్లీ పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలోని అనేక నగరాల్లో సీజనల్‌ ఫ్లూ, ఇతర వైరల్‌ ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడం కూడా కరోనా వ్యాప్తికి కారణం కావొచ్చన్నారు. వ్యాప్తి తక్కువ అయినప్పటికీ అలెర్ట్‌గా ఉండాలని కేంద్రం సూచిస్తోంది.

రాష్ట్రాల వారీగా పరిస్థితి – కేరళ అత్యధికంగా ప్రభావిత రాష్ట్రం
ప్రస్తుతం కేరళ టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 519 కేసులు నమోదు అయ్యాయి. మూడు మరణాలు సంభవించినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆ తర్వాత 21శాతం కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్‌ , తమిళనాడు ఉన్నాయి. కేరళను కరోనా కేసులు మరోసారి వణికిస్తు్న్నాయి.

కేరళలో అత్యవసర సమీక్ష
కేసుల పెరుగుదలతో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌లకు, ఆరోగ్యశాఖ అధికారులకు సూచనలు అందించారు. ముఖ్యంగా కరోనా టెస్టింగ్‌ను పెంచాలని, ఆక్సిజన్, బెడ్లు, మెడికల్ సిబ్బంది సన్నద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

కేంద్రం హెచ్చరికలు
కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకారం ప్రస్తుతం వైరస్ వ్యాప్తి పెద్దగా లేకపోయినా “అలెర్ట్‌గా ఉండటమే మేలు” అనే స్టాండ్ తీసుకుంటోంది. కరోనా వైరస్ ప్రభావాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. అన్ని రాష్ట్రాల్లో కేసుల నిఘా, వేరియంట్ ట్రాకింగ్, టెస్టింగ్‌ కొనసాగించాలనే సూచనలు జారీ అయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com