హైదరాబాద్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు
- September 11, 2025
న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్, అమరావతిల మధ్య రవాణా సౌకర్యాలను మరింత వేగవంతం చేయడానికి ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ లో మరో కీలక మైలురాయి చేరుకుంది. ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు, సర్వేలు, పరిశీలనలు జరుపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు దాదాపు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశాయి. ఈ కొత్త రహదారి పూర్తయితే రెండు ప్రధాన నగరాల మధ్య ఉన్న దూరాన్ని మాత్రమే కాదు, ప్రయాణ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించనుంది.
ప్రస్తుతం హైదరాబాద్ నుండి అమరావతి చేరుకోవాలంటే నాలుగున్నర గంటల సమయం పట్టుతుంది. అయితే, ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తే కేవలం రెండున్నర గంటల్లోనే ప్రయాణం పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే, ఇప్పటి కంటే సుమారు రెండు గంటలు సమయం ఆదా అవుతుంది. దీని వలన వ్యాపార ప్రయాణాలు, అధికారిక పనులు, అలాగే విద్యార్థుల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజనల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య ముచ్చర్లలో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీకి సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారికి కుడివైపుగా తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఇది సాగుతుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి సమీపంలో అమరావతికి చేరుకుంటుంది. అక్కడి నుంచి లంకెలపల్లి మీదుగా బందరు పోర్టు వరకు ఈ రహదారిని అనుసంధానిస్తారు.
మొత్తం 297.82 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. దీని ప్రకారం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి దూరం 211 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ప్రస్తుత మార్గంతో పోలిస్తే 57 కిలోమీటర్లు తక్కువ.ఈ ఎక్స్‌ప్రెస్‌వేను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 12 వరుసలతో నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.
దీనికి కేంద్రం ఆమోదం లభిస్తే, ఇది దక్షిణ భారతదేశంలోనే తొలి 12 వరుసల ఎక్స్‌ప్రెస్‌వే అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలుత 6 లేదా 8 వరుసలతో నిర్మించి, దశలవారీగా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి ప్రాథమిక అంచనాల ప్రకారం దీనికి రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని భావిస్తున్నారు.
ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుబంధంగా మరిన్ని కీలక ప్రాజెక్టులు రానున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న డ్రైపోర్టును ఈ రహదారితో అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల డ్రైపోర్టు నుంచి నేరుగా బందరు పోర్టుకు సరుకు రవాణా సులభతరం అవుతుంది. ఇదే మార్గం వెంట హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.
తాజా వార్తలు
- నేపాల్: మళ్లీ కోలుకోవడం కష్టమే!
- భారతీయులకు వీసాలు ఇవ్వొద్దు: చార్లీ కిర్క్
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!