ప్రయాణికుల ఫోన్ నంబర్లే అత్యవసర సమాచారం

- June 16, 2025 , by Maagulf
ప్రయాణికుల ఫోన్ నంబర్లే అత్యవసర సమాచారం

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌ లో ఇటీవల చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదం  దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగినప్పటికీ, ప్రయాణికుల బంధువులకు సమాచారం అందించడంలో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ జాప్యం వెనుక అనేక కారకాలు పనిచేశాయి.

ఎమర్జెన్సీ కాంటాక్ట్ విషయంలో ప్రయాణికుల నిర్లక్ష్యం
విమాన ప్రయాణానికి టికెట్ బుకింగ్ సమయంలో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.ఈ విషాద వార్తను ప్రయాణికుల ఆత్మీయులకు అందించేందుకు ప్రయత్నించారు. అయితే, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ విషయంలో ప్రయాణికులు నిర్లక్ష్యం వహించడంతో అధికారులకు ఊహించని సవాలు ఎదురైంది. ప్రయాణికులలో 70 శాతం మంది తమ సొంత నెంబర్లనే ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లుగా పేర్కొనడంతో తాము ఫోన్ చేసినపుడు స్విచ్ ఆఫ్ వచ్చాయని అహ్మదాబాద్ విమానాశ్రయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రమాద సమయంలో సమాచారాన్ని అందించడంలో తలెత్తిన సమస్యలు
విమాన ప్రమాదంలో ప్రయాణికుల ఫోన్లు ధ్వంసమవడం, స్విచ్ ఆఫ్ కావడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయి. అందువల్ల, అధికారులు చేసిన ఫోన్ కాల్స్‌కి స్పందన రాలేదు. వారి కుటుంబ సభ్యులను తక్షణమే సంప్రదించడం కష్టంగా మారిందని వివరించారు.

స్థానిక యంత్రాంగం సహకారంతో సమాచారం ప్రసారం
ఈ తీవ్ర సంక్షోభ పరిస్థితిని ఎదుర్కోవడానికి అధికారులు స్థానిక యంత్రాంగాన్ని రంగంలోకి దించారు. చాలా కుటుంబాలు ప్రమాద వార్త తెలుసుకుని స్వయంగా ముందుకు రాగా, మిగిలిన వారిని గుర్తించడానికి స్థానిక యంత్రాంగం సహాయం తీసుకున్నామని సదరు అధికారి పేర్కొన్నారు. కలెక్టర్ల ద్వారా ప్రయాణికులు ఇచ్చిన చిరునామాలకు వెళ్లి వారి బంధువులకు సమాచారం అందించినట్లు తెలిపారు.

డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపు
ప్రమాదంలో దెబ్బతిన్న మృతదేహాలను గుర్తించడంలో డీఎన్ఏ పరీక్షలు కీలకంగా నిలిచాయి. డీఎన్ఏ మ్యాచింగ్ ద్వారా ఇప్పటివరకు 80 మంది మృతదేహాలను గుర్తించామని, అందులో 33 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మిగతా మృతదేహాల కోసం ఇంకా పరీక్షలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com