వామపక్ష కార్యనిర్వహణ దిగ్గజం-ప్రమోద్ దాస్ గుప్తా
- July 21, 2025
భారత వామపక్ష ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. దేశానికి స్వాతంత్య్రం రాక ముందే ఆ ప్రాంతంలో ఎర్ర జెండా రెపరెపలాడింది. ఎర్ర సమూహం నుంచి పుట్టుకొచ్చిన జ్యోతి బసు, ఇంద్రజిత్ గుప్తా, హిరేన్ ముఖర్జీ, భూపేష్ గుప్త వంటి వారు జాతీయ రాజకీయాల్లో కీలకమైన పాత్ర పోషించారు. అయితే, వీరందరి ఎదుగుదల కోసం తెరవెనుక అలుపెరగని కృషి చేసిన వ్యక్తి ప్రమోద్ దాస్ గుప్తా. వామపక్ష కూటమిని బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేకుండా చేసిన వ్యక్తి ఈయన. సీపీఎం పార్టీని సంస్థాగతంగా బలోపేతానికి ప్రమోద్ దా చేసిన కృషి మరువలేనిది. నేడు వామపక్ష దిగ్గజం కామ్రేడ్ ప్రమోద్ దాస్ గుప్తా మీద ప్రత్యేక కథనం...
కామ్రేడ్ పీడీజి, ప్రమోద్ దాగా సుపరిచితులైన ప్రమోద్ దాస్ గుప్తా 1910, జూలై 7న ఒకప్పటి తూర్పు బెంగాల్ రాష్ట్రంలోని ఫరీదుపూర్ జిల్లా కౌరుపూర్ గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రభుత్వ వైద్యుడిగా పలు ప్రాంతాల్లో పనిచేశారు. అందువల్ల బాల్యం, విద్యాభ్యాసం స్థిరంగా ఒక చోట సాగలేదు. ప్రమోద్ బారీసాల్ పట్టణంలోని బ్రజ్మోహన్ కళశాలలో డిగ్రీ చదువుతూనే కొన్ని కారణాల వల్ల మధ్యలో వదిలేశారు. ఆ తర్వాత ఉపాధి నిమిత్తం కలకత్తా చేరుకొని వివిధ పనులు చేశారు.
ప్రమోద్ చిన్నతనంలోనే బెంగాల్ విభజన జరిగిన తీరును గురించి కథలు కథలుగా విన్నారు. విభజన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోని దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనాలని తపించారు. బారీసాల్ పట్టణంలో చదువుతున్న సమయంలోనే అనుశీలన్ విప్లవ ఉద్యమ సమితిలో సభ్యుడయ్యారు. అనుశీలన్ సమితి అగ్రనేతల ఆదేశాల మేరకు చదువు మధ్యలోనే వదిలేసి కలకత్తాకు చేరుకున్నారు. పగలు రక రకాల ఉద్యోగాలు చేస్తూ, రాత్రి కాగానే సమితి కార్యకలాపాల్లో పాల్గొనేవారు. అక్కడే బాంబులు తయారు చేయడం, తుపాకీ కాల్చడంలో శిక్షణ పొందారు. 1929లో మచువా బజార్ బాంబ్ పేలుడు కేసులో సతీష్ ప్రకర్షి, సుధాన్షు దాస్ గుప్తా, సత్యబ్రత సేన్లతో పాటుగా వీరు నిందితులుగా అరెస్ట్ అయ్యి 1937 వరకు జైల్లోనే గడిపారు.
జైల్లో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ సోషలిస్టు నేతలు, వామపక్ష మేధావులు పరిచయం అయ్యారు. వారి సహచర్యంలో వామపక్ష మూల భావజాలం పట్ల ఆకర్షితులయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 1938 ప్రథమార్ధంలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం పొందారు. ఆ తర్వాత వామపక్ష పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమై కలకత్తాలోని అనుశీలన్ సమితి సభ్యులను సైతం పార్టీలోకి తెచ్చారు. 1939లో కలకత్తా పట్టణ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి 1945 వరకు కొనసాగారు. ఇదే సమయంలోనే జ్యోతి బసు, హరే కృష్ణ కోనార్, జ్యోయ్ చౌధరి, ఇంద్రజిత్ గుప్తా, భూపేశ్ గుప్త వంటి యువ వామపక్ష నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారిలాగా చదువుకోక పోయినా కార్మిక, కర్షక వర్గాల్లో మంచి గుర్తింపును సాధించారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే వామపక్ష కార్యకలాపాల ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే మిషతో బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి కొన్ని నెలల పాటు జైల్లో వేసింది. జైల్లో ఉన్నప్పటికి పార్టీ నిర్మాణ, పోరాట కార్యక్రమాలను నిర్విఘ్నంగా సాగిస్తూ వచ్చారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బెంగాల్ కమ్యూనిస్టు పార్టీ పొలిట్ బ్యూరోలో సభ్యత్వం పొందడమే కాకుండా, పార్టీ సిద్ధాంతాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన జన యుద్ద్ వార పత్రికను నడిపారు. జన యుద్ద్ తర్వాత స్వాదింత అనే దినపత్రికను స్థాపించి దాన్ని బెంగాల్ వ్యాప్తంగా విస్తరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీపై మళ్ళీ నిషేధం విధించడంతో పాటుగా, దేశ సమైక్యతకు విఘాతం కలిగించే ప్రచురణలు ముద్రిస్తున్నారనే ఉద్దేశ్యంతో ప్రమోద్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 1948-51 వరకు జైల్లోనే గడిపారు.
1951 నుంచి 1958 వరకు పశ్చిమ బెంగాల్ పార్టీ డిప్యూటీ ఆర్గనైజర్ బాధ్యతలు నిర్వహించిన ప్రమోద్ పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో విస్తరణ కార్యక్రమాలు, కార్మిక & కర్షక ఉద్యమాలను నిర్వహించారు. 1958లో జాతీయ పొలిట్ బ్యూరో సభ్యుడైన తర్వాత నుంచి ఆర్గనైజర్ స్థానం నుంచి వైదొలిగి బెంగాల్ పార్టీ కోర్ కమిటీ వ్యవహారాలను, పార్టీ రిక్రూట్మెంట్ పనులు పర్యవేక్షణ చేసేవారు. 1961లో బెంగాల్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత నుంచి జిల్లా, బ్లాక్ మరియు గ్రామ స్థాయి పార్టీ పదవుల్లో యువతకు పెద్దపీట వేస్తూ నూతన కార్యవర్గ సభ్యులను చేర్చే పనిని సులభతరం చేశారు. 1962 ఇండియా - చైనా యుద్ధ సమయంలో చైనా సానుభూతి పరులైన కమ్యూనిస్టు నేతలను అరెస్ట్ చేయగా వారిలో ప్రమోద్ దా కూడా ఉన్నారు.
1964లో విజయవాడ కేంద్రంగా జరిగిన మహాసభల్లో కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలగా, ప్రమోద్ దాస్ గుప్తా నేతృత్వంలోని మెజారిటీ బెంగాల్ కమ్యూనిస్టులు సీపీఎం వైపు చేరారు. వీరికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ నాయకులుగా కూడా సీపీఎం పక్షాన నిలవడం గమనార్హం. సీపీఎం విధి విధానాల రూపకల్పనలో ప్రమోద్ కీలకమైన పాత్ర పోషించారు. 1964లో బెంగాల్ సీపీఎం పగ్గాలను చేపట్టి పార్టీని ప్రజల్లో బలీయమైన శక్తిగా మలిచేందుకు అనేక నూతన పద్దతులను ప్రవేశపెట్టారు. పార్టీ అనుబంధంగా ఉన్న సిఐటీయూ, ఎస్.ఎఫ్.ఐ విభాగాలను బలోపేతం చేయడానికి ఉద్దండ నేతలను రంగంలోకి దించారు. మిగిలిన రాష్ట్రాల్లో సిఐటీయూ నామమాత్రంగా ఉన్నప్పటికి బెంగాల్లో మాత్రం ఇప్పటికి బలమైన కార్మిక సంఘంగా వర్థిల్లితూ ఉంది.
1967 లోక్ సభ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడమే లక్ష్యంగా ఐక్య ప్రజాస్వామ్య వామపక్ష ఫ్రంట్ ఏర్పాటు చేసి సోషలిస్టు, జనసంఘ్ పార్టీలు మినహా మిగిలిన అన్ని పార్టీలను కలుపుకొని ఎన్నికల బరిలోకి దిగడం కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగిపోయింది. ఈ ఫ్రంట్ రూపకర్తల్లో ప్రమోద్ ఒకరు. 1967-71 వరకు సాగిన ఈ ప్రభుత్వంలో అజోయ్ ముఖర్జీ సీఎంగా, జ్యోతి బసు డిప్యూటీ సీఎంగా వ్యవహరించారు. అయితే, ముఖర్జీ శిష్యుడైన ప్రణబ్ ముఖర్జీ వామపక్ష ఎత్తుగడల మూలంగా రాజకీయ ఉనికి ప్రమాదం రాబోతుందని గురువును హెచ్చరించి తమ బంగ్లా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయించారు. అజోయ్, ప్రణబ్ ఆడిన ఆటలో ప్రమోద్ నేతృత్వంలోని సీపీఎం మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది.
1971-77 వరకు మళ్ళీ ప్రజల్లో పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న సమయంలోనే ఇందిరా గాంధీ విధించిన ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రమోద్, జ్యోతి బసుల నాయకత్వంలో బెంగాల్ రాష్ట్రంలో సీపీఎం శ్రేణులు ఉద్యమించారు. వీరికి జతగా సోషలిస్టులు, జనసంఘ్ నేతలు సైతం ఉద్యమించారు.1975-77 మధ్యన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. 1977లో విడుదలైన తర్వాత లోక్ సభ ఎన్నికల్లో జనతా పార్టీతో కలిసి పోటీ చేయగా విజయ దుందుభి మోగించారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీతో సీట్లు సర్దుబాటు కాక సొంతంగా బరిలోకి దిగాలని ప్రమోద్ నిర్ణయించి పార్టీ నేతల ఆమోద ముద్ర వేయించారు. ఇదే సమయంలో వామపక్ష కూటమిని ఏర్పాటు చేసి ఇతర ఐక్య భావజాల పార్టీలను చేర్చుకున్నారు. ఆ ఎన్నికల్లో జ్యోతి బసును పార్టీ సీఎం అభ్యర్థిగా ముందుపెట్టి, పార్టీ అభ్యర్థుల ఎంపిక, వ్యూహ రచన, ఎన్నికల ప్రచార నిర్వహణ వ్యవహారాలను చూసుకున్నారు. జ్యోతి బసు చరిష్మా, ప్రమోద్ వ్యూహ చతురత వల్ల వామపక్ష కూటమి బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేయడం జరిగింది.
1977-82 వరకు జ్యోతి బసు సీఎంగా ఉన్నప్పటికి, ప్రమోద్ దాస్ గుప్తానే ప్రభుత్వాన్ని నడిపించారు. అభివృద్ధి వ్యవహారాలను బసుకు అప్పగించి, మిగిలిన అన్ని విషయాల్లో తన ఆమోదం లేకుండా రైటర్స్ బిల్డింగ్స్ నుంచి ఒక్క ఫైలును కదిలేదు కాదు. వామపక్ష కూటమి అధ్యక్షుడిగా, సీపీఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూనే ప్రభుత్వాన్ని పార్టీ కార్యాలయం నుంచే నియంత్రిస్తూ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత శక్తివంతుడైన నాయకుడిగా తయారయ్యారు. కేంద్రంలో జనతా ప్రభుత్వం సైతం జ్యోతి బసు కంటే ప్రమోద్ దాస్ గుప్తాతోనే ఎక్కువ సంప్రదింపులు జరిపేది. బెంగాల ఆర్థిక శాఖను గాడిలో పెట్టేందుకు ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్న అశోక్ మిత్రాను ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ ఐదేళ్ల పాలనలో ప్రమోద్ మాటను జ్యోతి బసు ఏనాడు జవ దాటలేదు. ఆ ఐదేళ్ళ కాలంలో ప్రభుత్వాన్ని ఉపయోగించి పార్టీని అన్ని విధాలా బలోపేతం చేశారు. అందువల్లనే ఆ తర్వాత మూడు దశాబ్దాల పాటు బెంగాల్ రాష్ట్రంలో వామపక్ష పాలన సాగింది.
నాలుగున్నర దశబ్దాల రాజకీయ జీవితంలో ప్రమోద్ ఏనాడు పార్టీని, సిద్ధాంత భావజాలానికి దూరం జరగలేదు. క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా మెలుగుతూ, పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అందుబాటులో ఉండేవారు. దాదాపు 18 ఏళ్ళ పాటు బెంగాల్ సీపీఎం పగ్గాలను నిర్వహించారు. ఎందరో కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దారు. స్నేహితుడైన బసును రాజకీయాల్లో ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్దపడటమే కాకుండా, బసుకు రాజకీయ ప్రత్యర్థులను బలహీన పరిచారు. కరుడుగట్టిన వామపక్ష నేతగా ఉన్నా ఇతర పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు నెరిపారు, వారి అవసరాలను తీర్చారు కూడా. భారత మార్క్సిజం ఉద్యమంలో ప్రమోద్ దా లాంటి సుశిక్షతుడైన నేతను కలిగి ఉండటం వామపక్షాల అదృష్టం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు.కమ్యూనిజం అంటే చివరి వరకు వల్లమాలిన అభిమానాన్ని చూపించిన ప్రమోద్ దాస్ గుప్తా చైనా కమ్యూనిస్టు పార్టీ ఆహ్వానం మేరకు ఆ దేశంలో పర్యటన చేస్తూ ఉన్న సమయంలోనే 1982, నవంబర్ 29న కన్నుమూశారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!