వెండితెర ఊర్వశి-శారద

- June 25, 2025 , by Maagulf
వెండితెర ఊర్వశి-శారద

మహానటి అన్న పదానికి నిలువెత్తు రూపం నటి శారద. ఒకప్పుడు జాతీయ ఉత్తమ నటి అవార్డును ‘ఊర్వశి’ అవార్డుగా పిలిచేవారు. అలా ఆ అవార్డును జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న ఏకైక దక్షిణాది నటిగా మన శారదమ్మ  నిలిచిపోయారు. తెరమీద మూస పాత్రలు రాజ్యమేలుతున్న సమయంలో హీరోకి పోటాపోటీ ఉండే పాత్రల్లో నటించి మెప్పించారు. నటిగానే కాకుండా సామాజిక సేవకురాలిగా, రాజకీయవేత్తగా, వ్యాపారవేత్తగా సైతం రాణించారు. నేడు వెండితెర ఊర్వశి శారద జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...

 శారద అసలు పేరు తాడిపర్తి సరస్వతీదేవి. 1945 జూన్ 25న తెనాలిలో చేనేత, స్వర్ణకారుల కుటుంబానికి చెందిన వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే సినిమా పాటలకు తగ్గ నృత్యం చేయడం, ఇతరులను అనుకరించడం చేసేవారు. దాంతో తెనాలి ప్రాంతానికే చెందిన మహానటీమణులు సావిత్రి, జమున అంతటి స్థాయికి చేరుకుంటుందని పెద్దలు దీవించేవారు. పదేళ్ళ ప్రాయంలోనే శారద తెరపై కనిపించి అలరించారు. ఎన్టీఆర్, సావిత్రి నటించిన ‘కన్యాశుల్కం’ చిత్రంలో బాలనటిగా ఓ పాటలో కనిపించారు. ఆ తరువాత మరికొన్ని చిత్రాలలో నటించిన శారద ‘ఇద్దరు మిత్రులు’, ‘ఆత్మబంధువు’, ‘దాగుడుమూతలు’ వంటి పలు చిత్రాల్లో హాస్యనటుడు పద్మనాభం జోడీగా నటించారు.

శారద మాతృభాషలో కథానాయికగా కంటే మలయాళంలో అత్యధిక ఆదరణను చూరగొన్నారు. మలయాళ చిత్రసీమ మాత్రం శారదకు ఎర్రతివాచీ పరచి ఆహ్వానించిందనే చెప్పాలి. అక్కడే తనదైన అభినయంతో శారద మళయాళ వాసులను పరవశింపచేశారు. మళయాళ చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలవగానే, మనవాళ్ళ చూపు సైతం శారదవైపు సాగింది. ఆమెను ‘ఊర్వశి’గా నిలిపిన ‘తులాభారం’ ఆధారంగా తెలుగులో తెరకెక్కిన ‘మనుషులు మారాలి’లోనూ శారద అభినయించారు. ఈ సినిమాతో తెలుగువారిని శారద విశేషంగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత నుంచీ తెలుగు చిత్రాలలోనూ శారద అభినయం వెలుగులు విరజిమ్మింది.

తెలుగులో తొలుత ఎన్టీఆర్, ఏయన్నార్ చిత్రాలలో సెకండ్ హీరోయిన్‌గా ఎక్కువగా నటించారు శారద. అయితే, వారి తర్వాతి తరం హీరోల్లో వెండితెర సోగ్గాడు శోభన్ బాబుకు మాత్రం హిట్ పెయిర్‌గా నిలిచారామె. వారిద్దరూ నటించిన “సిసింద్రీ చిట్టిబాబు, కాలం మారింది, మానవుడు-దానవుడు, శారద, దేవుడు చేసిన పెళ్ళి, జీవితం, ఇదాలోకం, బలిపీఠం, కార్తీక దీపం, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త” వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఆరోజుల్లో వీరిద్దరి జోడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవారు. శోభన్ బాబుతో ఆమె చివరగా నటించిన "ఏవండి ఆవిడ వచ్చింది" చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యి వారి కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని నిరూపించింది.

శారద అంటేనే శోకసముద్రం పొంగిపొరలుతుంది అనే పేరుండేది. ఎందుకంటే ఆమెకు ఊర్వశి అవార్డులు సంపాదించి పెట్టిన చిత్రాలన్నిటా అదే తీరున అభినయం సాగింది. ఎన్టీఆర్‌తో ‘జీవితచక్రం’లో సైడ్ హీరోయిన్‌గా నటించిన శారద ఏ నాడూ ఆయన సరసన మెయిన్ హీరోయిన్‌గా నటించలేకపోయారు. అలాంటి శారద తరువాతి రోజుల్లో ‘సర్దార్ పాపారాయుడు, జస్టిస్ చౌదరి’ చిత్రాల్లోనూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ఓ పాత్రకు జోడీగా నటించారు. ‘దానవీరశూర కర్ణ’లో తొలిసారి ఎన్టీఆర్ దర్శకత్వంలో నటించిన ఆమె, ఆ తరువాత ‘చండశాసనుడు’లో ఆయన చెల్లెలిగా రౌద్రరస పాత్రలో కనిపించారు. ఆ సినిమా తరువాత శారద కెరీర్ మేలుమలుపు తిరిగింది. ఆపై అనేక చిత్రాలలో రౌద్రరస పాత్రలలో శారద తనదైన అభినయంతో అలరించారు.

డేరింగ్ లేడీ పాత్రల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ సొంత బ్యానర్లో వచ్చిన ‘అనసూయమ్మగారి అల్లుడు’ చిత్రం శారద కెరీర్‌ను  మరో మలుపు తిప్పింది. ఆ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో శారద కామెడీని భలేగా పండించారు. అప్పటి నుంచీ పలు చిత్రాలలో హాస్యంతోనూ కూడిన అక్క, అమ్మ, అత్తా పాత్రలకు మొదటి ఛాయిస్‌గా శారద మారిపోయారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలకు అక్కగా, వదినగా, తల్లిగా నటించిన శారద ఆ తరువాతి తరం హీరోలకు అమ్మమ్మగా, నాన్నమ్మగానూ నటించి మెప్పించారు. ఆలా శారద జీవితంలోని పలు మేలుమలుపుల్లో ఎన్టీఆర్ ఉన్నారని ఆమె పదే పదే ఇప్పటికి చెబుతారు.


శారద సినిమా రంగంలో బిజీగా ఉన్న సమయంలోనే పారిశ్రామికవేత్తగా రాణించారు. 1989లో లోటస్ చాక్లెట్ కంపెనీని స్థాపించి ఎందరో మహిళలకు ఉపాధిని కల్పించారు. ఈ సంస్థ తయారు చేసిన "ఆశా చాక్లెట్" ఎంతో ప్రాచుర్యం పొందింది. అయితే, కంపెనీ టర్నోవర్ పెరిగే కొద్దీ ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావడం, విస్తరణ పెట్టుబడి కోసం అదనపు ఆర్థిక వనరుల లేమి కారణంగా ఒక బడా చాక్లెట్స్ తయారీ సంస్థకు అమ్మేశారు. ఆ తర్వాత ఆమె ఎక్కువగా చెన్నై రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు వాటి విలువ కొన్ని కోట్లకు చేరుకుంది.

శారద తెరమీద మహిళల కోసం ఏ విధంగా పోరాడి విజయాలు సాధించారో! అదే విధంగా నిజ జీవితంలోనూ అనేక మహిళా సంఘాలతో కలిసి మహిళల ఆర్థిక సాధికారతకు, సమానత్వం కోసం పోరాడారు. ఇవే కాకుండా సామాజిక అంశాలపై ఎక్కువ అవగాహన ఉన్న ఆమెను   అన్న ఎన్టీఆర్ తన పార్టీలోకి ఆహ్వానించగానే అందులో చేరారు. ఎన్టీఆర్ కోసం ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహించారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న కాలంలో నియోజకవర్గం పరిధిలో ఉన్న గుంటూరు - రేపల్లె  రైల్వే లైను ఆధునీకరణ కోసం నిధులు విడుదల చేయించారు. అలాగే, గ్రామాల్లో రోడ్లు, పాఠశాల భవనాల నిర్మాణాలకు ఎంపీ లాడ్ నిధులతో పాటుగా సొంత నిధులను వెచ్చించారు.

1998లో తెనాలి నుండి రెండోసారి పోటీ చేసి మాజీ కేంద్రమంత్రి శివశంకర్ చేతిలో ఓడారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. అయితే, 2009లో సన్నిహితుల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ, ఏనాడు క్రియాశీలకంగా వ్యవహరించలేదు. 2012 ఒంగోలు ఉపఎన్నికల్లో తమ కుటుంబానికి సన్నిహితులైన మాగుంట సుబ్బరామరెడ్డి సతీమణి పార్వతమ్మ గారి ప్రచారం చేశారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నారు.        

శారద తొలిసారి జాతీయ స్థాయిలో ‘ఊర్వశి’ అవార్డును 1968లో ‘తులాభారం’ అనే మళయాళ చిత్రానికి అందుకున్నారు. ఆ తర్వాత  1972లో ‘స్వయంవరం’ అనే మళయాళ చిత్రం ద్వారా రెండోసారి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అందుకున్నారు. ఎందువల్లో 1973 తరువాత నుంచీ ‘ఊర్వశి’ అన్న టైటిల్‌ను తీసేసి, ‘ఉత్తమ నటి’గానే ఆ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఒకవిధంగా ఆ అవార్డును అందుకున్న ఏకైక తెలుగు నటిగా శారద చరిత్రలో నిలిచిపోయారు.1978లో తెలుగు చిత్రం ‘నిమజ్జనం’లో ప్రదర్శించిన అద్భుతమైన నటనకు గానూ జాతీయ ఉత్తమనటిగా అవార్డును అందుకున్నారు శారద.

ఆ రోజుల్లో అందరూ ఆమెను ‘ఊర్వశి’ శారద అంటూనే పిలిచేవారు. సామాన్యులు సైతం శారదను తెరపై చూడగానే ‘మన ఊర్వశి’ అంటూ ఆరాధించేవారు. 1974లో శారద ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు కె.బాపయ్య ‘ఊర్వశి’ అన్న చిత్రాన్నే రూపొందించారు. అలా ‘ఊర్వశి’ అవార్డుతో శారదలాగా పేరొందిన నటి మరొకరు కానరారు. జాతీయ అవార్డులు మాత్రమే కాకుండా తన నటనతో మెప్పించి అలరించి పలు రాష్ట్రస్థాయి అవార్డులు, పరిశ్రమకు చేసిన విశిష్ట సేవలకు గాను ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ప్రేమ్ నజీర్ అవార్డు మరియు పలు జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్నారు. ఏది ఏమైనా ఈ నాటికీ ఆ నాటి అభిమానులు శారద పేరు వినగానే ‘ఊర్వశి’ శారద అని గుర్తు చేసుకుంటారు.ఈ రోజుతో 80వ ఏటకు అడుగుపెట్టిన శారదమ్మ, మరిన్ని వసంతాలు పూర్తి చేసుకొని  ఆనందంగా జీవించాలని ఆశిద్దాం.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com