భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్‌స్టిట్యూషన్’ సదస్సు
- September 25, 2025
-గ్లోబల్ చిప్ ఎకోసిస్టమ్‌కు రోడ్‌మ్యాప్ రూపొందించనున్న సదస్సు
హైదరాబాద్: టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం (టీ-చిప్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నుంచి 28 వరకు హైదరాబాద్ నగరంలో నిర్వహించబోయే టీ-చిప్ సెమీకాన్ రాజ్యాంగ సదస్సు 2025 సెమీకండక్టర్ రంగానికి ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు, విద్యా మరియు శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సదస్సులో భాగస్వాములుకానున్నారు. ఈ సదస్సు ద్వారా ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్‌స్టిట్యూషన్’ అనే మార్గసూచక రాజ్యాంగం రూపుదిద్దుకోనుంది.
ఈ సదస్సు సాధారణంగా జరిగే సాంకేతిక సమావేశం కాదని, భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన దిశను నిర్దేశించేందుకు తీసుకున్న కీలక ప్రయత్నమని నిర్వాహకులు తెలిపారు. టాలెంట్, డిజైన్, మాన్యుఫ్యాక్చరింగ్, అప్లికేషన్స్ అనే నాలుగు ముఖ్యమైన అంశాలపై ఆధారపడిన టీ-చిప్ వ్యూహం ఆధారంగా ఇది సెమీకండక్టర్ ఆలోచన విధానానికి ప్రతి ఘట్టాన్ని అభివృద్ధి చేసే దిశగా ఒక రోడ్‌మ్యాప్‌గా పని చేయనుంది.
ఈ రెండు రోజుల సదస్సులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి కీలక అధికారులతో పాటు ఎలక్ట్రానిక్స్, విద్యా మరియు రక్షణ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్ట రెడ్డి, ప్రధాన యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల విభాగాధిపతులు, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ (ఐఈఎస్ఏ) డైరెక్టర్ డా. కె. జి. విశ్వనాథన్, క్వాంటం టెక్నాలజీస్ డైరెక్టర్ శ్రీ చెల్లె వెంకట రామరాజు తదితరులు పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో తైవాన్‌కు చెందిన నేషనల్ యాంగ్ మింగ్ చియో టంగ్ యూనివర్శిటీ (ఎన్ వై సి యు), తైవాన్ సెమీకండక్టర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టిఎస్ఆర్ఐ), ఏఆర్ఎం, జియుఎస్ టెక్నాలజీ సంస్థల ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారు. గస్ టెక్నాలజీ సీఈఓ సీసీ ఛాంగ్ ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు.
ఈ సదస్సులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన స్వదేశీ చిప్‌ను మొట్టమొదటిసారిగా ప్రజలకు పరిచయం చేయనున్నారు. ఇది భారతదేశం సెమీకండక్టర్ రంగంలో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో ఒక మైలురాయి కానుంది.
సదస్సులో సెమీకండక్టర్ రంగంపై అనుభవజ్ఞుల “టి చిప్” మరియు వివిధ సంస్థల మధ్య అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. చివరగా జరిగే నెట్‌వర్కింగ్ డిన్నర్‌లో సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ప్రముఖులు భవిష్యత్తు సహకార మార్గాలపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా టీ-చిప్ చైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ, “టీ-చిప్ సెమీకాన్ రాజ్యాంగ సదస్సు ఒక సాధారణ ఈవెంట్ కాదు, ఇది ఒక ఉద్యమం. ప్రభుత్వ, విద్య, పరిశ్రమ రంగాల నేతలు అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్‌లో గ్లోబల్ సెమీకండక్టర్ రంగానికి ఒక మార్గదర్శక రాజ్యాంగాన్ని రూపొందించనున్నారు. తెలంగాణలో ఇది ప్రారంభ బిందువుగా ఉంటే, లక్ష్యం మాత్రం భారత్‌తో పాటు ప్రపంచాన్ని సేవ చేయడమే” అని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 1.5 మిలియన్ సెమీకండక్టర్ నిపుణుల కొరత ఏర్పడనుందని అంచనా. ఒక్క భారతదేశానికి కనీసం 85,000 మంది నిపుణులు అవసరమవుతారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమ్మిట్ గ్లోబల్ సెమీకండక్టర్ విప్లవంలో భారత్‌ను ముఖ్యంగా తెలంగాణను ముందంజలో నిలిపే అవకాశం కలిగించనుంది.
మరిన్ని వివరాలు, నమోదు మరియు పాల్గొనదలచిన వారు http://tinyurl.com/t-semicon వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా +91 80199 77575 నంబర్‌కు సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్య సేవలు
- భారతదేశంలోనే తొలి ‘గ్లోబల్ సెమీకండక్టర్ కాన్‌స్టిట్యూషన్’ సదస్సు
- భక్తుల సేవ కోసం సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్
- అక్టోబర్ 23 నుంచి ఖతార్ మ్యూజియమ్స్ వార్షికోత్సవ సీజన్..!!
- బహ్రెయిన్ లో అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం..!!
- విజిటర్స్ ఎంట్రీ పర్మిట్ కోసం పాస్‌పోర్ట్ కవర్ కాపీని సమర్పించాలా?
- భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాకు ఘనంగా వీడ్కోలు..!!