సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు

- November 10, 2025 , by Maagulf
సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు

న్యూ ఢిల్లీ: సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి మరోసారి జాతీయ దృష్టిని ఆకర్షించనుంది. ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోదీ, 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తి దర్శనానికి రానున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.ఈ మహోత్సవాన్ని దేశవ్యాప్తంగా గుర్తుండిపోయేలా చేయాలని సీఎం ఆదేశించారు.

ఉత్సవాల సందర్భంగా దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు, సేవకులు, ప్రముఖులు పుట్టపర్తికి చేరుకోనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రాకపోకల సౌకర్యం కోసం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించింది. పుట్టపర్తిలో భక్తుల సౌకర్యార్థం రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, వైద్య సదుపాయాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఇక రైల్వే శాఖ కూడా విస్తృత ప్రణాళికతో ముందుకొచ్చింది. ఈ నెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు పుట్టపర్తికి 682 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. అదనంగా 65 ప్రత్యేక రైళ్లు భక్తుల సౌకర్యార్థం నడపాలని నిర్ణయించారు.ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి స్టేషన్ పరిసరాల్లో భద్రతా బలగాలను మోహరించడం, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, మెడికల్ టీమ్‌లు, వాలంటీర్ సేవలను ఏర్పాటు చేయనున్నారు.

సత్యసాయి శతజయంతి ఉత్సవాలు భక్తి, సేవ, స్ఫూర్తికి ప్రతీకగా నిలవనున్నాయి. ఈ సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, గ్లోబల్ కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహించనున్నారు. పుట్టపర్తి తిరిగి ఆధ్యాత్మిక తేజస్సుతో నిండిపోనున్నదని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com