డ్రోన్ మార్ట్ పోర్టల్ ప్రారంభించిన సిఎం చంద్రబాబు

- July 15, 2025 , by Maagulf
డ్రోన్ మార్ట్ పోర్టల్ ప్రారంభించిన సిఎం చంద్రబాబు

విజయవాడ: టెక్నాలజీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ను సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డ్రోన్ మార్ట్ ద్వారా వ్యవసాయం సహా వివిధ రంగాల్లో డ్రోన్ల ద్వారా సేవలు పొందేందుకు పోర్టల్ను ఏపీ డ్రోన్ కార్పోరేషన్ రూపొందించింది. ఏపీ డ్రోన్ మార్ట్ పోర్టల్ ద్వారా వ్యవసాయం, ఇన్ఫ్రా, విపత్తు నిర్వహణ వంటి అంశాల్లో ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చు.

అన్ని జిల్లాల్లోనూ డ్రోన్ మార్ట్ సేవలు
రైతులు తమ పొలాల్లో మందులు పిచికారీ చేయాలంటే డ్రోన్లు వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పంటల పర్యవేక్షణ కూడా చేపట్టవచ్చు. ఇలాంటి సేవలను పోర్టల్ ద్వారా సాధారణ రైతులూ వినియోగించుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇప్పుడు అందరికీ కల్పిస్తోంది. అలాగే డ్రోన్లతో టెక్నాలజీని వినియోగించుకుని సర్వేలు చేపట్టడం, పెద్ద ఎత్తున పనులు చేపట్టే సందర్భంలో డ్రోన్లతో పర్యవేక్షించడం, సెక్యూర్టీ, మ్యాపింగ్ వంటి సేవలు డ్రోన్ల ద్వారా చేపట్టవచ్చు.ఈ తరహా సేవలను ఇకపై డ్రోన్ మార్ట్ ద్వారా పొందవచ్చు. డ్రోన్ మార్ట్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అందుబాటులోకి తెచ్చారు. డ్రోన్ సేవలు అవసరమైన వారికి సర్వీస్ ప్రొవైడర్లను డ్రోన్ మార్ట్ పోర్టల్ అందుబాటులోకి తెస్తుంది. ప్రభుత్వ విభాగాలను, వివిధ సంస్థలను, సర్వీస్ ప్రొవైడర్లను ఈ పోర్టల్ అనుసంధానం చేస్తుంది. సర్వీస్ ప్రొవైడర్లతో కస్టమర్లు సర్వీస్ ఛార్జీలపై సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన సేవలతో పాటు ఈ పోర్టల్ భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని సేవలు అందించేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. డ్రోన్ సేవలు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేలా చూస్తే.. మరింత ఆదరణ పెరుగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు .

ఏపీ డ్రోన్ పథకం ఏమిటి?
వ్యవసాయం, లాజిస్టిక్స్, విపత్తు నిర్వహణ మరియు మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలలో డ్రోన్‌లను సేవలుగా ప్రారంభించడంపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి చెందుతున్న డ్రోన్ పర్యావరణ వ్యవస్థ కోసం రాష్ట్ర దార్శనికతను ఏకీకృతం చేయడం ఈ చొరవ లక్ష్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com