సీనియర్ యాక్ట్రస్-గౌతమి

- July 02, 2025 , by Maagulf
సీనియర్ యాక్ట్రస్-గౌతమి

సీనియర్ నటి గౌతమి గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు అమ్మాయైన తమిళ సినిమాలతో స్టార్ స్టేటస్ దక్కించుకుంది. తమిళ సినిమాలు చేస్తూనే అపుడపుడు తన మాతృ భాష తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా అలరించింది. ఈ రోజు నటి గౌతమి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం...

గౌతమి అలియాస్ తాడిమల్ల గౌతమి 1968, జూలై 2న శ్రీకాకుళంలో డాక్టర్స్ దంపతులైన టి. ఆర్. శేషగిరిరావు, వసుంధరా దేవి దంపతులకు జన్మించారు. గౌతమి చిన్నతనంలోనే వారి కుటుంబం విశాఖపట్నంలో స్థిరపడింది. విశాఖలోనే ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమా అవకాశాలు రావడంతో చిత్రసీమలో తన అదృష్టం పరీక్షించుకుంది గౌతమి. ‘దయామయుడు’ సినిమాలో సరదాగా కనిపించినా, పి.ఎన్. రామచంద్రరావు దర్శకత్వంలో శరత్ బాబు నిర్మించిన ‘గాంధీనగర్ రెండో వీధి’లో హీరోయిన్ గా నటించింది.

మోడర్న్ గర్ల్ ను తలపించే గౌతమికి కెరీర్ ప్రారంభంలోనే తమిళంలోనూ మంచి అవకాశాలు వచ్చాయి. రజనీకాంత్, ప్రభు హీరోలుగా నటించిన ‘గురుశిష్యన్’లో పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించింది గౌతమి. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలోనూ నటిగా అతి తక్కువ కాలంలో పేరు తెచ్చుకుంది. తెలుగులో ‘శ్రీనివాస కళ్యాణం, బజార్ రౌడీ, భార్యభర్తలు, తోడల్లుళ్ళు, ఆగస్ట్ 15 రాత్రి’ వంటి సినిమాలలో నటించింది. అలానే ‘బామ్మ మాట బంగారు బాట, చైతన్య, సంకల్పం, అన్న’ వంటి చిత్రాలూ గౌతమికి పేరు తెచ్చిపెట్టాయి.

అయితే మాస్ హీరోలతో సూపర్ హిట్స్ మాత్రం గౌతమికి తెలుగులో లభించలేదు. అదే సమయంలో తమిళనాడులో టాప్ హీరోస్ గా రాణిస్తున్న రజనీకాంత్, కమల్ హాసన్ సరసన పలు చిత్రాలలో నటించింది. ముఖ్యంగా ‘అపూర్వ సోదరంగళ్, రాజా చిన్ని రోజా, దేవర మగన్’ వంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇక గౌతమి వెనుదిరిగి చూసుకోలేదు. అటు కన్నడ, మలయాళ, ఇటు హిందీ భాషల్లోనూ అవకాశాలు గౌతమిని వెతుక్కుంటూ వచ్చాయి. శంకర్ తెరకెక్కించిన ‘జంటిల్మాన్’లో ప్రభుదేవాతో కలసి ‘చికుబుకు చికుబుకు రైలే’ పాటలో నర్తించిన గౌతమి కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం పొందేసింది. నటిగా పుష్కర కాలం పాటు ప్రేక్షకులను మెప్పించిన ఆమె 1998లో సందీప్‌ భాటియాను వివాహం చేసుకుంది. వారికి సుబ్బులక్ష్మీ అనే పాప పుట్టింది. ఆ వెంటనే గౌతమి భర్తకు విడాకులిచ్చేసింది.

సినిమాలలో అవకాశాలు వచ్చినప్పుడు నటిస్తూ, లేనప్పుడు టీవీ షోస్ చేస్తూ నెగ్గుకొచ్చింది. తమిళంలో ‘ఇందిర’ సీరియల్ లో గౌతమి ప్రధాన పాత్ర పోషించింది. అదే సమయంలో ఆమెకు కమల్ హాసన్ బాసటగా నిలిచాడు. ఐదేళ్ళ పాటు ఒంటరి పోరాటం చేసిన గౌతమి 2004లో కమల్ హాసన్ నీడన చేరింది. ఆ సమయంలో కమల్ హాసన్ నటించి, నిర్మించిన పలు చిత్రాలకు గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది.దాదాపు 16 సంవత్సరాల తర్వాత గౌతమి మలయాళ చిత్రం ‘దృశ్యం’ తమిళ రీమేక్ ‘పాపనాశనం’లో కమల్ సరసన నటించింది. అయితే 13 సంవత్సరాల కమల్ తో సహజీవనానికి గౌతమి బ్రేక్ చెప్పేసింది. కమల్ హాసన్ నీడలో తనకు ఆర్థిక స్వాతంత్రం, వ్యక్తిగత స్వేచ్ఛ కరువు అవుతున్నాయంటూ కూతురుతో కలిసి కమల్ ఇంటి నుండీ బయటకు వచ్చేసింది.

ఆ తర్వాత పరభాషా చిత్రాలలోనూ నటించడం మొదలు పెట్టింది. ఆ రకంగా మోహన్ లాల్ సరసన తెలుగు సినిమా ‘మనమంతా’లో గౌతమి నాయికగా నటించింది. చాలా యేళ్ళ తర్వాత గౌతమి నటించిన స్ట్రయిట్ తెలుగు చిత్రం ఇదే.ప్రస్తుతం గౌతమి తమిళంతో పాటు మలయాళ చిత్రాలలోనూ ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తోంది. కూతురుకు ఐదేళ్ళ వయసులో గౌతమి క్యాన్సర్ బారిన పడింది. అయితే తల్లిదండ్రులు, బంధువులు ఇచ్చిన మోరల్ సపోర్ట్ తో గౌతమి క్యాన్సర్ ను జయించింది.క్యాన్సర్ ను జయించిన అనంతరం తానే ఓ మోటివేటర్ గా మారి, క్యాన్సర్ రోగులలో ధైర్యాన్ని నింపే పనిని గౌతమి చేపట్టింది.

నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా, సామాజిక కార్యకర్తగా నిరంతరం తనని తాను అప్ డేట్ చేసుకోవడం గౌతమికి అలవాటు. అందుకే ఈ తరంతోనూ కలిసి ముందడుగు వేస్తోందామె. నటన – సమాజసేవలను బ్యాలెన్స్ చేస్తోంది.గౌతమి సంపూర్ణ ఆరోగ్యంతో మరికొంత కాలం నటిగా చిత్రసీమలో కొనసాగాలని కోరుకుందాం.

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com