యూఏఈ తీరంలో షిప్స్ ఢీ..అంచనా తప్పడం వల్లనే ప్రమాదం..కుట్రకోణం లేదు..!!

- June 18, 2025 , by Maagulf
యూఏఈ తీరంలో షిప్స్ ఢీ..అంచనా తప్పడం వల్లనే ప్రమాదం..కుట్రకోణం లేదు..!!

యూఏఈ: యూఏఈ తీరంలో నిన్న(జూన్ 17) ఆయిల్ ట్యాంకర్ ADALYNN, కార్గో నౌక ఫ్రంట్ ఈగిల్ ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదానికి "ఒక నౌక నావిగేషన్ తప్పుడు అంచనా కారణంగా" జరిగిందని ఇంధన,  మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ (MoEI) వెల్లడించింది.

ఒమన్ గల్ఫ్‌లో యూఏ తీరం నుండి దాదాపు 24 నాటికల్ మైళ్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో రెండు నౌకలకు స్వల్ప నష్టం జరిగింది. ఒక నౌక ఇంధన ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికార యంత్రాంగం వెల్లడించింది. కాగా రెండు నౌకల సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని ప్రకటించారు. 

యూఏఈ నేషనల్ గార్డ్ రెండు నౌకల్లోని 24 మంది సిబ్బందిని రెస్క్యూ బోట్ల ద్వారా తరలించి ఖోర్ ఫక్కన్ నౌకాశ్రయానికి తరలించారు.  జూన్ 17న తెల్లవారుజామున 1.30 గంటలకు ఈ సంఘటన జరిగిందని, రెండు నౌకల మధ్య ఢీకొన్నట్లు అధికారులు తెలిపారు.  ఒకటి ఆంటిగ్వా , బార్బుడా జెండాతో ప్రయాణిస్తున్న ADALYNN అనే ఆయిల్ ట్యాంకర్ కాగా,  మరొకటి లైబీరియా జెండాతో ప్రయాణించే ఫ్రంట్ ఈగిల్ అనే కార్గో నౌక అని తెలిపారు. సంబంధిత అంతర్జాతీయ సంస్థలతో సమన్వయంతో సాంకేతిక దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు పారదర్శకంగా అత్యున్నత అంతర్జాతీయ సముద్ర ప్రమాణాలకు అనుగుణంగా జరుగుతుందని అథారిటీ పేర్కొంది.

'భద్రతకు సంబంధించినది కాదు'
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి సమీపంలో అడాలిన్, ఫ్రంట్ ఈగిల్ ఆయిల్ ట్యాంకర్లు ఢీకొన్నాయి. ఈ సంఘటన గురించి బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ ఆంబ్రే ఎటువంటి వివరాలు అందించనప్పటికీ, హార్ముజ్ జలసంధి సమీపంలో జరిగిన ఈ సంఘటనకు కారణం భద్రతకు సంబంధించినది కాదని స్పష్టమైంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ సంఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.  కీలకమైన హార్ముజ్ జలసంధి ఒమన్ - ఇరాన్ మధ్య ఉంది.  ఉత్తరాన ఉన్న గల్ఫ్‌ను దక్షిణాన ఒమన్ గల్ఫ్‌తో..ఆవల అరేబియా సముద్రంతో కలుపుతుంది. ప్రపంచంలోని మొత్తం చమురు వినియోగంలో ఐదవ వంతు ఈ జలసంధి గుండా వెళుతుంది. 2022 ప్రారంభం నుండి గత నెల వరకు, వోర్టెక్సా నుండి వచ్చిన డేటా ప్రకారం.. ప్రతిరోజూ దాదాపు 17.8 మిలియన్ల నుండి 20.8 మిలియన్ బ్యారెళ్ల ముడి, కండెన్సేట్, ఇంధనాలు ఈ జలసంధి ద్వారా వివిధ దేశాలకు సరఫరా అవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com